కక్ష సాధింపు!

TDP Removed From RP Post in Visakhapatnam - Sakshi

 పార్టీ మారినందుకు ఆర్‌పీ పోస్టు తొలగింపు

నాలుగో వార్డు టీడీపీ నాయకుల బాగోతం

తమకు సమాచారం లేదన్న ఏపీడీ లక్ష్మి

మధురవాడ(భీమిలి): మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో నాయకులు పెత్తనం చెలాయించడం చూశాం. తాజాగా జీవీఎంసీ 4వ వార్డు కొమ్మాది జేఎన్‌ఎన్‌యూఆర్‌–3 కాలనీలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిందనే  నెపంతో జీవీఎంసీ యూసీడీ విభాగం ఆధ్వర్యంలో నడిచే ఆర్‌పీని తొలగిస్తున్నామని టీడీపీ నాయకులు ప్రకటించడం వివాదాస్పదమవుతోంది.

ఇదీ పరిస్థితి
వారం రోజుల కిందట కే 3 కాలనీ కమ్యూనిటీ హాలులో డ్వాక్రా మహిళలకు పసుపు– కుంకుమ  చెక్కుల పంపిణీకి సమావేశం నిర్వహించారు. దీనికి టీడీపీ 4వ వార్డు అధ్యక్షుడు మన్యాల సోంబాబు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఆర్‌పీ(రిసోర్స్‌ పర్శన్‌) గా పనిచేస్తున్న రేణుకను తొలగించాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇది సరికాదని... ఆమె బాగా పనిచేస్తున్నా ఎందుకు తొలగిస్తున్నారని అత్యధికులు ప్రశ్నించారు. దీనికి ఆయన ఇది మంత్రి గంటా శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయమనిసెలవిచ్చి వెళ్లిపోయారు. పైగా గ్రూపునకు ఇద్దరు చొప్పున ఉండి అంతా బయటకు వెళ్లిపోవాలని చెప్పి కొందరితో సంతకాలు చేయించుకున్నట్టు స్థానిక డ్వాక్రా మహిళలు చెప్పారు. బాగా పనిచేస్తున్న మహిళని రాజకీయం పేరుతో తొలగించడం సరికాదని ఓబీలు యూవీవీ దుర్గా భవానీ, బి. సుగుణ, పి. రామూజీ, ఇ. గౌరి, వి. దేవి తదితరులు వాపోయారు.

ఉన్నతాధికారులను ఆశ్రయిస్తా
టీడీపీ నాయకుల ప్రకటనపై రేణుక మాట్లాడుతూ ఎనిమిదేళ్ల నుంచి ఇక్కడ ఆర్‌పీగా  జీతం లేకుండా పనిచేశానన్నారు. ఇప్పుడు జీతం వస్తుందని పార్టీ మారానన్న వంక పెట్టి తనను తొలగిస్తున్నట్టు టీడీపీ నాయకుడు సోంబాబు ప్రకటించడం అన్యాయమని పేర్కొన్నారు. కాలనీలో 13 గ్రూపులు ఉండగా 10 గ్రూపులకు చెందిన వారు తానే ఆర్‌పీగా  ఉండాలని కోరుతున్నా ఏకపక్షంగా టీడీపీ నాయకులు తొలగిస్తున్నట్టు చెప్పడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు  అన్యాయం జరిగితే ఉన్నతాధికారుల ను ఆశ్రయిస్తానని రేణుకు చెప్పారు.

 సమాచారం లేదు
సాధారణంగా ఆర్‌పీపై ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తాం.  అత్యధికులు కోరుకున్నవారే ఆర్‌పీగా కొనసాగుతారు. తొలగింపు, మార్పు అవసరం అయితే  పీడీ గారి ద్వారానే జరుగుతుంది. ఆర్పీ మార్పు విషయమై ఇంత వరకు మాకు సమాచారం లేదు.      –  లక్ష్మి, జీవీఎంసీ జోన్‌–1 ఏపీడీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top