నేతల మేత.. నాణ్యతలో కోత 

TDP  Party Leaders Do Not Have A High Quality Government Work - Sakshi

సాక్షి, బొమ్మలసత్రం(నంద్యాల ): టీడీపీ నేతల అవినీతి అక్రమాలకు అంతే లేకుండా పోయింది. అభివృద్ధి పేరుతో నిధులను అడ్డంగా కొల్లగొడుతున్నారు. ప్రతి పనిలోనూ కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. చివరకు పేదల వైద్యానికి ఉద్దేశించిన వాటినీ వదలడం లేదు. ‘పనులు ఎలాగైనా చేసుకోండి.. మా కమీషన్లు మాకు ఇవ్వాల్సిందే’ అంటూ కుండబద్దలు కొడుతున్నారు. ఫలితంగా పనుల నాణ్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. నంద్యాల పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి నిత్యం వివిధ ప్రాంతాల నుంచి రోగులు పెద్దసంఖ్యలో వస్తుంటారు.

ప్రతిరోజూ 1,200 మంది దాకా ఔట్‌ పేషెంట్లు (ఓపీ) ఉంటారు. ప్రస్తుతం ఓపీ విభాగానికి ప్రత్యేక భవనం లేదు. ఆసుపత్రిలోనే ఓ మూలన కౌంటర్లు ఏర్పాటు చేసి..చీటీలు ఇస్తున్నారు. ప్రజలు ఎండలోను, చెట్ల కింద వేచివుండి ఓపీ చీటీలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఓపీ విభాగం నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ వైద్యవిధాన పరిషత్‌ ద్వారా రూ.5 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పనులకు గతేడాది జులైలో శంకుస్థాపన చేశారు. 

20 శాతం కమీషన్లు! 
పేద రోగుల శ్రేయస్సు దృష్ట్యా భవన నిర్మాణాన్ని అత్యంత నాణ్యతగా చేపట్టాల్సి ఉంది. అయితే..అధికార పార్టీ నేతల కక్కుర్తితో పనులు నాణ్యతగా జరగడం లేదు. ఇద్దరు మంత్రులతో పాటు మరో ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు 20 శాతం మేర కమీషన్లు దండుకున్నట్లు సమాచారం. ఆసుపత్రికి చెందిన ఓ ఇంజినీర్‌ మధ్యవర్తిగా వ్యవహరించి కాంట్రాక్టర్‌ నుంచి ముడుపులు ఇప్పించినట్లు తెలుస్తోంది. రూ.5 కోట్లలో 20 శాతం అంటే రూ.కోటి ముడుపులు ముట్టజెప్పిన సదరు కాంట్రాక్టర్‌ పనులను ఎలా పూర్తి చేయాలో దిక్కుతోచని స్థితిలో నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

అప్పుడే పాడవుతోంది! 
నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో  2016లో మాతాశిశు వైద్యశాల భవనాలను రూ.15 కోట్లతో నిర్మించారు. అప్పుడు కూడా నేతల కమీషన్లు, అధికారుల స్వార్థం కారణంగా పనుల నాణ్యతకు పాతరేశారు. స్వయాన సీఎం చంద్రబాబు ప్రారంభించిన ఈ భవనం మూడేళ్లు కూడా గడవకముందే దెబ్బతింటుండడం గమనార్హం. భవనం చుట్టూ భూమి కుంగిపోయి.. టైల్స్‌ విరిగిపోతున్నాయి. దాదాపు అడుగు లోతు గుంతలు ఏర్పడుతున్నాయి. బిల్డింగ్‌ గోడలకు చీలికలు ఏర్పడ్డాయి.  

అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారు 
కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అధికార పార్టీ నేతలు దోచుకోవడం శోచనీయం. మాతాశిశు వైద్యశాల భవనం నిర్మించి మూడేళ్లు పూర్తి కాక ముందే బీటలు వారింది. ఇది చాలదని ఓపీ బిల్డింగ్‌ పనుల్లోనూ చేయి పెట్టారు. ప్రభుత్వాసుపత్రిలో చేస్తున్న పనుల నాణ్యతపై ఉన్నతస్థాయి అధికారులు విచారణ చేపట్టాలి. 
– ప్రదీప్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత, నంద్యాల  

నాసిరకంగా నిర్మిస్తున్నారు 
మాతాశిశు వైద్యశాల నిర్మించి మూడేళ్లు కూడా పూర్తికాలేదు. అప్పుడే భవనం చుట్టూ మట్టి దిగబడి పోయి టైల్స్‌ ఊడిపోతున్నాయి. మరికొన్ని చోట్ల గోడలకు చీలికలు ఏర్పడ్డాయి. నూతనంగా నిర్మిస్తున్న ఓపీ బిల్డింగ్‌ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. నాసిరకం సిమెంటు , ఇసుక, కంకర వేసి పిల్లర్లు నిర్మిస్తున్నా.. కాంట్రాక్టర్‌ను అధికారులు ప్రశ్నించటంలేదు.   
– సద్దాం హుస్సేన్, సీపీఎం మండల కార్యదర్శి, నంద్యాల 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top