
అడ్డదారి.. విలువలకు పచ్చ గోరీ
జిల్లాలో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. మండలాధ్యక్ష ఎన్నికల్లో ప్రలోభాలు, బెదిరింపులు, బరితెగింపులకు పాల్పడింది.
సాక్షి, కాకినాడ : జిల్లాలో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. మండలాధ్యక్ష ఎన్నికల్లో ప్రలోభాలు, బెదిరింపులు, బరితెగింపులకు పాల్పడింది. మెజార్టీ మండలాలు దక్కినా అధికారదాహం తీరక మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎన్నికలను కనుసన్నల్లో నడిపించారు. ఫలితంగా పలుచోట్ల తెలుగుతమ్ముళ్లు పేట్రేగిపోయారు. అడ్డుకోవాల్సిన పోలీసులు, అధికారులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. జిల్లాలో 57 మండలాల్లో 44 టీడీపీ, 11 వైఎస్సార్ సీపీ దక్కించుకున్నాయి. కోరం లేక ఒకచోట, తెలుగుతమ్ముళ్ల దాడులతో మరో చోట ఎన్నిక వాయిదా పడింది.
జిల్లాలోని 1063 ఎంపీటీసీలకు608 స్థానాల్లో టీడీపీ, 391 స్థానాల్లో వైఎస్సార్ సీపీ, రెండుచోట్ల కాంగ్రెస్, 62 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. 40 మండలాల్లో టీడీపీకి, 12 మండలాల్లో వైఎస్సార్ సీపీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. చెరిసగం సీట్లు దక్కిన నాలుగు మండలాల్లో మూడు చోట్ల టీడీపీ ప్రలోభాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేసినా అధికారులు అధికార పార్టీకే అనుకూలంగా వ్యవహరించారు.
రౌతులపూడిలో టీడీపీ వర్గీయుల వీరంగం
రౌతులపూడి మండలంలో టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెరో ఏడుస్థానాలు గెలవగా, ఇద్దరు స్వతంత్రులు చెరో పార్టీకి మద్దతు పలికారు. దీంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కో ఆప్షన్ సభ్యత్వం లాటరీ వైఎస్సార్ సీపీకి దక్కడంతో ఎంపీపీ ఆ పార్టీ పరమవుతుందన్న దుగ్ధతో టీడీపీ ఎంపీటీసీలు, నాయకులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు.
ఎంపీపీ ఎన్నిక వాయిదా వేయాలంటూ టీడీపీ ఎంపీపీ అభ్యర్థి ఇటంశెట్టి భాస్కరబాబు నాయకత్వంలో ఎంపీటీసీ సభ్యులు, 30 మంది నాయకులు, కార్యకర్తలు ఎంపీపీ కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్, ఫైళ్లు, కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుతో పాటు ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యులను, అధికారులను దుర్భాషలాడారు.
ఈ దశలో ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ ఎంపీటీసీలను ఒక గదిలో ఉంచి భద్రత కల్పించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. మరొక పక్క వందలాది మంది ఎంపీపీ కార్యాలయం వెలుపల గుమిగూడి ‘ఎన్నికలు నిర్వహిస్తే అంతుచూస్తాం..’ అంటూ వీరంగమాడారు. అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, తమ ఎంపీటీసీలను లోబర్చుకునే లక్ష్యంతోనే ఎన్నిక వాయిదా వేయాలని భయభ్రాంతులకు గురి చేశారని ఎమ్మెల్యే వరుపుల ధ్వజమెత్తారు. తమ ఎంపీటీసీలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. చివరికి ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
ఏలేశ్వరంలో కోరం లేక వాయిదా
ఏలేశ్వరం మండల పరిషత్‌లో టీడీపీకి మెజారిటీ స్థానాలు దక్కినా ఎస్టీలకు రిజర్వైన చైర్మన్ స్థానం కైవసంచేసుకునేందుకు ఆ కేటగిరీ విజేత కరువయ్యారు. ఇదే పరిస్థితి ఏలేశ్వరం నగర పంచాయతీలో కూడా ఏర్పడినా వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన ఎస్సీ కౌన్సిలర్‌ను ప్రలోభపెట్టి చైర్మన్ పీఠాన్ని ఖాతాలో వేసుకుంది.
మండల పరిషత్ ఎన్నికల్లో కూడా అదేరీతిలో చక్రం తిప్పాలని విఫలమైంది. వైఎస్సార్ సీపీ తరపున గెలుపొందిన ఆరుగురు ఎంపీటీసీలు సమావేశానికి హాజరు కావడంతో, తాము కూడా హాజరైతే విధిలేని పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీకి మద్దతు పలకాల్సి వస్తుందనే భావనతో తమ పార్టీ ఎంపీటీసీలను టీడీపీ గైర్హాజరయ్యేలా చేసింది.
దీంతో కోరం లేక ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెరిసగం ఎంపీటీసీ స్థానాలు దక్కిన కాజులూరు, యు.కొత్తపల్లి, కోటనందూరు, రౌతులపూడి మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు ఉత్కంఠను రేపాయి. అయితే టీడీపీ వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికైన ఎంపీటీసీలను బెదిరించీ, ప్రలోభపెట్టి కోటనందూరులో ఇద్దరినీ, యు.కొత్తపల్లిలో ఇద్దరినీ, కాజులూరులో ఒకరినీ తన వైపు తిప్పుకొని మండల పీఠాలను చేజిక్కించుకుంది.
వైఎస్సార్ సీపీ ఆందోళన..పట్టించుకోని అధికారులు
కోటనందూరులో తమ ఎంపీటీసీలను టీడీపీ లోబర్చుకున్నందున ఎన్నిక వాయిదా వేయాలని వైఎస్సార్ సీపీ ఆందోళనకు దిగినా పట్టించుకోలేదు. ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని బైఠాయించగా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఎంపీటీసీలపై కేసులు పెడతామని హెచ్చరించారు. విధిలేని పరిస్థితుల్లో ఆందోళన విరమించి ఎన్నికల్లో పాల్గొని ఎంపీపీ, వైస్ ఎంపీపీ అభ్యర్థులను నిలబెట్టినా ప్రలోభాలకు గురైన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు టీడీపీ వైపే ఉండడంతో ఫలితం లేకపోయింది. యు.కొత్తపల్లి మండలంలో ఇరు పార్టీలకు చెరో 12 మంది ఎంపీటీసీలుండగా, లాటరీ పద్ధతిలో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
అయితే టీడీపీ వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలను గైర్హాజరయ్యేల చేసి అధ్యక్షపీఠాన్ని ఎగరేసుకుపోయింది. కాజులూరులలో కూడా తమ పార్టీ ఎంపీటీసీలను టీడీపీ ప్రలోభాలకు గురిచేయడంపై వైఎస్సార్ సీపీ ఆందోళనలు చేసినా అధికారులు అధికార పార్టీకే కొమ్ముకాస్తూ ఎన్నిక కానిచ్చేశారు. కాగా మిగిలిన రెండు స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహించనున్నారు.