ప్రజాదరణ ఓర్వలేక వికృత చేష్టలు

TDP Leaders Trying to Remove YS Rajasekhara Reddy Statue - Sakshi

రాజాంలో వైఎస్సార్‌

విగ్రహం తొలగించేందుకు కమిషనర్‌ అత్యుత్సాహం

అడ్డుకున్న ఎమ్మెల్యే కంబాల జోగులు, అభిమానులు

మళ్లీ అదే ప్రదేశంలో ఏర్పాటు

టీడీపీ నేతల పనేనని అనుమానం

శ్రీకాకుళం, రాజాం/రాజాం రూరల్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజాం లో ఇటీవల నిర్వహించిన ప్రజా సంకల్ప      యాత్రకు లభించిన ప్రజాదరణ ఓర్వలేక టీడీపీ నేతలు వికృత చేష్టలకు దిగారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తెరవెనుక కుట్రలు పన్నారు. తాగునీటి పైపులైన్‌ ఏర్పాటుచేయాలనే సాకుతో మాధవబజార్‌ ఎదురుగా ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించే యత్నం చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు చేరుకుని అడ్డుకోవడంతో వెనుదిరిగారు.

ఇదీ జరిగింది..
బుధవారం ఉదయం 5 గంటల సమయంలో ఏఈ సురేష్‌కుమార్, టీపీఓ నాగలతలు వైఎస్సార్‌ విగ్రహం తొలగించే ప్రయత్నం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న రిక్షా కార్మికుడు రాజు పెద్దగా కేకలు వేస్తూ దిమ్మ వద్ద అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశాడు. ఇంతలో మరికొంతమంది అభిమానులు చేరుకుని విగ్రహాన్ని కదలనివ్వకుండా అడ్డుకున్నారు. విషయం తెలిసిన రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులుతో పాటు పార్టీ నేతలు పాలవలస శ్రీనివాసరావు, కరణం సుదర్శనరావు, వంజరాపు విజయ్‌కుమార్, పారంకోటి సుధ, జడ్డు జగదీష్, శాసపు వేణుగోపాలనాయుడు, కిల్లాన మోహన్‌ తదితరులు అక్కడకు చేరుకుని కమిషనర్‌ను నిలదీసి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

అడ్డుగా లేకపోయినా..
నగర పంచాయతీ అధికారులు రాజాం ప్రధాన రహదారి విస్తరణకు సంబంధించి గత ఏడాది డిసెంబర్‌లో కొలతలు నిర్ధారించి రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను తొలగించారు. మాధవబజార్‌ ఎదురుగా ఉన్న వైఎస్సార్‌ విగ్రహం అడ్డులేకపోవడంతో వదిలేశారు. బుధవారం తెల్లవారుజామున ఉన్నఫలంగా పొక్లెయినర్‌ తీసుకొచ్చి వైఎస్సార్‌ విగ్రహాన్ని  తొలగించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జోగులుతో పాటు పార్టీ నేతలు, అభిమానులు కమిషనర్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. పైపులైన్‌కు అడ్డుగా లేకపోయినా విగ్రహాన్ని ఎందుకు తొలగించారని మండిపడ్డారు. మళ్లీ విగ్రహం పెట్టే వరకు వెనుకంజ వేసేది లేదని తేల్చిచెప్పి పైపులైన్‌ వేసే వరకు నిరీక్షించారు. దీంతో నగర పంచాయతీ అధికారులు పైపులైన్‌ వేసి విగ్రహాన్ని యథాతథ స్థితిలో ఉంచి సిమెంట్‌ నిర్మాణం చేయించారు. దీంతో ఎమ్మెల్యే, నాయకులు, అభిమానులు ఆందోళన విరమించారు.  

తప్పు ఎవరిది..?
వైఎస్సార్‌ విగ్రహం తొలగింపు వెనుక రాజాంకు చెందిన అధికార పార్టీ నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఓ నేత మెప్పు కోసం నగర పంచాయతీ అధికారులతో పాటు ఆర్‌అండ్‌బీ అధి కారులు అత్యుత్సాహం ప్రదర్శించినట్లు సమాచారం. విగ్రహాన్ని తొలగించేందుకు ఏ అనుమతులు ఉన్నాయో చెప్పాలని అభిమానులు కోరగా నగర పంచాయతీ అధికారులు, ఆర్‌అండ్‌బీ జేఈలు ఒకరినొకరు విమర్శించుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ శాఖల అధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు రాజాం పట్టణవాసులు పేర్కొన్నారు.

కమిషనర్‌ వ్యవహార శైలిపై అనుమానాలు
రాజాం నగరపంచాయతీ కమిషనర్‌  వి.వి.సత్యనారాయణ మొదటి నుంచీ టీడీపీ కోవర్టుగా ఉంటున్నారని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇదే ప్రాంతంలో పాఠశాల ముఖద్వారం రోడ్డుకు అడ్డంగా ఉన్నా తొలగించలేదని, వైఎస్సార్‌ విగ్రహం పైపులైన్‌కు అడ్డంగా లేకపోయినా తొలగించేందుకు అత్యుత్సాహం చూపించారని ఆరోపించారు. రాజాంలో ప్రజా సంకల్పయాత్ర విజయవంతం కావడంతో టీడీపీ నేతలే ఈ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరోపించారు. ఈ విషయాన్ని ఇక్కడతో విడిచిపెట్టేదిలేదని, కలెక్టర్‌కు, ఆర్‌జేడీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top