ఇందిరాగాంధీ స్టేడియంపై గద్దలు | tdp leaders trying to occupation IGMC stadium | Sakshi
Sakshi News home page

ఇందిరాగాంధీ స్టేడియంపై గద్దలు

Nov 2 2017 11:33 AM | Updated on Nov 2 2017 11:33 AM

tdp leaders trying to occupation IGMC stadium - Sakshi

విజయవాడ స్పోర్ట్స్‌: విజయవాడ బందరు రోడ్డులో ఉన్న ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియం (ఐజీఎంసీ)పై కూడా ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. పర్యాటకాభివృద్ధి ముసుగులో ప్రైవేటు సంస్థల పేరిట బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సంసిద్ధమవుతోంది. దాదాపు రూ.1,350 కోట్లు మార్కెట్‌ విలువ ఉన్న స్టేడియం భూములను ధారాదత్తం చేసేందుకు పన్నాగం సాగుతోంది.  

స్టేడియం భూములపై కన్ను
విజయవాడ బందరు రోడ్డులో ఉన్న ఐజీఎంసీ క్రీడారంగానికి ఎంతో కీలకమైంది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో కూడా హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ, ఎల్బీ స్టేడియాల తరువాత ఎన్నో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు, క్రికెట్‌ మ్యాచ్‌లకు వేదికగా నిలిచింది. తెలంగాణ  ఏర్పాటు తరువాత రాష్ట్రంలో స్టేడియాల కొరత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియం ప్రాధాన్యం మరింత పెరిగింది. కోట్లాది రూపాయాల నిధులతో ఏర్పాటు చేసిన బహుళ అంతస్తుల శాప్‌ ప్రధాన కార్యాలయం ఇక్కడే (స్టేడియంలోనే) ఉంది. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ స్టేడియం భూములపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారు. వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. శాప్‌ అధికారులకు కూడా తెలియకుండా ఆ సంస్థ ఎండీ ఎన్‌.బంగారురాజు ఇచ్చిన ఆదేశాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

సంస్థ సామగ్రి మొత్తం గుంటూరు బీఆర్‌ స్టేడియానికి తరలించమని ఆయన ఆదేశించారు. అంటే ఇక్కడ నుంచి శాప్‌ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించారు. అదే విధంగా రూ.6 కోట్లతో ఈ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సింథటిక్‌ ట్రాక్‌ను ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారు. ఆ ట్రాక్‌ను ముందే వ్యూహాత్మకంగా విశాఖపట్నం తరలించేశారు. తద్వారా ఇక్కడ క్రీడా సదుపాయాలు ఏవీ అభివృద్ధి చేయకుండా కొంతకాలంగా పావులు కదుపుతూ వచ్చారు. తాజాగా ఏకంగా శాప్‌ కార్యాలయాన్నే తరలించేయాలని నిర్ణయించారు. ఒకసారి స్టేడియాన్ని ఖాళీ చేస్తే తరువాత కథ నడిపించాలన్నది ప్రభుత్వ పెద్దల ఉద్దేశం.

త్వరలోనే ఆ స్టేడియం భూములను పర్యాటక ప్రాజెక్టుల పేరుతో పీపీపీ పద్ధతిలో తమ బినామీ సంస్థలకు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి గొడ్డలిపెట్టు వంటి ఈ నిర్ణయంపై క్రీడారంగ ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement