భూ మాంత్రికుడు!

tdp leaders lands Capturing in Kadapa district - Sakshi

అధికారం ముసుగులో భూ దాహం

సర్వే నంబర్ల మెలికలతో నకిలీ పట్టాలు

డీకేటీ భూములకు రిజిస్ట్రేషన్‌ 

డాక్యుమెంట్లు సృష్టిస్తున్న వైనం

పెరిగిపోతున్న తెలుగు తమ్ముళ్ల కబ్జాలు

సాక్షి ప్రతినిధి కడప: తెలుగుదేశం పార్టీ పాలనలో భూ బకాసురులు పెరిగిపోయారు. కడప నగరంలో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేసేస్తున్నారు. ప్రభుత్వ భూములు, పట్టా స్థలాలు అనే తేడా లేకుండా ఆక్రమిస్తున్నారు. అధికారులతో లాలూచీ పడి ఆయా వ్యక్తుల పేరిట భూములు, స్థలాలను ఆన్‌లైన్‌లో ఎక్కించుకుంటున్నారు. అసైన్డ్, దేవాదాయ, వంక, కొండ, పొరంబోకు, నీటమునక, రిజర్వుడు స్థలాలపై కన్నేశారు. సర్వే నంబర్లు మెలికలతో నకిలీ పత్రాలు సృష్టించి స్వాహా చేస్తున్నారు. కడప నగర శివార్లలోని ప్రభుత్వ భూములను స్వాహా చేసేందుకు ఓ టీమ్‌ వెలిసింది. స్థానిక టీడీపీ నాయకుడి నేతృత్వంలోని ఆ టీమ్‌ విలువైన భూములను స్వాహా చేయడం వాటికి డాక్యుమెంట్లు పుట్టిస్తోంది.

 ఒరిజనల్‌ పట్టాకు చెందిన సర్వేనంబర్‌తో కబ్జా చేసిన స్థలం హద్దులు వేస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తోంది. స్థలం హద్దులు సరిగ్గా ఉంటాయి. ఆ హద్దుల పరిధిలో ఉన్న స్థలం ప్రభుత్వ బంజరు లేదా పీఓబీ (ప్రొబుటరీ ఆర్డర్‌ బుక్‌) ల్యాండ్‌ ఉంటోంది. స్థానికులెవ్వరైనా అడిగితే తమకు రిజిస్ట్రేషన్‌ ద్వారా సంక్రమించిన భూమిగా ఫోజులు కొడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. సర్వే నంబర్‌ 335లో 4.28 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో గతంలో కొందరికీ పట్టాలు అందించారు. దాదాపు 3 ఎకరాల భూమిని రిజర్వు చేసి పెట్టారు. అందులో పార్కు నిర్మించాలని అప్పట్లో నిర్ణయించారు. 

ఆ స్థలం కబ్జాకు గురైంది. స్థానికంగా ఉన్న టీడీపీ నాయకుడు ప్రభుత్వ భూమి హద్దులతో నకిలీ సర్వే నంబర్‌తో డాక్యుమెంటు పుట్టించాడు. సర్వే నంబర్‌ 340లో 6.28 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. అందులో బీడీ కార్మికులకు డీకేటీ పట్టాలు అప్పగించి కాలనీ ఏర్పాటు చేశారు. మరో ఎకరా రిజర్వు చేసి పెట్టారు. ఆ కాలనీ అభివృద్ధిలో భాగంగా ఆ స్థలాన్ని తీసి పెట్టారు. మాజీ కార్పొరేటర్‌ ఒకరు ఆ స్థలాన్ని ఆక్రమించారు. బీడీ కాలనీలో రిజర్వు చేసిన స్థలం తనదే అని బాహాటంగా వెల్లడిస్తున్నాడు. అలాగే సర్వే నంబర్‌ 341లో 3.32 ఎకరాలు, సర్వే నంబర్‌ 342లో 3.24 ఎకరాలు ఉన్న భూమి పీఓబీ ల్యాండ్‌. దీనిని ఎవ్వరికీ పట్టాలు ఇచ్చేందుకు కూడా రెవెన్యూ నిబంధనలు అంగీకరించవు. అలాంటి భూమిని సైతం మాజీ కార్పొరేటర్‌ గుప్పిట్లో పెట్టుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. 340, 341, 342 సర్వే నంబర్లు జాతీయ రహదారి బైపాస్‌ రోడ్డుకు పక్కనే ఉన్నాయి. 

ఈ సర్వే నంబర్లలో ఉన్న భూమికి అమాంతం రేట్లు పెరిగాయి. ఆ భూమి ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో సదరు మాజీ కార్పొరేటర్‌ రాజకీయ విన్యాసాలు చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో నకిలీ పట్టాలు, డాక్యుమెంట్లు పుట్టిస్తున్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కబ్జా చేసిన స్థలాల్లో ప్రహరీ ఏర్పాటు చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తుండిపోవడం మినహా అటువైపు కన్నెత్తి చూడడం లేదు.

అండగా నిలుస్తున్న రెవెన్యూ యంత్రాంగం
ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం అక్రమార్కులకు అండగా నిలుస్తోంది. ఆన్‌లైన్‌లో అక్రమార్కుల పేర్లును చేరుస్తూ రెవెన్యూ అధికారులు వారి సేవలో తరిస్తున్నారు. కడప కలెక్టరేట్‌కు పక్కనే ఉన్న సర్వేనంబర్‌ 955లో 23 సెంట్ల  ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఆర్ట్స్‌ కళాశాలకు కేటాయించగా 0.03 సెంట్ల స్థలం మిగిలింది. అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌కు ఎదురుగా ఉన్న ఈ స్థలం రెవెన్యూ రికార్డుల్లో నీటిమునకగా ఉంది. ప్రస్తుతం దీని విలువ రూ.45లక్షలుగా ఉంది. ఆ భూమికి సంబంధించి ఆన్‌లైన్‌లో రెవెన్యూ అధికారులు అక్రమార్కుల పేరు చేర్చారు. అప్పట్లో ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఏఆర్‌ఐ రవిని సస్పెండ్‌ చేశారు.   కడప నగర శివార్లలోని స్థలాలను ధ్రువీకరించడంలో రెవెన్యూ యంత్రాంగం కీలకంగా మారింది. ఆర్కేనగర్, బీడీ కాలనీ, చలమారెడ్డిపల్లె, ఇందిరానగర్‌లలో కబ్జాదారులకు అండగా నిలుస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో రాత్రికి రాత్రే పునాదులు వెలుస్తున్నాయి.
 
సర్వే చేసేందుకు ఆసక్తి చూపని వైనం..
కడప శివార్లలోని బీడీ కాలనీ, ఆర్కేనగర్‌ పరిధిలో సర్వే నంబర్లు 335, 340లో సర్వే చేపట్టి ప్రభుత్వ స్థలం గుర్తించాలని అందులో పార్కు నిర్మాణం చేపట్టనున్నట్లు కార్పొరేషన్‌ విభాగం అధికారికంగా కోరింది. అటు వైపు కన్నెత్తి చూసేందుకు ఇష్టపడని రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసేందుకు కుంటి సాకులు చూపుతూ వాయిదా వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు పొరంబోకు, పీఓబీ భూమిని సైతం స్వాహా చేసి హద్దులు ఏర్పాటు చేసుకుంటుంటే నిలువరించే ప్రయత్నం చేయడం లేదని పలువురు వివరిస్తున్నారు.  ఈ విషయమై కడప తహసీల్దార్‌ శ్రీనివాసులును వివరణ కోరగా కార్పొరేషన్‌ యంత్రాంగం వస్తే సర్వే చేసి పార్కు స్థలాన్ని గుర్తించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిసే చర్యలు తప్పవన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top