ఆక్రమణ పట్టా.. అక్రమాల పుట్ట!

TDP Leaders Land Grabs In Anantapur - Sakshi

ప్రభుత్వ భూముల్లో పచ్చనేతల పాగా

జిల్లాలో విలువైన స్థలాలు కబ్జా

గత నాలుగేళ్లలో వేల ఎకరాలు అన్యాక్రాంతం

అధికారుల అండతో పట్టాలు సిద్ధం

అనంత శివారులో మరింత అధికం

ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. కబ్జా కోరల్లో చిక్కుకుంటోంది. టీడీపీ నేతల కన్ను పడితే చాలు..ఆ ప్రాంతంలో బోర్డు పుట్టుకొస్తోంది. ప్రభుత్వ భూమి అయితే.. అధికారికంగా పట్టా సిద్ధమవుతోంది. బినామీ పేర్లతో ప్లాట్లుగా మారిపోతుంది. నాలుగు రాళ్లు మిగిల్చే ఏ స్థలం కూడా ‘పచ్చ’నేతలనుదాటిపోలేని పరిస్థితి. ఇసుక అక్రమ రవాణా..నీరు– చెట్టు.. ఇదే కోవలో భూ దందా. ‘తమ్ముళ్ల’ధన దాహానికి అడ్డూఅదుపు లేకుండా పోతోంది.   

సాక్షి ప్రతినిధి, అనంతపురం: టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములకు రెక్కలొస్తున్నాయి. అసైన్డ్‌ భూములు లబ్ధిదారులకు అందకుండా పోతున్నాయి. ఎక్కడ చూసినా కబ్జాలు.. ఆక్రమణలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి. అధికారం అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలను ఆక్రమిస్తున్నా..అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు.

ఉరవకొండలో 500 ఎకరాలకు పైనే..
ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలోని కూడేరు, కమ్మూరు, మరుట్ల, గుటుకూరు, జల్లిపల్లి గ్రామాల్లో 500 ఎకరాలకుపైగానే  ప్రభుత్వ భూముల అన్యాక్రాంతమయ్యాయి. అధికారపారీక్ట నేతల మాటలు విని వంక స్థలాలు, రాళ్ల గుట్లకు అధికారులు పట్టాలిచ్చారు. చివరికి గ్రామకంఠం భూములనూ వదలలేదు. సర్వే నంబర్‌లో ఉన్న భూమిని మించి భూములకు పాసుపుస్తకాలు జారీ చేశారు. వీటిని పొందిన వారు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు. కొందరైతే గాలిమరలకు లక్షలాది రూపాయలకు భూములను అమ్ముకున్నారు. ఈ కుంభకోణంలో రెవెన్యూ డివిజినల్‌ కార్యాలయంలోని ఓ కీలక అధికారి రూ.3 కోట్ల మేర ఆదాయం అర్జించారు. 

ఈరెండు నియోజకవర్గాల్లోనే ఎక్కువ
ఉరవకొండ, శింగనమల నియోజకవర్గాల్లో రెండువేల ఎకరాలకుపైగా భూమి అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో నాలుగేళ్లలో అన్యాక్రాంతమైన భూమిని లెక్కిస్తే కనీసం 20వేల ఎకరాలకుపైగా ఉంది. అధికారపార్టీ నేతలు, కార్యకర్తలు ఆ భూములను ఆక్రమించినట్లు తెలుస్తోంది.

అనంతపురం సమీపంలోనూ కబ్జాలు
అనంతపురం చుట్టపక్కల ఎక్కడ చూసిన సెంటు రూ.6 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ ధర పలుకుతోంది. ఈ లెక్కన ఎకరా కనీసం రూ.60 లక్షల నుంచి రూ. కోటి రూపాయిల వరకూ ఉంటుంది. సోములదొడ్డి సమీపంలో 2013లో పేదలకు పట్టాలిచ్చిన 4.90 ఎకరాల భూమిలో మంత్రి పరిటాల సునీత అనుచరుడు పామురాయి వెంకటేశ్‌... ఏకంగా జెండాలు నాటారు. దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చిన తర్వాత బీసీ భవన్‌ నిర్మించేందుకు అప్పటి కలెక్టర్‌ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే తిరిగి ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు బీసీ భవన్‌ ప్రతిపాదనను తోసిపుచ్చి తమ అధీనంలోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ స్థలం విలువ రూ.3 కోట్లకుపైనే ఉన్నట్లు తెలుస్తోంది. 

 అనంతపురం సమీపంలోని భూములు రూ.కోట్ల మేర విలువ చేస్తాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఈ భూదందాలు సాగుతున్నా...అధికార యంత్రాంగం అడ్డుకోలేకపోతోంది. రెవెన్యూ అధికారులతో ముందుగానే సంప్రదింపులు జరిగి...  వారికి కొంత ముట్టజెప్పి స్వాహాకు దిగుతున్నారు. కొందరు రెవెన్యూ అధికారులు కబ్జాలకు ‘రూట్‌మ్యాప్‌’ కూడా ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

భూ పంపిణీ భూములూ స్వాహా
2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కొలువుదీరాక భూమిలేని నిరుపేదలకు భూములు పంపిణీ చేశారు. 2004 నుంచి 2014 వరకూ అప్పటి ప్రభుత్వాలు 7 విడతల్లో 79,027 ఎకరాల భూమిని పంపిణీ చేశాయి. పట్టాలు పొందిన వారిలో కొందరు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలిచ్చారు. ఇంకొందరికి పట్టాలిచ్చి భూములు అప్పగించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈ పట్టాలను రద్దు చేయించిన టీడీపీ నేతలు తాజాగా  తమ పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టారు.

శింగనమల, రాప్తాడుల్లో అనంతం
అనంతపురం నగరం చుట్టూ బుక్కరాయసముద్రం మినహా తక్కిన ప్రాంతం మొత్తం రాప్తాడు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతాల్లో భూముల ధరలు కూడా లక్షలాది రూపాయలు పలుకుతున్నాయి. అందువల్లే అధికార పార్టీ నేతలు ఈ పంచాతీల పరిధిలోని వీఆర్‌ఓలతో సన్నిహిత సంబంధాలు నడుపుతూ... ఖాళీస్థలాలు తెలుసుకుని వాటిని కబ్జా చేస్తున్నారు. తమ వల్ల కాదనుకుంటే బడానేతలను సంప్రదించి... వారి కనుసన్నల్లో యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన కబ్జాలన్నీ ఈ తరహాలోనే సాగినవే. టీడీపీ అనంతపురం రూరల్‌ మండల ఇన్‌చార్జ్‌గా పరిటాల మహేంద్రను మంత్రి సునీత నియమించారు. ఇక్కడ ఎవరికి పింఛన్‌ రావాలన్నా, పట్టా కావాలన్నా చివరకు అధికారులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మహేంద్ర అనుమతి తప్పనిసరి. దీంతో మహేంద్ర నాలుగేళ్లలో వందల ఎకరాల భూములను అన్యాక్రాంతం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

మచ్చునకు కొన్ని..
జేఎన్‌టీయూ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 3.80 ఎకరాల పొలంలో అక్రమంగా ఇళ్లు నిర్మించి దీనికి నారాలోకేశ్‌బాబు కాలనీగా నామకరణం చేశారు. ఈ స్థలం కూడా రూ.కోట్లు విలువ చేస్తుంది.  
ఆత్మకూరు మండలం. బి.యాలేరులో 4.40 ఎకరాల అసైన్డ్‌భూమిని ఆ గ్రామంలోని దళితులు ఇళ్లస్థలాల కోసం కొనుగోలు చేశారు. ఈ భూమిని తహసీల్దార్‌కు స్వాధీనం చేసి ఆ స్థలంలో పట్టాలు తీసుకోవాలని భావించారు. ఈ తంతు 2014కు ముందు జరిగింది. ఎన్నికల తర్వాత పట్టాలివ్వకుండా అధికారపార్టీనేతలు అడ్డుకున్నారు. పైగా భూమిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. టీడీపీలో క్రియాశీలకంగా ఉండే కార్యకర్తలకు ఈ భూమిలో పట్టాలివ్వాలని భావిస్తున్నారు. దీంతో డబ్బులు చెల్లించి స్థలం కొనుగోలు చేసిన బాధితులు లబోదిబోమంటున్నారు.
అనంతపురం సమీపంలోని కక్కలపల్లిలో ప్రభుత్వ స్థలంలో 132 కుటుంబాలు గుడిసెలు వేసుకుని జీవించేవారు. వారందరికీ పట్టాలిప్పిస్తామని ఎన్నికల ప్రచారంలో  పరిటాల సునీత హామీ ఇచ్చారు. కానీ అధికారం దక్కిన తర్వాత 2014లో మొత్తం ఇళ్లను పోలీసుల అండతో  కూల్చేశారు. మంత్రి మురళీ, బంధువు మహేంద్ర వచ్చి ఖాళీ చేయాలని చెప్పారని, తాము ససేమిరా అనడంతో ఇళ్లను కూల్చేసి నీడలేకుండా చేశారని అప్పట్లో కిందట బాధితులు ఆరోపించారు.  

ఆలయ భూమిలోనే టీడీపీ కార్యాలయం
రాప్తాడులోని ప్రాచీనమైన పండమేటి రాయుడు ఆలయానికి నిన్న, మొన్నటి వరకు వందల ఎకరాల్లో మాన్యం ఉండేది. ఈ భూముల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అప్పటి ప్రభుత్వాలు పోలీస్‌ స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను నిర్మించారు. 44వ జాతీయ రహదారి పక్కనే  ఈ ఆలయానికి మరి కొంత భూమి ఉంది. దీనిని  దేవాదాయశాఖ అనుమతితో అప్పటి ప్రభుత్వం ఏపీఐఐసీ (ఆంధ్ర ప్రదేశ్‌ ఇండస్ట్రీయల్, ఇన్పాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌) ద్వారా ఆటోనగర్‌కు లీజుకిచ్చింది. ఇందుగ్గానూ ఆటోనగర్‌ అసోసియేషన్‌ ప్రతి ఏటా ఆలయ కమిటీకి అద్దె చెల్లిస్తోంది.  టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇందులోని రెండు ఎకరాల్లో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్, టీడీపీ కార్యాలయం, బస్టాప్‌ వంటి నిర్మాణాలు చేపట్టడానికి అనుమతులు తీసుకొచ్చారు. ఇందులో జాతీయ రహదారికి పక్కనే పది సెంట్ల స్థలంలో టీడీపీ మండల కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భవనానికి పరిటాల భవన్‌ అని పేరు కూడా పెట్టారు. లీజుకు ఇచ్చిన భూమిలో పూర్తి స్థాయి కట్టడాలు నిర్మించరాదన్న నిబంధనలు ఉన్నప్పటికి మంత్రి సునీత అండతో స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు చెలరేగిపోయారు. పునాదులు, పిల్లర్లు వేసి భవనాన్ని పూర్తి చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top