టీడీపీకి బుద్ధి చెప్పండి

TDP Leaders Join In YSR Congress In Anantapur - Sakshi

రాయదుర్గం అర్బన్‌: ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి.. దోపిడీకి అలవాటుపడిన టీడీపీకి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, వైఎఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు బీహెచ్‌ ముస్తాక్‌ అహమ్మద్, బీహెచ్‌ ఇర్ఫాన్, నియాజ్, నియమతుల్లా, గపూర్‌సాబ్‌లతో పాటు మరో 50 మంది నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించిన కాపు రామచంద్రారెడ్డి అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.

మైనార్టీల కష్టాలను గుర్తించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వారికోసం నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. ఆ మహానేత ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాడన్నారు. నాలుగేళ్లుగా మైనార్టీకి మంత్రి పదవి ఇవ్వలేని చంద్రబాబు, మైనార్టీల గురించి మాట్లాడేందుకు అనర్హుడన్నారు.
 
దోపిడీ మంత్రి కాలవ నైజం 
మంత్రి కాలవ శ్రీనివాసులు అక్రమ ఇసుక రవాణాతో దాదాపు రూ. 500 కోట్లు దోపిడీ చేశారని కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఇసుకను నిత్యం బెంగళూరుకు లారీల ద్వారా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న మంత్రి, మరోవైపు నదుల పునరుజ్జీవనం కోసం వాటర్‌మెన్‌ రాజేంద్రసింగ్‌ను పిలుచుకువచ్చి చూపించడం దారుణంగా ఉందన్నారు. ఇసుక అక్రమ రవాణాతో కణేకల్లు మండలం మాల్యం వద్ద వేదావతి నదిలో ఇసుక లేక మట్టితేలిందనీ.. ఇప్పుడా భూమిలో టీడీపీ నాయకులు మాగాణి వేసుకుంటున్నారన్నారు. కుద్రేముఖ్‌ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పిన నేతలు నేటికీ దాని ఊసే ఎత్తడం లేదన్నారు.
 
టీడీపీ మైనార్టీలకు పెద్ద శత్రువు  
మైనార్టీలకు బీజేపీ కంటే కూడా టీడీపీనే పెద్ద శత్రువని హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గం సమన్వయకర్త నదీం అహమ్మద్‌ అన్నారు. టీడీపీలో ఆత్మగౌరవం ఉన్న వారికి స్థానం లేదన్నారు. మైనా ర్టీలను బలిపశువులను చేయడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేరన్నారు. ముస్లింలు ఆత్మగౌరవంతో బతకాలంటే వైఎస్సార్‌ సీపీకి మద్దతు తెలపాలన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి మాట్లాడుతూ,  మైనార్టీలలో విషబీజం నాటేందుకు టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని నమ్మవద్దన్నారు.

మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మున్నా మాట్లాడుతూ, జననేత జగనన్న నాయకత్వలో మాత్రమే మైనార్టీల అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నాగరాజరెడ్డి, కౌన్సిలర్లు పేర్మి బాలాజీ, అబ్దుల్‌ రహిమాన్, గోనబావి సర్మస్, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌టీ సిద్దప్ప, బీటీపీ గోవిందు, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవరెడ్డి, డీ.హీరేహాళ్‌ కన్వీనర్‌ వన్నూరుస్వామి, కదలిక ఎడిటర్‌ ఇమామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top