టీడీపీ కంచుకోట కూలిపోయింది

టీడీపీ కంచుకోట కూలిపోయింది - Sakshi


టీడీపీకి గుడ్‌బై చెప్పిన మర్రిపూడి వాసులు

 పెద్ద సంఖ్యలో వైఎస్సార్‌సీపీలో చేరిక

 కండువాలు కప్పి ఆహ్వానించిన

 పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు




రంగంపేట/పెద్దాపురం :  టీడీపీ కంచుకోట కూలిపోయింది. ఆవిర్భావం నుంచీ తెలుగుదేశానికే మద్దతుగా నిలిచిన రంగంపేట మండలం మర్రిపూడిలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ గ్రామానికి చెందిన టీడీపీ కీలక నాయకుడు రిమ్మలపూడి వెంకటేశ్వరరావు(అబ్బు)తో పాటు 500 మందికి పైగా కార్యకర్తలు ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యాన చేరిన వారికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు పార్టీ కండువాలు కప్పి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ నల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కంచుకోట కూలడం మర్రిపూడి నుంచే ఆరంభమైందని అన్నారు.



ఎమ్మెల్యే పదవులు శాశ్వతం కాదని, మళ్లీ ఎన్నికల్లో ఉంటామో, లేదో తెలియని పదవులు ఎప్పుడూ తమవెంటే ఉంటాయనుకుని అహంభావంతో పాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని చెప్పారు. భవిష్యత్తులో టీడీపీకి గడ్డుకాలం తప్పదన్నారు. నమ్మి వచ్చిన కార్యకర్తలకు సమన్యాయం చేయగలిగిన నేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. అటువంటి నాయకుడిపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న టీడీపీకి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని కన్నబాబు అన్నారు. కార్యకర్తకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని, మర్రిపూడి అబ్బును మండలం నుంచే కాకుండా జిల్లా స్థాయి నాయకుడిగా చూస్తారని చెప్పారు.



వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ భవిష్యత్తులో వైఎస్సార్‌ స్వర్ణయుగం రానున్నదన్నారు. ప్రభుత్వ పాలనను, చంద్రబాబు అవినీతిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, పార్టీలో కష్టపడి పని చేస్తున్న వ్యక్తులను లెక్క చేయకుండా.. మద్యం దుకాణాల్లో మామూళ్లే నయమంటూ పాలన సాగిస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెప్పడం తథ్యమన్నారు. ‘రాము ట్యాక్స్‌’ పేరిట సాగుతున్న మామూళ్ల దందా ఎవరికి తెలియని బాగోతమని ప్రశ్నించారు.



రెండున్నరేళ్ల పాలనలో చాగల్నాడు ఎత్తిపోతల పథకం ద్వారా చుక్క నీరు తెప్పించలేని ఎమ్మెల్యే ఎంత అసమర్థుడో ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. దీనిపై ప్రశ్నించిన నాయకులకు చంద్రబాబుతో మాట్లాడానని చెప్పుకుంటున్న ఆయన.. దమ్ముంటే ఇద్దరి సంభాషణనూ మీడియా ముందు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. అవినీతి ఎమ్మెల్యే పాలనకు విసుగు చెందే మర్రిపూడి గ్రామమంతా ఏకమై వైఎస్సార్‌ సీపీలో చేరారని, పార్టీపై, తనపై వారికున్న అభిమానానికి కృతజ్ఞుడినని అన్నారు. నమ్మి వచ్చిన ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, చిర్ల వీర్రాఘవరెడ్డిలు మాట్లాడుతూ, రాష్ట్రంలో అవినీతి పాలన చూడలేకే కంచుకోటలాంటి గ్రామంలో టీడీపీ క్యాడర్‌ వైఎస్సార్‌సీపీలో చేరుతోందన్నారు.



అనంతరం రిమ్మలపూడి వెంకటేశ్వరరావు (అబ్బు), మాజీ సర్పంచ్‌లు రిమ్మలపూడి కృష్ణమూర్తి, మోర్త వెంకన్న, పిల్లి తాతారావు, కోరా సూర్యనారాయణమూర్తి, మాజీ ఎంపీటీసీ సభ్యులు పెంకే శ్రీనివాసరావు, పుట్టా యువరాజు, మందపల్లి జ్యోతి ఏసయ్య, మేడిద రాజు, మాజీ ఉప సర్పంచ్‌ మోదుకూరి బంగార్రాజు, టీడీపీ మాజీ అధ్యక్షుడు పుట్టా గోపాలుడు, విద్యాకమిటీ చైర్మన్‌ వేగి రాంబాబు, వార్డు సభ్యులు, కాకతీయ యూత్, కాపునాడు యూత్, అల్లూరి సీతారామరాజు యూత్, బలిజ యూత్, అంబేద్కర్‌ యూత్, జగజ్జీవనరామ్‌ యూత్, ఎంఆర్‌పీఎస్, రైతు–కూలీ సంఘ సభ్యులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు సుమారు 500 మందికి పైగా వైఎస్సార్‌ సీపీలో చేరారు.



 వారికి కురసాల కన్నబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జంగా సుబ్బారెడ్డి, వేము చిరంజీవి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేల్, మహిళా విభాగం కార్యదర్శి ఎరకారెడ్డి సత్య, రాష్ట్ర యూత్‌ కార్యదర్శి ఎన్‌డీఆర్, రైతు విభాగం సహాయ కార్యదర్శి సత్తి సుబ్బారెడ్డి, లంక చంద్రన్న, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సత్తి వీర్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు అడబాల వెంకటేశ్వర్లు, పాలాటి నాగేశ్వరరావు, పేపకాయల రాంబాబు, కనుమూరి వెంకటపతి, కనుమూరి సాయిరాజు, నక్కా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top