
‘పచ్చ’ ఆహ్వాన పత్రిక
జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడును ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలే కాదు అధికారులూ పోటీ పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడును ప్రసన్నం చేసుకునేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలే కాదు అధికారులూ పోటీ పడుతున్నారు. ఆయన వద్ద ఎలా మార్కులు కొట్టేయాలా అని అదేపనిగా ఆలోచిస్తున్న అధికారులకు ఓ ‘పచ్చ’ ఐడియా వచ్చింది. అంతే.. సీఎం పర్యటన షెడ్యూల్‌ను పచ్చ పత్రికగా ముద్రించేశారు. పూర్తిగా పసుపు రంగుతో ఓ శుభలేఖ రూపంలో ముద్రించి జిల్లాలోని ముఖ్యులకు, పాత్రికేయులకు పంపించారు. ఇప్పటికే రేషన్ కూపన్లను ఎన్‌టీఆర్ ప్రజాపంపిణీ కూపన్లుగా మార్చి పసుపురంగులో ముద్రిస్తున్న అధికారులు చివరకు బాబు పర్యటన వివరాల పత్రికకూ ఇలా పసుపు పూసేశారు.
మునుపెన్నడూ ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఇలా శుభలేఖ రూపంలో వచ్చేదికాదు. అంతెం దుకు గతంలో తొమ్మిన్నరేళ్ల బాబు హయాంలోనూ అధికారులు ఈ పోకడలకు పోయిన దాఖలాలు లేవు. పసుపు పూల కోసం తంటా : అధికారుల తీరు ఇలా ఉంటే టీడీపీ నేతలు, కార్యకర్తలు పసుపు పూల కోసం ఊరంతా జల్లెడపట్టి వెతుకున్నారు. చంద్రబాబు రెండురోజుల పర్యటన నేపథ్యంలో మార్కెట్‌లో ఒక్కసారిగా పసుపు రంగు పూలకు, ఆ రంగు బొకేలకు గిరాకీ వచ్చేసింది. ‘లాభాల మాట దేవుడెరుగు.. అందరూ వచ్చి పసుపు రంగు పూల బొకేలు, దండలే అడుగుతున్నారు. ఆ రంగులో వచ్చే పూలు తక్కువగా ఉన్నాయి. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేద’ంటూ ఏలూరులోని పూల వ్యాపారులు వాపోతున్నారు.