స్వామి కార్యం.. స్వకార్యం

TDP Leaders Internal fight In Prakasam District  - Sakshi

పేరుకు వన సమారాధన..టీడీపీ నేతల సంవాదన

వన భోజనాల సభలో ఆసక్తిక వ్యాఖ్యలు

బహిర్గతమైన మనస్పర్థలు

విమర్శలు–ప్రతి విమర్శలు–ఛలోక్తులు

చెన్నిపాడు సంగమేశ్వరేని సాక్షిగా ప్రమాణాలు

ఒంగోలు / పొన్నలూరు: అధికార పార్టీ నేతల మధ్య ఆసక్తికర సంవా దానికి సంగమేశ్వరుని ఆలయం సాక్షిగా నిలిచింది. విమర్శలు, ప్రతి విమర్శలకు చెన్నినపాడు గ్రామం వేదికగా మారింది. కార్తీక వన సమారాధన కార్యక్రమంలో పరస్పరం పరోక్ష ఆరోపణలు చేసుకున్నారు. ఛలోక్తులు విసురుకున్నారు. కొండపి మండలంలోని చెన్నిపాడు సంగమేశ్వరం ఆలయంలో స్థానికఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి, టీడీపీ నాయకుడు దామచర్ల సత్యనారాయణల ఆధ్వర్యంలో శనివారం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలువురు టీడీపీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసి సభలో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తాను చెప్పిన అభ్యరి టిక్కెట్‌ ఇస్తేనే ఒంగోలు ఎంపీగా పోటా చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పలేదన్నారు.

 అంతకు ముందు కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా టీడీపీలో ఉండి పార్టీ అధికారంలోకి రావడానికి తాము కృషి చేశామన్నారు. నామినేషన్‌లో జరిగిన తప్పిదం వలన 2009లో ఎమ్మెల్యే కాలేకపోయానని, మళ్లీ ప్రజల ఆశీస్సులతో 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందానన్నారు. నాలుగేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని చెప్పుకొచ్చారు. అయితే కొత్తగా పార్టీలో చేరిన వారు, పార్టీలో చేరి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని చెప్పుకుంటున్న వారు కార్యకర్తల్లో ఆందోళన సృష్టిస్తున్నారని పరోక్షంగా ఎమ్మెల్సీ మాగుంటని, మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు.

 వెంటనే దీనికి స్పందించిన మాగుంట తాను ఏ రోజూ పలాన వ్యక్తికి టిక్కెట్‌ ఇవ్వమని, పలాన వ్యక్తికి టిక్కెట్‌ ఇవ్వొద్దని చెప్పలేదన్నారు. పార్టీలో ఎప్పుడు చేరినా ఆ పార్టీ అభివృద్ధి కోసమే పని చేస్తున్నామని బిగ్గరగా చెప్పారు. సంగమేశ్వరం ఆలయ ఆవరణంలో ఉండి చెబుతున్నాను జిల్లాలో ఏ ఎమ్మెల్యేను కూడా మార్చమని తాను ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పలేదని బాబురావుకు సమాధానంగా చెప్పారు. అనంతరం కరణం బలరాం మాట్లాడుతూ పార్టీలో సీనియర్‌ నాయకులం అయినప్పటికీ ఎమ్మెల్సీలుగా పిలిపించుకోవడం ఇబ్బందిగా ఉందన్నారు.

 వన భోజనాల పేరుతో ఇటువంటి కార్యక్రమం పెట్టి నాయకులు, కార్యకర్తల మధ్య సయోధ్య కుదర్చడం మంచిదని సూచించారు. ఈ సభతో స్వామి కార్యం, స్వకార్యం రెండు జరిగాయని పరోక్షంగా ఎమ్మెల్యే డోలాను ఉద్దేశించి ఛలోక్తి విసిరారు. కనిగిరి ఎమ్మెల్యే బాబురావు టిక్కెట్‌ వ్యవహరంలో కొంత అయోమయంలో ఉన్నాడని, ఇబ్బందులు ఉన్నా పార్టీ కోసం అన్ని పరిస్థితులను నెట్టుకొని ముందుకు పోవాలని సూచించారు. టీడీపీ నేతల మధ్య నెలకొన్ని ఈ ఆసక్తికర వ్యాఖ్యలు జిల్లాలోని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top