టీడీపీ నాయకుల వీరంగం

TDP Leaders Fought For Repoling In Sir Artur Cotton Public School  - Sakshi

సాక్షి, విజయవాడ : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్థానిక క్రాంబ్వే రోడ్‌లోని సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేశారు. అందులో ఏర్పాటు చేసిన బూత్‌లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోలింగ్‌ సరళిని బట్టి వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా పెద్ద ఎత్తున పోలింగ్‌ జరిగిందనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ నాయకులు రీపోలింగ్‌ చేయించేందుకు కుట్రపన్నారు. అందులో భాగంగా పశ్చిమ టీడీపీ అభ్యర్థిని షబానా ఖాతూన్‌ను వారు సాయంత్రం అక్కడికి పిలిపించారు.

అయితే ఆమె వచ్చేసరికి 6 గంటలు దాటటంతో గేటు వేసేశారు. దీంతో ఆమెను లోపలికి పంపించాలని టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారు. సమయం మించిపోయింది.. పై అధికారులు అనుమతిస్తే పంపిస్తామని పోలీసులు చెప్పారు. కొందరు చోటా నాయకులు రెచ్చిపోయి వైఎస్సార్‌ సీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షబానాతోపాటు పెద్ద ఎత్తున వచ్చిన స్థానిక నాయకులను చూసి వైఎస్సార్‌ సీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. వైఎస్సార్‌ సీపీ పశ్చిమ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు.

వెంటనే అక్కడికి చేరుకున్న వెలంపల్లి సమన్వయం పాటించాలని అక్కడున్న పార్టీ శ్రేణులకు సూచించారు. దీంతో వారు అక్కడే ఉన్నారు. షబానాను లోపలికి అనుమతిస్తే తమ అభ్యర్థి వెలంపల్లిని కూడా అనుమతించాలని పోలీసులను కోరారు. ఈ విషయమై పోలీసులు పై అధికారులపై సంప్రదింపులు జరుపుతున్నారు.

పట్టాభి రాకతో పెరిగిన ఉద్రిక్తత
ఈ క్రమంలో టీడీపీ అర్బన్‌ ప్రధాన కార్యదర్శి పట్టాభి అక్కడికి చేరుకుని పోలింగ్‌ స్టేషన్‌లో ఉన్న పీఓలతో గొడవకు దిగారు. 26వ నంబర్‌ బూత్‌లో 10 వరకు అవకాశం ఇచ్చినప్పుడు అభ్యర్థిని లోపలకు ఎందుకు అనుమతించరంటూ పీఓలతో ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు మొత్తం గేటు దగ్గరకు చేరుకుని హడావుడి చేశారు.

దీంతో మండిపడ్డ వైఎస్సార్‌ సీపీ నాయకులు నినాదాలు చేయటంతో పోలీసులు వారు ముందుకు రాకుండా రోప్‌ను అడ్డంగా పెట్టారు. టీడీపీ నాయకులను గేటు దగ్గర నుంచి బయటకు పంపి వారిని కూడా రోప్‌తో అడ్డగించాలని నినాదాలు చేశారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ 27వ డివిజన్‌ అధ్యక్షుడు చిన సుబ్బయ్య వెలంపల్లిపై వ్యక్తిగత ఆరోపణలకు దిగాడు. వైఎస్సార్‌ సీపీ నాయకులు చిన సుబ్బయ్యపై ధ్వజమెత్తుతూ రోప్‌ను తోసుకుంటూ ముందుకు రావడానికి ప్రయత్నించారు.

దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు లాఠీలు ఝుళించి అందరినీ చెల్లాచెదురు చేశారు. తరువాత షబానా తరుఫున ఎన్నికల పరిశీలకుడిగా వచ్చిన అన్పారీ అభ్యర్థులిద్దరినీ లోపలికి అనుమతిస్తే ఏ గొడవ ఉండదని చెప్పటంతో పోలీసులు వెలంపల్లిని పిలిచారు. చివరికి ఇరు పార్టీల తరుపున ఒకొక్కరిని గేటు బయట ఉండి 26వ నంబర్‌ బూత్‌లో ఓటేసేందుకు వచ్చినవారని లోపలకు పంపించేందుకు ఏర్పాటు చేయటంతో గొడవ సద్దుమణిగింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top