సాగర హారతి సాక్షిగా 'సై'ఆట | Sakshi
Sakshi News home page

సాగర హారతి సాక్షిగా 'సై'ఆట

Published Mon, Nov 6 2017 10:03 AM

tdp leaders dance on devotees stage - Sakshi

బాపట్ల:  సాగర తీరంలో శివుడికి పూజలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన శివలింగం సాక్షిగా టీడీపీ నాయకులు శనివారం రాత్రి బావల సై.. పాటల కచేరి నిర్వహించారు. ఎంతో పవిత్రతతో తీరానికి వస్తే ఇలాంటి పాటలేంటని భక్తులు సైతం ముక్కున వేలేసుకున్నారు. లక్షలాది మంది పుణ్యస్నానం ఆచరించేందుకు వచ్చే సాగర తీరంలో టీడీపీ నాయకులు చిందులాటకు ప్రాధాన్యం ఇచ్చారు. ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్‌ స్టేజీ ఏర్పాటు చేసి మహిళలు స్నానాల అనంతరం శివుడికి పూజలు చేసేందుకు శివలింగాన్ని ఏర్పాటు చేశారు. అదే స్టేజీపై ‘బావలు సయ్యా... మరదలు సయ్యా..’ లాంటి పాటలను గాయకులతో పాడిం చారు. ఉదయం కనీసం చెప్పులు కూడా వేసుకోకుండా భక్తులు శివలింగానికి పూజలు చేయగా సాయంత్రం అదే స్టేజీపై నాయకులు బూట్లు, చెప్పులు వేసుకుని మరీ డ్యాన్స్‌ చేయడం గమనార్హం.

గందరగోళంలో సాగరతీరం
ప్రశాంతమైన సముద్ర తీరంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా  పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులు గందరగోళానికి గురయ్యారు. ఉదయం కొన్ని భక్తిగీతాలు ఆలపించేందుకు ఏర్పాటు చేసిన పాట కచ్చేరి విభాగం సాయంత్రం ఇంకోలాగా మారింది. సింగర్స్‌ పాటలు పాడుతుండగా టీడీపీ నాయకులు చిందులు తొక్కారు. సాధారణంగా భారీ జన సందోహం ఎక్కువగా ఉన్న చోట వారి వసతులు, అవసరాలకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా టీడీపీ నాయకులు కచేరి ఏర్పాటు చేయడం గమనార్హం. సాగర హారతి పేరుతో ఏర్పాటు చేసిన స్టేజీ కూడా పోలీసు కంట్రోల్‌ రూము వద్దనే ఉంది. పోలీసులు భక్తులకు మైకులో సలహాలు, సూచనలు ఇవ్వాల్సి ఉండగా కచేరి వద్ద ఏర్పాటు చేసిన అత్యాధునిక లౌడ్‌స్పీకర్ల ధాటికి విధులు సక్రమంగా చేయలేకపోయారు. దీంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. భక్తులు కూడా అసౌకర్యానికి గురయ్యారు.

Advertisement
Advertisement