చెక్కులివ్వాలంటే చెల్లించాల్సిందే!

TDP Leaders Collecting Money From Dwcra Groups - Sakshi

పసుపు – కుంకుమ పథకంలో సిబ్బంది చేతివాటం

చెక్కులు ఇచ్చేందుకు రూ.వెయ్యి డిమాండ్‌

స్థానిక టీడీపీ కార్పొరేటర్‌ అండతో సీడీఓ దందాపై ఆరోపణలు

52వ డివిజన్‌లో వెలుగులోకి వచ్చిన వైనం

గ్రూపు సభ్యులు నేరుగా కమిషనర్‌కే ఫిర్యాదు

విచారణకు ఆదేశించిన వీఎంసీ కమిషనర్‌

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆత్రుతలో టీడీపీ నాయకులు ఉన్నారు. అందులో భాగంగా డ్వాక్రా సంఘాల వద్ద కూడా వసూళ్లు ప్రారంభించారు. మరో నాలుగు నెలల్లో తమ పదవి కాలం ముగుస్తున్నందున ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పసుపు – కుంకుమ పథకంలో డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేసే విషయంలో స్థానిక క్షేత్రస్థాయి సిబ్బందితో సంఘాల నుంచి వసూళ్ల దందా మొదలెట్టారు. ఒక్కో గ్రూపు నుంచి రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు.  

కృష్ణాజిల్లా, పటమట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెబుతున్న పసుపు–కుంకుమ పథకంలో డ్వాక్రా సంఘాలకు చెక్కుల పంపిణీ అవినీతిమయంగా మారింది. నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, అర్బన్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ (యూసీడీ) విభాగం సిబ్బంది కుమ్మకై లబ్ధిదారులైన డ్వాక్రా సంఘాల నుంచి సొమ్ములు దండుకుంటున్నారు. సొమ్ములు చెల్లించకపోతే డిఫాల్టర్ల గ్రూపులుగా చిత్రీకరించి చెక్కులు ప్రభుత్వానికి తిరిగి పంపుతామని హెచ్చరిస్తూ, ఒక్కో గ్రూపు నుంచి రూ.వెయ్యి నుంచి రూ.12 వందల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇటీవల వీఎంసీ కమిషనర్‌కు నేరుగా స్థానిక మహిళలు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది.

నగరంలోని 52వ డివిజన్‌లో ఉన్న 350 గ్రూపుల నుంచి స్థానిక సీవో (కమ్యూనిటీ ఆర్గనైజర్‌), సోషల్‌ వర్కర్‌లు, క్లస్టర్‌ రిసోర్స్‌ పర్సన్, రిసోర్స్‌ పర్సన్‌లతో స్థానిక టీడీపీ మహిళా నేత కుమ్మకై ఒక్కో గ్రూపు నుంచి సొమ్ములు వసూలు చేయాలని, సంఘాల వద్ద వసూలు చేసిన సొమ్ములో పర్సంటేజీలు లెక్క పంపకాలు చేసుకుందామని ఓపెన్‌ ఆఫర్‌ ఇవ్వటంతో యూసీడీ విభాగం సిబ్బంది చెలరేగిపోయారు. ప్రతి గ్రూపు నుంచి స్థానిక నేతలకు వాటాలు ఇవ్వాలని బలవంతంగా వసూళ్లు చేయటంతో మహిళలు వీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సంబంధిత సిబ్బంది ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేయాలని, సంఘాలకు సంబంధించి డిఫాల్టు లేదని నిర్థారించేందుకు సొమ్ములు వసూలు చేశారని, నగరంలోని 51, 52, 53 డివిజన్లలో వసూళ్లు అధికంగా ఉన్నాయని, నగరంలోని 59 డివిజన్లకు 40 చోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొందని ఆరోపణలు వస్తున్నాయి.

ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు..
పసుపు – కుంకుమ పథకంలో వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై, అందుకు కారణమైన స్థానిక నేత పాత్రలపై వీఎంసీ విచారణ చేపట్టింది. యూసీడీ పీవో ఎంవీవీ సత్యనారాయణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం బుధవారం నుంచి విచారణ ప్రారంభించింది. డ్వాక్రా సంఘాలతో సమావేశమై విచారణ నిర్వహించారు.

శాఖాపరమైన చర్యలుతీసుకుంటాం..
పసుపు – కుంకుమ పథకంలో లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చే నేపథ్యంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శన చేశారని వచ్చిన ఆరోపణలతో విచారణ చేపట్టాం. అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతంలోని ఓ సీడీవో వద్ద గ్రూపు సభ్యులకు ఇవ్వాల్సిన 120 చెక్కులను గుర్తించాం. ఆయా గ్రూపు సభ్యులు సిబ్బందికి సొమ్ములు చెల్లించకపోవటంతో వారికి వీటిని అందించలేదు. స్థానిక ప్రజా ప్రతినిధుల ఒత్తిడి కూడా సిబ్బందిపై ఉంది. దీనిపై కమిషనర్‌కు నివేదిస్తాం. కమిషనర్‌ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.– ఎంవీవీ సత్యనారాయణ, పీవో యూసీడీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top