
ఇదేం ప్రచారం...?
నెల్లిమర్ల నగర పంచాయతీ త్వరలోనే రద్దవుతుంది. నెల్లిమర్ల, జరజాపుపేట గ్రామాలను తిరగి పంచాయతీలుగా ప్రభుత్వం మార్పు చేస్తుంది. ఇందుకు సంబంధించిన జీవో త్వరలోనే జారీకానుంది.
నెల్లిమర్ల: ‘‘నెల్లిమర్ల నగర పంచాయతీ త్వరలోనే రద్దవుతుంది. నెల్లిమర్ల, జరజాపుపేట గ్రామాలను తిరగి పంచాయతీలుగా ప్రభుత్వం మార్పు చేస్తుంది. ఇందుకు సంబంధించిన జీవో త్వరలోనే జారీకానుంది. ఇదీప్రస్తుతం నగర పంచాయతీలో జోరుగా జరుగుతు న్న ప్రచారం. దీంతో నగర పంచాయతీకి చెందిన నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాల ప్రజలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంటి పన్ను, ఆస్తి పన్ను చెల్లించేందుకు వెనుకంజ వేస్తున్నారు. మండలంలోని నెల్లిమర్ల, జరజాపుపేట మేజరు పంచాయతీలను గతేడాది మార్చిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నగర పంచా యతీగా మార్పు చేసిన సంగతి తెలిసిందే.అప్పట్లో దీనికి సంబంధించిన జీవో కూడా విడుదలైంది.
అయితే నగర పంచాయతీగా మార్పు చేయడం తమకు ఇష్టం లేదని ఇరు ప్రాంతాలకు చెందిన ప్రజలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టులో ప్రస్తుతం ఈ కే సు నడుస్తోంది. విషయం కోర్టు పరిధిలో ఉండడంతో మొన్నటి ఎన్నికల్లో నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు ఇటీవల సంబంధిత మంత్రులను కలి సారు. నగర పంచాయతీని ర ద్దు చేసి, గ్రామ పంచాయతీలుగా మార్పు చేసే అంశాన్ని పరిశీ లిస్తామని సదరు మంత్రులు చెప్పినట్టు సమాచారం. దీంతో ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు నెల్లిమర్ల, జరజాపుపేట ప్రాంతాలు మళ్లీ గ్రామ పంచాయతీలుగా మారుతాయని ప్రచా రం చేయడం మొదలుపెట్టారు. ఈ తతంగం మున్సిపాలిటీ అధికారులకు తలనొప్పిగా మారింది.
ఎప్పుడైతే ఈ ప్రచారం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి స్థానికులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంటి పన్నులు, ఆస్తిపన్ను లు చెల్లించడం మానేసారు. గతంలో ఎంత మొత్తంలో అయితే పన్నులుగా వసూలు చేసేవారో..నగర పంచాయతీగా మారిన తరువాత కూడా అంతే మొత్తం వసూలు చేస్తున్నారు. అయినా స్థానికులు పన్నులు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారన్నది అధికారుల వాదన. దీంతో కొంతకాలంగా నగర పంచాయతీకి రావాల్సిన ఆదాయం పూర్తిగా పడిపోయింది. ప్రతినెలా రూ.లక్షల్లో వసూలయ్యే మొత్తం ప్రస్తుతం వేలల్లో కూడా రావడం లేదు.
దీంతో మౌలిక సదుపాయాల కల్పన జరగక అభివృద్ధి కుంటుపడుతోంది. అంతేకాకుండా సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి దాపురించిం ది. ప్రజలే కాకుండా సంస్థలు కూడా ఆస్తిపన్ను చెల్లించడం లేదు. నగర పంచాయతీ రద్దు విషయమై ఎటువంటి ప్రకటనా రాలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం నగర పంచాయతీని రద్దు చేసినా ప్రక్రియ పూర్తయ్యేందుకు కనీసం ఆరు నెలలు పడుతుందని ఈలోగా పన్నులు చెల్లించకపోవడం దురదృష్టకరమని వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే నగర పంచాయతీ అభివృద్ధి కుంటుపడుతుందని స్పష్టం చేస్తున్నారు.