జెడ్పీటీసీ పదవికి టీడీపీ నేత రాజీనామా | TDP Leader Resign To ZPTC Post PSR nellore | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీ పదవికి టీడీపీ నేత రాజీనామా

Nov 1 2018 1:34 PM | Updated on Nov 1 2018 1:34 PM

TDP Leader Resign To ZPTC Post PSR nellore - Sakshi

మాట్లాడుతున్న జెడ్పీటీసీ శ్రీధర్‌రెడ్డి

నెల్లూరు(అర్బన్‌): అధికార పార్టీకి చెందిన కొడవలూరు మండల జెడ్పీటీసీ సభ్యుడు ఇరువూరు శ్రీధర్‌రెడ్డి తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. జెడ్పీ సమావేశాల్లో లేవనెత్తిన ఒక్క సమస్యకు తమ పార్టీ నాయకులతో సహా అధికారులు, మంత్రులు, పాలకులు పరిష్కారం చూపలేకపోయారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొంత పార్టీ, నేతల తీరును ఎండగట్టుతూ అలంకారప్రాయంగా మారిన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా పత్రాన్ని జిల్లా అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జెడ్పీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఎన్నోసార్లు ప్రస్తావించినప్పటికీ వాటిని మంత్రులు, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జెడ్పీ సమావేశాల్లో జెడ్పీటీసీ సభ్యులు మాట్లాడితే మంత్రులు, అ«ధికారులు సమాధానం చెప్పాలన్నారు. అందుకు విరుద్ధంగా ప్రజాసమస్యలు చర్చకు రాకుండా అధికార, ప్రతి పక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తమకు అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారంటూ సొంత పార్టీ నేతల తీరుపైనే పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

రాజీనామాకు కారణాలు ఇవే
జిల్లాలోని ఇఫ్‌కో కిసాన్‌ సెజ్‌లో కోట్లాది రూపాయల కుంభకోణం జరుగుతుందన్నారు. గ్రామాల్లో చెరువులను ఆక్రమించి రైతులకు నీళ్లు రాకుండా సెజ్‌ అధికారులు అడ్డుకున్నారన్నారు. జిల్లా పాలనాధికారి సహకారంతో రైతులపైనే కేసులు పెట్టారని తెలిపారు. ఈ సెజ్‌లో 3 వేల మంది రైతుల దగ్గర 3,300 ఎకరాలు సేకరించి కేవలం 254 ఎకరాలకే పరిహారం ఇచ్చారని తెలిపారు. బొడ్డువారిపాళెం సెజ్‌లో హైవేను ఆనుకుని ఉన్న భూమి ఎకరా రూ.40 లక్షలకు పలుకుతుంటే కేవలం రూ.6 లక్షలు మాత్రమే చెల్లించి రైతులను నిలువు దోపిడీ చేశారన్నారు. నేషనల్‌ హైవే రోడ్డును విస్తరించే క్రమంలో మైనింగ్‌ ద్వారా గ్రామ పంచాయతీలకు సీనరేజీ రాయిల్టీ రావాల్సిన రూ.2.60 కోట్లను ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకుందన్నారు. 14 పంచాయతీలు తమ గ్రామాలను నుడాలో కలపవద్దని తీర్మానం చేశారని తెలిపారు. నుడాతో ఈ పంచాయతీలకు తీవ్రనష్టం ఏర్పడుతుందన్నారు.

నుడా అధికారులు ఈ 14 గ్రామాల ఆదాయాన్ని నెల్లూరుకు తరలించుకుపోతున్నారని, ఇదెక్కడి న్యాయమని తెలిపారు. ఈ విషయాలన్నింటిపై తాను .జెడ్పీ సమావేశాల్లో అధికారులను, మంత్రులను నిలదీసినా.. ప్రభుత్వం తమదే అయినా ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదని దుయ్యబట్టారు. తాను కిసాన్‌ ఇఫ్‌కో సెజ్‌పై కోర్టులో కేసు దాఖలు చేశానని, వచ్చే 14న తీర్పు తమకే అనుకూలంగా రాబోతుందన్నారు. ఇఫ్‌కో భారీ స్థాయిలో తమకు ముడుపులు చెల్లించేందుకు సిద్ధపడి కేసును వాపసు తీసుకోవాలని కోరిందన్నారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనకు అండగా నిలబడ్డారని,  రైతుల పక్షాన మాట్లాడినప్పటికీ ప్రభుత్వం ఎమ్మెల్యే మాటలను సైతం పట్టించుకోలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ఈ 14 పంచాయతీల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్నారు. ఇదిలా ఉండగా రాజీనామా లేఖను తీసుకునేదానికి జెడ్పీ డిప్యూటీ సీఈఓ వసుంధర అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం కలెక్టర్‌ ముత్యాలరాజుకే జెడ్పీటీసీలు నేరుగా రాజీనామా ఇవ్వాలన్నారు. దీంతో తన రాజీనామా ప్రతిని కలెక్టర్‌కు ఇచ్చేందుకు వెళ్లారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement