వైఎస్‌ వరం ప్రైవేట్‌ పరం

TDP Government Negligence on VIMS - Sakshi

వ్యథల కథలు

ఉత్తరాంధ్ర ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం

అందించాలని కలగన్న రాజన్న

హనుమంతవాక వద్ద 100 ఎకరాల్లో విమ్స్‌ ఏర్పాటు

ఆస్పత్రి లక్ష్యాన్ని దెబ్బ తీసిన చంద్రబాబు

ఒక్కో విభాగాన్ని కార్పొరేట్లకు అప్పగిస్తున్న వైనం

పేదోడి ఆస్పత్రిలో డబ్బులిస్తేనే అందుతున్న సేవలు

విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌) నిర్వహణలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన మొదటి క్యాబినెట్‌ సమావేశంలో 100 రోజుల్లో పూర్తి స్థాయిలో విమ్స్‌ను ప్రారంభించి ఉచిత వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానించారు. ఈ తీర్మానం రెండేళ్లపాటు గాలిలో గిరిగిరా తిరిగింది. వైఎస్సార్‌ సీపీ, వామ పక్షాలు, స్వచ్ఛంద సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఎట్టకేలకు దిగివచ్చిన ప్రభుత్వం 2016 ఏప్రిల్‌ 11న సేవలు ప్రారంభించింది. అయినా ఉచిత సేవలు మాత్రం అందించకపోయింది.సూపర్‌ స్పెషాలిటీ సేవలను దూరంగా పెట్టింది. అంతే కాకుండా విమ్స్‌ను ప్రైవేట్‌పరం చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అంచెలంచెలుగా ఇక్కడ సేవలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించేస్తోంది.

ఇక్కడ అన్ని వైద్యసేవలు ఉచితంగా అందించాలనే ఆశయంతో.. ప్రభుత్వమే నడిపించాలనే ఆలోచనతో..  వైఎస్‌ రాజశేఖరరెడ్డి విమ్స్‌ను నిర్మించారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు దీన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు చేశారు. అనంతరం వచ్చిన టీడీపీ  కూడా అదే పంథా ను కొనసాగించింది. అంచెలంచెలుగా ప్రైవేట్‌పరం చేసుకుపోతోంది. రక్త పరీక్షల నుంచి ఎంఆర్‌ఐ స్కానిం గ్‌ వరకు ప్రైవేట్‌ సంస్థలైన డాల్ఫిన్‌ డ యాగ్నస్టిక్స్, పాత్‌కేర్‌ లేబొరేటరీలకు అప్పగించింది. ఈ సంస్థలు వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆరు సూపర్‌ స్పెషాలిటీ విభాగాల ను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడానికి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఇక్కడ డ బ్బులు చెల్లించి సేవలు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విమ్స్‌.. విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. ఈ ఆస్పత్రి ద్వారా ఉచితంగా సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయని ఉత్తరాంధ్ర ప్రజలు భావించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం వారి ఆశలు నీరుగారాయి. గొప్ప ఆశయంతో.. ఉన్నత ప్రమాణాలతో ఏర్పాటు చేసిన విమ్స్‌ లక్ష్యాన్ని చంద్రబాబు దెబ్బతీశారు. ఇక్కడ వైద్య సేవలను ప్రైవేట్‌పరం చేయడంతో పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందని ద్రాక్షగా మారింది. – ఆరిలోవ (విశాఖ తూర్పు)

మొదటి క్యాబినెట్‌ నిర్ణయం గాలికి..
టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం మొద టి క్యాబినెట్‌ సమావేశం ఏయూలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విమ్స్‌లో మూడు నెలల్లో  సేవలను ప్రారంభించి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తీర్మానించారు. నిర్వహణ ఖర్చులకు రూ.100 కోట్లు విడుదల చేస్తామన్నారు. ఈ రెండు తీర్మానాలు గాలికొదిలేశారు. మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్న విమ్స్‌ను రెండేళ్లకు ప్రారంభించారు. రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి.. రూ.30 కోట్లే విడుదల చేశారు.

సేవలు కుదింపు
మొదట్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి 1,130 పడకలు, 21 సూపర్‌ స్పెషాలిటీలు ఇక్కడ అందుబాటులో ఉంచాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయన మరణానంతరం ముఖ్యమంత్రిగా వచ్చిన ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి 500 పడకలకు కుదించి, 21 సూపర్‌ స్పెషాలిటీలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అది కార్యరూపం దాల్చలేదు. టీడీపీ హయాంలో విమ్స్‌ను పూర్తిగా ప్రయివేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేయాలని తలచారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు వ్యతిరేకించి ఉద్యమాలు చేపట్టడంతో దిగివచ్చి ఎట్టకేలకు 2016, ఏప్రిల్‌ 11న ప్రారంభించారు. అయితే ఆస్పత్రి సేవలను 200 పడకలు, 15 సూపర్‌ స్పెషాలిటీలకు కుదించేశారు. అదీ అమలు చేయకుండా ప్రస్తుతం 150 పడకలకే పరిమితం చేశారు.

ప్రైవేట్‌పరం దిశగా 33 జీవో విడుదల
విమ్స్‌లో కొత్తగా మరో ఆరు సూపర్‌ స్పెషాలిటీ విభాగాలు పీపీపీ విధానంలో టాటా కన్సెల్టెన్సీకి అప్పగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో జోవో 33 విడుదల చేసింది. దీనికి సంబధించిన ఉత్తర్వులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు పంపించింది. కార్డియక్‌ సైన్స్‌స్, గాస్ట్రో సైన్సెస్, రీనల్‌ సైన్సెస్, నియోటాలజీ(నవజాత శిశువులు), స్పోర్ట్స్‌ ఇంజూరీస్, స్టెమ్‌సెల్‌ చికిత్స సూపర్‌ స్పెషాలిటీలను ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాలని జీవోలో వివరించింది.

 నేపథ్యమిదీ..
ఉత్తరాంధ్ర వాసులకు ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందించాలని 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తలచారు. ఇందుకు హనుమంతవాక వద్ద పశుసంవర్ధక శాఖకు చెందిన 99.98 ఎకరాల స్థలాన్ని విమ్స్‌కు కేటాయించి రూ.250 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఆరు బ్లాకుల్లో 1,130 పడకలు, 21 సూపర్‌ స్పెషాలిటీలు అందుబాటులోకి తీసుకురావాలని సన్నాహాలు చేశారు. మొదటి విడతగా భవన నిర్మాణానికి రూ.55 కోట్లు నిధులు కేటాయించి, ఇందుకోసం 2007 ఆగస్టులో శంకుస్థాపన చేశారు. 2009 డిసెంబర్‌ నాటికి నిర్మాణం పూర్తి చేసి, సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఆయన హయాంలో పనులు చకచకా సాగిపోయాయి. 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో విమ్స్‌ నిర్మాణ పనులు చతికలపడ్డాయి. తర్వాత రోశయ్య హయాంలో రూ.20 కోట్లు, కిరణ్‌కుమార్‌ రెడ్డి హయాంలోరూ.30 కోట్లు మంజూరు చేయడంతో భవన నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ఆస్పత్రి ఆవరణలో రోడ్లు, ప్రహరీ, మార్చురీ, క్యాంటీన్, కిచెన్, రోగుల విశ్రాంతి హాల్, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, తదితర వాటిని నిర్మించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు విడతల్లో రూ.15 కోట్లు చొప్పున విడుదల చేసి చేతులు దులిపేసుకొన్నారు. ఆస్పత్రి నిర్వహణ భారమవుతోందని, ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో ఒక్కో విభాగం ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక జీవో విడుదల చేసి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు.   

అరకొర సిబ్బంది..
ఇక్కడ సిబ్బంది లేమితో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. వైద్యులు, నర్సింగ్, అడ్మినిస్ట్రేషన్‌ సిబ్బందితో పాటు సుమారు 400 మంది ఉండాల్సిన ఈ ఆస్పత్రిలో 134 మందితో కాలయాపన చేస్తున్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ అసిస్టెంట్లు కలిపి సుమారు 70 మంది ఉన్నారు. వీరికి 34 మంది స్టాఫ్‌ నర్సులు, అసిస్టెంట్లు మాత్రమే ఉన్నారు. ఆఫీస్‌ సిబ్బంది మరో 30 మంది వరకు ఇక్కడ ఉన్నారు. వీరంతా విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదా వరి జిల్లాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన వారే. ఇది ఆస్పత్రి ప్రారంభం నాటి నుంచి ఉన్న సంఖ్యే. అవుట్, ఇన్‌ పేషెంట్లు సంఖ్య రోజుకు రోజుకూ పెరుగుతోంది. ఆపరేషన్‌ థియేటర్లు, కొన్ని విభాగాలు ఏర్పడ్డాయి. వైద్య సిబ్బంది మాత్రం పెరగడం లేదు. విమ్స్‌లో వైద్యులు, నర్సింగ్, అడ్మినిస్ట్రేషన్, క్లాస్‌ఫోర్, తదితర విభాగాల్లో 850 శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేస్తామ ని ఆరు నెలల కిందట ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 137 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

సిబ్బందికి వేతనాల్లేవ్‌ ..
విమ్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న నర్సింగ్‌ సిబ్బంది నుంచి అడ్మినిస్ట్రేషన్, డైరెక్టర్‌ వరకు ఇతర ప్రాంతాల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన వారే. ఇక సెక్యూరిటీ, పారిశుద్ధ్య సిబ్బందిని ప్రైవేట్‌ సంస్థలు కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించాయి. ఆ సంస్థలు ఇక్కడ 24 మంది సెక్యూరిటీ సిబ్బంది, 70 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియామకం చేశాయి. ఆ ప్రైవేట్‌ ఏజెన్సీలకు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో వేతనాలు లేక సిబ్బంది విలవిలలాడుతున్నారు. ప్రస్తుతం నాలుగు నెలలుగా వీరికి వేతనాలు చెల్లించకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. ఈ విషయం విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దృష్టికి సిబ్బంది తీసుకెళ్లినా.. ఫలితం కనిపించలేదు.

3 లక్షల మందికి సేవలు
విమ్స్‌ అందుబాలోకి వచ్చిన నుంచి ఇంతవరకు సుమారు 3 లక్షల మంది రోగులకు సేవలందించారు. వారిలో 4 వేల మంది ఇ¯Œ  షేషెంట్ల్లకు సేవలందాయి. 2,300 మందికి పైగా శస్త్రచికిత్సలు జరిగాయి. వారిలో 2016 ఏప్రిల్‌ 11 నుంచి డిసెంబర్‌ 31 వరకు సుమారు 50 వేల మంది ఓపీ నమోదు కాగా.. 2017 జనవరి నుంచి డిసెంబర్‌ 31 వరకు 1,26,432 మంది రోగులు ఇక్కడ సేవలు పొందారు. 2018 జనవరి నుంచి ఇంత వరకు 70వేల మంది అవుట్‌ పేషెంట్లు వచ్చారు. 2019లో 120 ఆపరేషన్లు జరిగాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top