పోలవరం భూసేకరణలో టీడీపీ ప్రభుత్వ అక్రమాలు

TDP government Irregularities In Polavaram Land Acquisition In West Godavari - Sakshi

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విలీన మండలాల్లో పోలవరం ప్రాజెక్టు నిమిత్తం చేసిన భూసేకరణ అంతా లోపభూయిష్టంగా జరిగింది. కొందరు బడాబాబులు నిర్వాసిత రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, అధికారులతో కుమ్మక్కై వారిని నిలువుదోపిడీ చేశారు. తీరా విషయం తెలుసుకున్న బాధితులు అధికారుల చుట్టూ తిరిగినా వారికి న్యాయం మాత్రం జరగలేదు. 

సాక్షి, పశ్చిమగోదావరి(కుక్కునూరు) : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారంలో అక్రమాలు ఇంకా వెలుగు చూస్తూనే ఉన్నాయి. పరిహారం అందని అమాయక నిర్వాసితులు ఇప్పటికీ న్యాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే... చెట్లు, బోర్లు, భూమి లేకున్నా ఉన్నట్లుగా తప్పుడు రికార్డులు సృష్టించి పరిహారం కాజేసిన బడాబాబులు మాత్రం సంపాదించిన అవినీతి సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిమిత్తం కుక్కునూరు, వేలేరుపాడు మండలాలలో 2006లో 700 ఎకరాలను సేకరించిన ప్రభుత్వం ఎకరాకు రూ.1.15 లక్షల పరిహారాన్ని ఇచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం 2016లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణ నిమిత్తం ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించింది. ఈ సందర్భంగా మండలంలో 15 పంచాయతీల పరిధిలో ముంపునకు గురవుతున్న భూములకు జరిపిన  భూసేకరణలో మండల వ్యాప్తంగా దాదాపు 15 వేల ఎకరాలను సేకరించిన ప్రభుత్వం పరిహారం కింద ఎకరానికి రూ.10.50 లక్షల చొప్పున చెల్లించింది.

అప్పటి భూసేకరణాధికారి అసైన్‌మెంట్‌ భూములకు రశీదులు ఉన్నా సరిపోతుందని చెప్పడంతో కేటుగాళ్లు రంగప్రవేశం చేశారు. తమది కాని భూమిని కూడా తమదన్నట్టు రశీదులు సృష్టించి కోట్ల రూపాయల అవినీతికి తెరలేపారు. మండలానికి సంబంధించి ఒక్క భూసేకరణలోనే రూ. 50 నుండి రూ. 100 కోట్ల మేర అవినీతి జరిగిందని అంచనా. అప్పటి భూసేకరణాధికారి ముంపులో లేని బడాబాబుల భూములకు పరిహారం చెల్లించగా.. లేని భూమికి రికార్డులు సృష్టించిన కేటుగాళ్లు కోట్ల రూపాయలు కాజేశారు. అధికారులు అవినీతి పరులకు తమ వంతు సహకారం అందించారన్నది అందరికీ తెలిసిన విషయమే.

పరిహారం ఇవ్వకుండా సర్వే రాళ్లు వేశారు
మండలంలోని దాచారం పంచాయతీ బెస్తగూడెం గ్రామానికి చెందిన కోమళ్ల వీరబ్రహ్మాచారికి ఇదే పంచాయతీ పరిధిలోని మొద్దులగూడెం గ్రామ సమీపంలో సర్వే నెంబర్‌ 280/1 లో మూడున్నరెకరాల భూమి ఉంది. ప్రస్తుతం వీరబ్రహ్మాచారి సదరు భూమిలో వరి, జాడు పంటను పండిస్తున్నాడు. పోల వరం భూసేకరణ సమయంలో సర్వేయర్లు వీరబ్రహ్మాచారికి సంబంధించిన భూమి ముంపులో లేదంటూ సేకరించలేదు. ఆయన చుట్టూ ఉన్న భూములను మాత్రం సేకరించారు. ఇటీవల సర్వేయర్లు వచ్చి బ్రహ్మాచారికి సంబంధించిన భూమిలో సర్వేరాళ్లు వేయడం ప్రారంభించారు. ఆ భూమి పోలవరం భూ సేకరణలో సేకరించినట్టు, పరిహారం ఇచ్చినట్లు రికార్డులలో ఉందని చెప్పారు. దీంతో ఏమి చేయాలో తెలియక న్యాయం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాడు.

న్యాయం జరిగేట్టు చూస్తా : తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌
మొద్దులగూడెంలో వీరబ్రహ్మాచారి విషయమై తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే డిప్యూటీ సర్వేయర్లు మండలానికి రానున్నట్టు తెలిపారు. వారు రాగానే పీఓతో మాట్లాడి సర్వే చేయించి వీరబ్రహ్మాచారి భూమి కనుక భూసేకరణలో తీసుకొని ఉంటే న్యాయం జరిగేలా చూస్తానన్నారు.

కార్యాలయాల చుట్టూ తిరగలేను 
ఈ వయస్సులో న్యాయం కోసం నేను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేను. నా భూమి మూడున్నరెకరాలకు పరిహారం ఇచ్చారంటున్నారు. నా పరిహారాన్ని నాకు ఇప్పించండి. అది న్యాయంగా నాకు రావాల్సిందే. మా తాత ముత్తాతల నుండి ఆ భూమిని మేమే సాగు చేస్తున్నాం. ప్రభుత్వం మా లాంటి వారి మీద దయ చూపించి మా కుటుంబాలకు న్యాయం చేయ్యాలి.
– కోమళ్ల వీరబ్రహ్మాచారి, బెస్తగూడెం, కుక్కునూరు మండలం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top