ఎల్‌'ఛీ'డీ | TDP Government Corruption in LED Bulbs Contact | Sakshi
Sakshi News home page

ఎల్‌'ఛీ'డీ

Oct 14 2019 1:17 PM | Updated on Oct 14 2019 1:17 PM

TDP Government Corruption in LED Bulbs Contact - Sakshi

కాకినాడ రూరల్‌ తూరంగిలో అలంకార ప్రాయంగా ఉన్న ఎల్‌ఈడీ బల్బు

తూర్పుగోదావరి ,బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కరెంటును ఆదా చేసే పేరుతో గత టీడీపీ సర్కారు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ వీధిదీపాలు.. ఆ ప్రభుత్వం అమలు చేసిన విధానం పుణ్యమా అని ఇప్పుడు అలంకారప్రాయంగా మిగిలాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) సహకారంతో 2017–18 కాలంలో ఎల్‌ఈడీ బల్బులు అమర్చారు. వీటి నిర్వహణ కాంట్రాక్టును నాటి ప్రభుత్వం ఓ సంస్థకు అప్పగించింది. నిర్వహణ నిధులు వసూలు చేసిన ఆ సంస్థ.. తరువాత ఎల్‌ఈడీ బల్బుల నిర్వహణను గాలికొదిలేసింది. ఫలితంగా కొన్ని స్తంభాలకు రాత్రి, పగలు అనే తేడా లేకుండా లైట్లు వెలుగుతున్నాయి. కొన్ని బల్బులు వెలగడం లేదు. కాంట్రాక్టు సంస్థ పట్టించుకోకపోగా.. స్థానిక ఎలక్ట్రీషియన్లు కూడా వాటికి మరమ్మతులు చేసేందుకు ససేమిరా అంటున్నారు. ఫలితంగా పల్లెల్లోని పలు వీధుల్లో ప్రస్తుతం అంధకారం అలముకుంటోంది. నెలల తరబడి వీధిదీపాలు వెలగక గ్రామీణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో దీపాలు వెలగక రాత్రి సమయంలో వీధుల్లో చీకట్లు అలముకోవడంతో భయపడుతున్నారు. ఎల్‌ఈడీల పేరుతో టీడీపీ సర్కారు పెద్దలు గ్రామాలను అంధకారంలోకి నెట్టారు తప్ప.. వీటివల్ల తమకు ఒరిగిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్వహణ చార్జీల వసూలు
జిల్లాలోని 1,072 గ్రామ పంచాయతీల్లో మొత్తం 3.10 లక్షల ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. మేజర్‌ గ్రామ పంచాయతీలో 300 పైగా, మైనర్‌ పంచాయతీలో 150 పైగా ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు బల్బుకు, నెలకు రూ.50 చొప్పున చార్జీలు వసూలు చేశారు. ఈవిధంగా జిల్లావ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయతీల నుంచి రూ.1.80 కోట్లు వసూలు చేసి, సంబంధిత కాంట్రాక్టరుకు చెల్లించారు. అయినప్పటికీ ఆ సంస్థ ఎల్‌ఈడీ దీపాల నిర్వహణను పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో కొన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు నిర్వహణ చార్జీలు చెల్లించడం లేదు. ఈఈఎస్‌ఎల్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 10 సంవత్సరాల వరకూ ఎల్‌ఈడీ దీపాలు పాడైతే కొత్తవి వారే వేయాల్సి ఉంది. కానీ, గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులు పాడైనప్పటికీ వాటిని మార్చడం లేదు. అసలు ఈఈఎస్‌ఎల్‌ సంస్థ కానీ, సంబంధిత కాంట్రాక్టు సంస్థ కానీ ఎల్‌ఈడీ బల్బుల నిర్వహణ కోసం ఎక్కడా సిబ్బందినే నియమించలేదు. స్థానికంగా ఉండే విద్యుత్‌ సిబ్బందిని కొన్ని మండలాల్లో నియమించినా, డబ్బులు ఇవ్వకపోవడంతో వారు ఎల్‌ఈడీ బల్బుల నిర్వహణను పట్టించుకోవడం లేదు.

నియంత్రణ కరవు
జిల్లా మొత్తం మీద ఎల్‌ఈడీ దీపాలను నియంత్రించేందుకు కమాండ్‌ కంట్రోల్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేస్తామని ప్రారంభ దశలో అధికారులు చెప్పారు. జిల్లా కేంద్రం నుంచి ఇది పని చేస్తుందని పేర్కొన్నారు. కానీ ఇది ఆచరణలో కనిపించిన దాఖలాలు లేవు. కొన్ని గ్రామాల్లో వీధిదీపాలను కంట్రోల్‌ చేసేందుకు టీసీఎంఎస్‌ బాక్సులు ఏర్పాటు చేసినా, దీపాల అమరికల్లో లోపాలుండడంతో అవి సక్రమంగా పని చేయడం లేదు. కొన్ని గ్రామాల్లో వర్షం కురిసేటప్పుడు లైట్లు వెలగడం లేదు. ఇవి ఎప్పుడు వెలుగుతాయో, ఎప్పుడు చీకట్లు అలముకుంటాయో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి.

బాగు చేయించేదెవరో తెలీదు
గ్రామంలోని ప్రధాన వీధులు అంధకారంలో మగ్గుతున్నాయి. రాత్రి సమయంలో వీధుల్లోకి వెళ్లాలంటే భయంగా ఉంది. పాములు, క్రిమి కీటకాల బెడద ఎక్కువగా ఉన్నందున బయటకు రాలేకపోతున్నాం. అసలు ఈ వీధి దీపాలను ఎవరు బాగు చేయిస్తారో కూడా తెలియదు. వెంటనే మరమ్మతులు చేయించి, దీపాలు వెలిగేలా చూడాలి.– బలగం ప్రసన్నకుమార్, మాజీ సర్పంచ్, తూరంగి

కార్యదర్శులు ఫిర్యాదులుచేస్తున్నారు
గ్రామాల్లో ఎల్‌ఈడీలు బల్బులు వెలగని విషయాన్ని పలువురు కార్యదర్శులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని కాంట్రాక్టర్లకు తెలియజేశాం. అన్ని గ్రామాల్లోనూ బల్బులకు మరమ్మతులు చేయించి, సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకుంటాం.– వై.అమ్మాజీ, డీఎల్‌పీవో, కాకినాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement