జాదూగర్‌ బాబు చేశారిలా..

The TDP Government Boasted That Fulfill The Poor Dream - Sakshi

పేదల సొంతింటి కలను ప్రచారానికి వాడుకున్నారు

పనులు పూర్తి కాకుండానే అట్టహాసంగా గృహప్రవేశాలు  

పనుల పూర్తికి మరో మూడు నెలలు అంచనా 

చంద్రబాబు ప్రభుత్వం ప్రచారానికి ఇచ్చినంత ప్రాధాన్యత మరి దేనికీ ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చిన నిధులతో చేపట్టిన ‘అందరికీ ఇళ్లు’ పథకాన్ని కూడా దానికి వాడుకున్నారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పనులు పూర్తికాకపోయినా అట్టహాసంగా ఆ ఇళ్లకు గృహప్రవేశాలు చేయించేశారు. కానీ ఇంతవరకూ వాటికి మౌలిక వసతుల కల్పన జరగలేదు.  

సాక్షి, మండపేట:  ప్రచార ఆర్భాటానికి అధిక ప్రాధాన్యమిచ్చిన టీడీపీ సర్కారు పేదల సొంతింటి కలను తీర్చుతున్నట్టు గొప్పలు చెప్పుకుంది.   పనులు పూర్తికాకుండానే ‘అందరికీ ఇళ్లు’ ప్లాట్లలోకి లబ్ధిదారులతో అట్టహాసంగా గృహప్రవేశాలు చేయించారు.  త్వరలో సొంత ప్లాట్లలోకి వెళ్లిపోతామనుకున్న లబ్ధిదారుల ఆశలపై అసంపూర్తి పనులు నీళ్లు జల్లాయి. పూర్తిస్థాయిలో వసతుల కల్పన పనులు పూర్తయ్యేందుకు మరో మూడు నెలలకు పైగా పట్టవచ్చని అంచనా.

పట్టణ ప్రాంతాల్లో పేదవర్గాల ఇళ్ల నిర్మాణం కోసం 2015–16లో కేంద్ర ప్రభుత్వం ‘అందరికీ ఇళ్లు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకంలో జిల్లాకు 24,332 ప్లాట్లు మంజూరు చేశారు. తొలి విడతగా తుని మినహా మిగిలిన నగర, పురపాలక సంస్థల్లో మొత్తం 19,242 ప్లాట్ల నిర్మాణానికి రూ. 1,457.62 కోట్లు కేంద్రం విడుదల చేసింది. కాకినాడ కార్పొరేషన్‌కు 4,608 ప్లాట్లు, రాజమహేంద్రవరానికి 4,200, పెద్దాపురం మున్సిపాల్టీకి 1,724, సామర్లకోటకు 1,048, రామచంద్రపురానికి 1,088, మండపేటకు 4,064, పిఠాపురానికి 874, అమలాపురానికి 1,636 ప్లాట్లు మంజూరయ్యాయి.

రెండో విడతలో తునికి 5,049 ప్లాట్లు మంజూరు కాగా రాజమహేంద్రవరానికి 3,676, పెద్దాపురానికి 1,672, మండపేటకు 2,212 మంజూరయ్యాయి. 300 చదరపు అడుగులు విస్తీర్ణంలో సింగిల్‌బెడ్‌ రూం, 365 చదరపు అడుగుల్లో సింగిల్‌ బెడ్‌ రూం, 430 చదరపు అడుగుల్లో డబుల్‌ బెడ్‌రూం కేటగిరీల్లో నిర్మాణ పనులు చేపట్టారు. ప్లాట్ల నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయనే విమర్శలున్నాయి. ప్లాట్లలో తాగునీటి అవసరాలకు, గృహావసరాలకు వేర్వేరుగా పైప్‌లైన్లు ఉండాల్సి ఉండగా అన్ని అవసరాలకు ఒకటే పైప్‌లైన్‌ పెట్టారని విమర్శిస్తున్నారు. 

అట్టహాసంగా గృహ ప్రవేశాలు 
అందరికి ఇళ్లు ప్లాట్లలో మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొన్న గత టీడీపీ ప్రభుత్వం పనులు పూర్తి కాకుండానే ఓటర్లకు గేలం వేసేందుకు ఫిబ్రవరి 9న అట్టహాసంగా గృహప్రవేశాలు చేయిం చేసింది.  పలుచోట్ల రోడ్లు, డ్రైన్లు, తాగునీరు, విద్యుత్‌ తదితర వసతుల కల్పన జరగలేదు. దాంతో గృహ ప్రవేశాలు చేసి నాలుగు నెలలవుతున్నా లబ్ధిదారులకు ప్లాట్లు దక్కలేదు.

రాజమహేంద్రవరం కార్పొరేషన్, అమలాపురం, మండపేట, సామర్లకోట, పిఠాపురం తదితర మున్సిపాల్టీల్లో వాటర్‌ ట్యాంకులు నిర్మాణ దశల్లో ఉండగా పైప్‌లైన్‌ పనులు చేయాల్సి ఉంది. అమలాపురంలో సబ్‌స్టేషన్‌ నిర్మాణం ప్రారంభ దశలో ఉంది. రోడ్లు, డ్రైన్లు, విద్యుత్‌ వసతుల కల్పన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆయా పనులు పూర్తయ్యేందుకు మూడు నెలలకు పైగా సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top