‘హోదా’ హైజాక్‌!

TDP failure to fight for AP in No-confidence motion at Parliament - Sakshi

ఎటో వెళ్లిన అవిశ్వాసం.. స్వీయ అజెండాలకే పార్టీలు పరిమితం

రాష్ట్ర విభజన హామీల అమలు ప్రస్తావనే లేదు    

ఆరోపణలు, ప్రత్యారోపణలకే బీజేపీ, కాంగ్రెస్‌ ప్రాధాన్యం   

జాతీయ వ్యవహారాల వైపు మళ్లిన చర్చ

ఏపీ కష్టాలను సభలో ఎలుగెత్తకుండా చతికిలపడ్డ టీడీపీ

సాక్షి, అమరావతి: అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశమే ప్రధాన అంశంగా మారుతుందని రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠతో నిరీక్షించారు. పార్లమెంట్‌ సాక్షిగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని మళ్లీ చట్టసభలోనే సరిదిద్దుతారని ఆశించారు. ఏపీకి జరిగిన నష్టాన్ని దేశం దృష్టికి తెచ్చి న్యాయం జరగాలని కోరుకున్న తెలుగు ప్రజలకు హోదాపై చర్చ జరగకుండా పక్కదారి పట్టడంతో చివరకు తీవ్ర నిరాశే మిగిలింది.  

ఆధిపత్యానికి వేదికగా... 
కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు వాటి ద్వారా ఏపీకి జీవన్మరణ సమస్య లాంటి హోదా అవసరాన్ని కనీసం ప్రస్తావనకు తేవడంలో ఘోరంగా విఫలం కావడంతో అసలు విషయం మరుగున పడింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తన ప్రసంగంలో హోదా అంశానికి ప్రాధాన్యం లేకుండా ఇతర జాతీయ అంశాలు, మోదీపై విమర్శలకే పరిమితమయ్యారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ చివరకు బీజేపీ, కాంగ్రెస్‌ల రాజకీయ విమర్శలు, ఆధిపత్యానికి వేదికగా మారింది.  

చివరకు చేతులెత్తేసి..: విభజన హామీలు అమలుకాకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ భారీగా నష్టపోతున్న వైనంపై విపక్షాల మద్దతు కూడగట్టి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటంలో టీడీపీ పూర్తిగా విఫలమైంది. ఏపీకి జరిగిన అన్యాయంపై లోక్‌సభలో తమ వాణి గట్టిగా వినిపిస్తామని, ప్రధాని మోదీని నిలదీస్తామని, కడిగేస్తామని హడావుడి చేసిన టీడీపీ అసలు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను చర్చకు వచ్చేలా చేయలేక చేతులెత్తేసింది.

రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాధాన్యంతోపాటు ఏపీ దుస్థితిని పార్లమెంటులో ఆవిష్కరించడంలో టీడీపీ విఫలమైంది. అవిశ్వాసంపై చర్చను ప్రారంభించిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ తన ప్రసంగంలో 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదాను ఇవ్వొద్దని చెప్పలేదని, స్వయంగా ఆర్థిక సంఘం సభ్యులే ఈ విషయాన్ని చెప్పారని, దీనిపై కేంద్రం అసత్యాలు చెబుతోందని పేర్కొన్నారు. అయితే ఇదే అంశాలను మూడేళ్ల క్రితమే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలోనే స్పష్టం చేయడం గమనార్హం.  

స్వీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం.. 
అవిశ్వాసంపై రోజంతా చర్చించినా బీజేపీ, కాంగ్రెస్‌ ఆరోపణలు, ప్రత్యారోపణలు, జాతీయ రాజకీయాల చుట్టూనే నడిచింది. ప్రధానిపై రాహుల్‌ వ్యక్తిగత విమర్శలు చేయడం, మోదీ తన ప్రసంగంలో రాహుల్‌ని వెక్కిరించడం, కాంగ్రెస్‌ను తూర్పారబట్టడంపైనే ఎక్కువ సమయం గడిచిపోయింది. మోదీ తన ప్రసంగంలో రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబే యూటర్న్‌ తీసుకున్నారని, ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి బాబే అంగీకరించారని స్పష్టంగా తేల్చి చెప్పారు. ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన చర్చలో బీజేపీ, కాంగ్రెస్‌లు స్వీయ రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వగా మిగిలిన పార్టీలు తమ రాష్ట్ర వ్యవహారాలు, ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపైనే మాట్లాడాయి.

ఏ పార్టీ కూడా చర్చలో విభజన హామీలు, ఏపీకి సంబంధించిన అంశాలను ప్రస్తావించలేదు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ రాజకీయాలు, మోదీ ప్రభుత్వ వైఫల్యాలపైనే ఎక్కువగా మాట్లాడింది. రాహుల్‌గాంధీ ఏపీపై సానుభూతి ఉన్నట్లు ఒక్కమాట చెప్పి మిగిలినవన్నీ తనకు అవసరమైన రాజకీయ అంశాలనే ప్రస్తావించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే కూడా జాతీయ అంశాలే మాట్లాడి చివర్లో కొసమెరుపుగా నాడు ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని సరిపెట్టారు. తృణమూల్‌ కాంగ్రెస్, ఎస్పీ, ఏఐఏడీఎంకే, ఎన్‌సీపీ తదితర పార్టీలేవీ అసలు టీడీపీని పట్టించుకోలేదు. చివరికి సీపీఎంను సైతం ఏపీ గురించి ప్రస్తావించేలా ఒత్తిడి చేయటంలో టీడీపీ విఫలమైంది. 

బృందాలను పంపి లేఖలు రాసినా... 
లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న వారు ఏపీ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించకపోవడం, మద్దతు ఇవ్వకపోవటానికి టీడీపీ వైఫల్యమే కారణమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. అవిశ్వాసంతో చంద్రబాబు ఏమీ సాధించలేకపోగా విభజన హామీలు సభలో కనీసం ప్రస్తావనకు వచ్చేలా విపక్షాల మద్దతు కూడగట్టలేకపోయారు. బీజేపీని వ్యతిరేకిస్తూ విపక్షాలు అవిశ్వాసానికి మద్దతు తెలిపినా ఇతర అంశాలను పట్టించుకోలేదు.

దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగట్టడానికి చంద్రబాబు టీడీపీ ఎంపీలతో బృందాలు ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాలకు పంపినా ఒనగూరింది శూన్యమే. స్వయంగా చంద్రబాబు పలు పార్టీలకు చెందిన నేతలతో మాట్లాడి లేఖలు రాసినా ఏమీ సాధించలేకపోయారు.  చంద్రబాబు సొంత రాజకీయాల కోసమే ఇదంతా చేస్తున్నారనే అభిప్రాయంతోనే విపక్షాలు టీడీపీని పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ సభ్యులు లోక్‌సభలో ఆందోళన పేరుతో హడావుడి చేసినా రక్తి కట్టించలేకపోయారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అవిశ్వాసం సమయంలో టీడీపీ ఎంపీల విన్యాసాలు, వైఫల్యాలపై సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ సాగింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top