
చదువుతో పాటు క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు టీడీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వద్ద బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. బిక్కవోలులో సాగుతున్న పాదయాత్రలో బిక్కవోలుకు చెందిన బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఆయనకు సమ్యలు వివరించారు. గతంలో విద్యతో క్రీడల్లో రాణించిన వారికి స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేవారని, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించి చాలా మంది క్రీడాకారులకు ఉపాధి కల్పించారన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఏ ఒక్క క్రీడాకారుడికి ఉద్యోగాలు రాలేదన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎక్కువుగా ఆర్టీసీ, రైల్వేలో ఉద్యోగవకాశాలు ఉండేవన్నారు. ఆర్టీసీలో పూర్తిగా తీసుకోవడం మానేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం కేవలం ప్రచారానికే తప్ప స్పోర్ట్స్ కోటాలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జగన్‌కు వైవీ శివకుమార్‌రెడ్డి, టి.శశిభూషణం, పి.విజయకుమార్ రెడ్డి, షేక్ సంసిద్, సీహెచ్.కృష్ణ, బి.శేఖర్ తదితరులు విజ్ఞప్తి చేశారు