తెలుగుదేశం పార్టీలో ముసలం..

TDP Ex Ministers Secret Meeting In Kakinada - Sakshi

కాకినాడలో కాపు మాజీ ఎమ్మెల్యేల సమావేశం

బడేటి బుజ్జి, ఈలి నాని, మాధవనాయుడు తోట సీతారామలక్ష్మి పార్టీలో ఉంటారా?

సాక్షి , ఏలూరు : తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ తీర్ధం పుచ్చుకోగా, కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కాకినాడలో రహస్య సమావేశం నిర్వహించడం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలైన కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు 14 మంది కాకినాడలో సమావేశం అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.

ఇందులో జిల్లా నుంచి ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరపరాజయం నేపథ్యంలో వీరు భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. తెలుగుదేశంలో కొనసాగాలా, లేక పార్టీ మారాలా అన్న విషయంపై చర్చ జరిపినట్లు సమాచారం. అందరూ ఒకే నిర్ణయంపై ఏ పార్టీలోనైనా చేరాలని భావిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం వీరు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో చర్చించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని సమాచారం.

తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై కూడా చర్చ జరిగింది. అయితే వారు మాత్రం తాము పార్టీ మారడం లేదని, ఎన్నికల్లో ఓటమి కారణాలపై చర్చించామని చెబుతున్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకుని ఓటమిపై చర్చించడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు రాజ్యసభలో టీడీఎల్పీ బీజేపీలో విలీనం అయ్యింది. ఎంపీ సుజనా చౌదరి నేతత్వంలో టీడీపీ రాజ్యసభ సభ్యులు గురువారం సాయంత్రం టీడీపీ లెజిస్లేటివ్‌ పార్టీనీ బీజేపీలో విలీనం చేస్తూ తీర్మానం లేఖను ఉప రాష్ట్రపతికి అందజేశారు.

ఈ తీర్మానం ప్రతిపై ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రాంమ్మోహన్‌రావు సంతకం చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, పార్టీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. తెలుగుదేశం ఎంపీలతోపాటు సీతా రామలక్ష్మి కూడా బీజేపీలో చేరతారని వార్తలు వెలువడ్డాయి. అయితే చివరి నిముషంలో ఆమె తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుని వెనక్కి తగ్గారు. దీంతో టీడీపీ రాజ్యసభ సభ్యుల్లో ప్రస్తుతానికి సీతా రామలక్ష్మితో పాటు రవీంద్రకుమార్‌ మాత్రమే మిగిలారు. తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు సర్వత్రా చర్చకు దారితీశాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top