టీడీపీ రౌడీయిజం

TDP Assault on YSRCP Activist in Puthalapattu - Sakshi

కట్టకిందపల్లెలో పూతలపట్టు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై టీడీపీ శ్రేణుల దాడి

తీవ్రగాయాలతో చిత్తూరుకు తరలింపు 

మెరుగైన వైద్యం కోసం చిత్తూరు నుంచి మళ్లీ బెంగళూరుకు తరలింపు  

ఐరాల: సార్వత్రిక ఎన్నికల్లో దళితులను ఓట్లు వేయనీయకుండా తామే ఓట్లు వేసుకుంటున్న టీడీపీ నాయకులు ఈ పర్యాయం మరింత రెచ్చిపోయారు. ఏకంగా పూతలపట్టు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థినిని చుట్టుముట్టి దాడికి తెగబడ్డారు. వారి దాడి నుంచి ఎలాగో బైటపడి వెళ్తున్న అభ్యర్థిని మళ్లీ అడ్డగించి పిడిగుద్దుల వర్షం కురిపించారు. తీవ్రగాయాలతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఈ సంఘటన గురువారం మండలంలోని పి.కట్టకిందపల్లె పోలింగ్‌ కేంద్రం వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. పోలింగ్‌ కేంద్రం నంబర్‌ 8లో అగ్రకులాల వారు తమను ఓట్లు వేయనీయడం లేదని దళితవాడ ప్రజలు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్‌ బాబుకు ఫోన్‌లో చెప్పడంతో ఆయన దళితులతో ఆ కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికి సమయం 11.30 గంటలు.

ఎంఎస్‌ బాబు సమస్యపై పోలింగ్‌ అధికారులతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దళితులు ఓటు వేయడానికి వీల్లేదంటూ వాగ్యుద్ధానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈవీఎం ను ధ్వంసం చేశారు. దాదాపు 70మంది టీడీపీకి చెందిన వారు కర్రలు, కమ్మీలతో వారిపై దాడికి తెగబడ్డారు. దీంతో ఎంఎస్‌ బాబు తల, ముఖం, వీపు, ఛాతీ, కాలుకు తీవ్రగాయాలయ్యాయి. దాదాపు 40 నిమిషాల టీడీపీ నేతలు వారిపై రెచ్చిపోయారు. మండల కన్వీనర్‌ పి.చంద్ర శేఖర్‌ రెడ్డి సర్దిచెప్పేందుకు యత్నించినా ఆయనపై సైతం దాడి చేశారు. వారి దాడి నుంచి ఎలాగో బైట పడి కారులో బాబు వెళ్తుండగా అరకిలోమీటరు దూరంలోనే ఎదురుగా వాహనాలలో వచ్చి టీడీపీ నాయకులు మరోసారి అడ్డుకున్నారు. కారు వెళ్లనీయకుండా రాళ్లు అడ్డుపెట్టి, మళ్లీ దాడి చేశారు.

రాళ్లతో కారు అద్దాలను రాళ్లతో పగులగొట్టారు. అభ్యర్థి బాబు, ఆయన కుమారుడు ప్రవీణ్‌ను వెంటాడి మరీ ఇష్టానుసారంగా కొట్టారు. బాబు వద్ద రూ.40వేల విలువ చేసే సెల్‌ఫోన్‌ను సైతం లాక్కున్నారు. గన్‌మెన్‌ వారిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. స్థానిక వైఎస్సార్‌ పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని గాయపడిన బాబును మరో వాహనంలో ఐరాల ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాబుపై దాడి ఘటనను నిరసిస్తూ చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వద్ద వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆందోళన చేశారు.

సాక్షి రిపోర్టర్‌గా భావించి... 

కట్టకిందపల్లె వద్ద టీడీపీ నేతల దాడి ఘటనను చిత్రీకరించేందుకు యత్నించిన ఓ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధిని సైతం టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. నువ్వు సాక్షి విలేకరివా? అంటూ అతని కడుపులో తన్నారు. ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. 

పోలీసుల వైఫల్యం

పోలింగ్‌ కేంద్రం వద్ద బాబుపై టీడీపీ నాయకులు దాడి చేశారని ఎన్నోసార్లు ఎస్‌ఐ ప్రసాద్‌రావుకు ఫిర్యాదు చేసినా సకాలంలో ఆయన రాలేదని  గ్రామస్తులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన ప్రాంతం పోలీస్‌ స్టేషన్‌కు పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా 2.15 గంటల సమయంలో ఎస్‌ఐ రావడం విమర్శలకు తావిచ్చింది. అప్పటికే బాబును చిత్తూరుకు తరలించారు.

నియోజకవర్గ ఎన్నికల అధికారిపై దాడి 

జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పి.కట్టకిందపల్లె పోలింగ్‌ కేంద్రానికి వెళుతున్న నియోజకవర్గ ఎన్నికల అధికారి రవీంద్రను మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. వాహనం అద్దాలు పగుల కొట్టారు. వీటిని చిత్రీకరిస్తున్న వీడియో గ్రాఫర్‌ నుంచి కెమెరా లాక్కొని వాటిని మూడు ముక్కలు చేశారు.

కలెక్టర్‌కు ముందే ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం

కట్టకిందపల్లె పోలింగ్‌ బూత్‌లో గత ఎన్నికల్లో అగ్రకులాల వారు తమను ఓటు వేయనీయడం లేదని నెల్లిమందపల్లె దళితవాడకు చెందిన పలువురు జిల్లా కలెక్టర్‌ ప్రద్యుమ్న్యకు గత నెలలో ఫిర్యాదు చేశారు. అధికారులు సైతం ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఎవరైనా దళితులకు అవరోధాలు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, ఎన్నికల వేళకు సీన్‌ మారిపోయింది. అధికారులు ఏ చర్యలూ తీసుకోకపోవడంతో ప్రజాస్వామ్యాన్ని టీడీపీ నేతలు కాలరాచారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top