సిల్వర్‌ జూబ్లీ వేడుకలకు సన్నద్ధం

Swims ready for silver jubilee  - Sakshi

నేడు స్విమ్స్‌ 25వ వార్షికోత్సవం    

వేదిక మహతీ కళాక్షేత్రం

హాజరుకానున్న పలువురు మంత్రులు

నిరుపేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే మహోన్నత లక్ష్యంతో 1986లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌) ఏర్పాటుకు పునాది రాళ్లు వేశారు. 1995 నుంచి స్విమ్స్‌ ఆస్పత్రి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో సిల్వర్‌ జూబ్లీ వేడుకులకు సిద్ధమైంది. మహతీ వేదికగా సోమవారం సాయంత్రం 5.15 గంటలకు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.

తిరుపతి (అలిపిరి): 2001లో ప్రాణదానం ట్రస్టు ద్వారా నిరుపేదలకు ఉచిత శస్త్ర చికిత్స సేవలను టీటీడీ  అందుబాటులోకి తెచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రారంభించడంతో స్విమ్స్‌లో నిరుపేదలకు ఉచిత సూపర్‌ స్పెషాలిటీæ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ 38 విభాగాల్లో 500 మంది వైద్యులు రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. నిత్యం 1500 నుంచి 2 వేల మందికి పైగా ఓపీ సేవలు పొందుతున్నారు. 898 పడకలతో పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తోంది. 

విద్యా నిలయం..
స్విమ్స్‌లో యూజీ, పీజీ మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో 1,765 మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ సంఖ్య రాబోయే రెండేళ్లలో 2 వేలకు పెరిగే అవకాశం ఉంది. యూనివర్సిటీలో 2,218 మంది సిబ్బంది సేవలందిస్తున్నారు. ప్రతి ఏటా 540 మంది 66 కోర్సుల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. 2014లో స్విమ్స్‌ ఆధ్వర్యంలో 150 ఎంబీబీఎస్‌ సీట్లతో శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రారంభమైంది. 

హాజరుకానున్న ప్రముఖులు: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top