గోవును పూజించి.. గోవిందుని దర్శించండి

Swaroopanandendra Saraswati Swamy Visit Thirumala - Sakshi

విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి

తిరుపతి సెంట్రల్‌/తిరుమల: గోవులను పూజించిన తరువాత తిరుమలలో గోవిందుడిని దర్శించుకోవడం ఎంతో ఉత్తమమైనదని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. తిరుపతి అలిపిరి వద్ద నిర్మాణంలో ఉన్న సప్తగోప్రదక్షిణశాలను, గోవిజ్ఞాన కేంద్రం, గోతులాభారం, గోసదన్‌ను గురువారం సాయంత్రం ఆయన శారదపీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో కలిసి సందర్శించారు. గోప్రదక్షిణశాలలో గోపాలకృష్ణుని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలకు వాహనాల్లో వెళ్లేవారు కానీ, నడిచి వెళ్లే భక్తులు గానీ అలిపిరి వద్ద గోపూజ చేసుకునేందుకు వీలుగా టీటీడీ సప్తగోప్రదక్షిణశాల నిర్మించడం అభినందనీయమన్నారు. నిర్మాణపనులకు విరాళాలు అందించిన టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులు శేఖర్‌ రెడ్డికి స్వామివారి ఆశీస్సులు ఉంటాయన్నారు. 

శ్రీ స్వరూపానందేంద్రస్వామిని కలిసిన టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

స్వామీజీని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్‌
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గోగర్భం సమీపంలోని శారదా పీఠానికి చేరుకుని స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రబద్ధంగా కైంకర్యాలు జరుగుతున్నాయని, ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయమై ఆగమ సలహాదారులు, ఆలయ ప్రధానార్చకులతో కలిసి శ్రీ స్వరూపానందేంద్రస్వామివారిని సంప్రదించామని తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా రెండు రోజుల పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top