‘స్వచ్ఛ’మే లక్ష్యం! | swachha Hyderabad' to the collective effort | Sakshi
Sakshi News home page

‘స్వచ్ఛ’మే లక్ష్యం!

Jul 4 2015 12:08 AM | Updated on Sep 3 2017 4:49 AM

‘స్వచ్ఛ హైదరాబాద్’లో అందిన వినతుల పరిష్కారం వైపు అడుగులు పడుతున్నాయి. దీనికోసం జీహెచ్‌ఎంసీ రూ.195.91 కోట్లు విడుదల చేసింది.

రూ.195.91 కోట్లు మంజూరు
త్వరలో పనులు ప్రారంభం
నాలాలు.. మంచినీళ్లు, రహదారులకు ప్రాధాన్యం
వినతుల్లో వీటిదే అగ్రస్థానం

 
సిటీబ్యూరో: ‘స్వచ్ఛ హైదరాబాద్’లో అందిన వినతుల పరిష్కారం వైపు అడుగులు పడుతున్నాయి. దీనికోసం జీహెచ్‌ఎంసీ రూ.195.91 కోట్లు విడుదల చేసింది. రెండు విడతల్లో అందిన విజ్ఞప్తుల మేరకు నాలాలు.. మంచినీళ్లు.. రహదారులు, డ్రైనేజీలే నగరంలోని ప్రధాన సమస్యలని స్పష్టమైంది. ప్రాధాన్య క్రమంలో ఈ పనులు చేపట్టేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రేటర్‌ను 400 యూనిట్లుగా విభజించి... ఒక్కో యూనిట్‌కు రూ.50 లక్షల వంతున రూ.200 కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రూ.195.91 కోట్లు విడుదల చేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనాపరమైన అనుమతి మంజూరు చేశారు. స్థానిక అవసరాలపై అందిన విజ్ఞప్తుల మేరకు మొత్తం 8,303 పనులు చేయాల్సి ఉంటుందని మెంటర్లు, నోడల్ అధికారులు గుర్తించారు. దీనికి రూ. 718.10 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రాధాన్య క్రమంలో 5,071 పనులను ఎంపిక చేశారు. వీటికి రూ.195.91 కోట్లు మంజూరు చేశారు. వీటిలో సీసీ రోడ్లకు రూ.46.41 కోట్లు, నాలాలకు రూ.21.90 కోట్లు, డ్రైనేజీ పనులకు రూ.38.35 కోట్లు, మంచినీటి సరఫరాకు రూ.23.19 కోట్లు కేటాయించారు. ఈ పనులను వెంటనే చేపట్టాల్సిందిగా ఇంజినీర్లను ఆదేశించారు. మూడు రోజుల్లో స్వల్పకాలిక టెండర్లు పిలిచి, త్వరగా పనులు చేపట్టాలన్నారు. ఈమేరకు బడ్జెట్ ఎంట్రీలు చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఈ పనుల పురోగతిని ప్రతి సోమవారం నిర్ణీత ప్రొఫార్మాలో నివేదించాలని కమిషనర్ సూచించారు.
 
 అదే సెంటిమెంట్
 సీఎం కేసీఆర్ లక్కీ నెంబర్ 6ను శుభసూచకంగా భావించే జీహెచ్‌ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ స్వచ్చ హైదరాబాద్ పనులకు నిధుల విడుదలలోనూ దీన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. రూ.195 కోట్లకు (అదనపు మొత్తాన్ని మినహాయిస్తే)పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేశారు. 195లోని అంకెలన్నింటినీ కలిపితే 6 అవుతోంది. డ్రైవర్ కమ్ ఓనర్  వాహనాలు, జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌లోనూ అంకెల మొత్తం 6 కావడం తెలిసిందే.
 
 స్వచ్ఛ హైదరాబాద్‌లోనూ సంపన్నులకే?

 స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా మంజూరైన నిధుల్లోనూ సంపన్నులు గల బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలున్న సర్కిల్-10 (ఖైరతాబాద్)కే ఎక్కువ కేటాయించారు. ఈ ప్రాంతానికి రూ.24.48 కోట్లు మంజూరు చేశారు. నిధుల మంజూరులో ఇదే అగ్రస్థానంలో ఉంది. తర్వాతి రెండు స్థానాల్లో సర్కిల్-4 (చార్మినార్) రూ.18.47 కోట్లు, తార్నాక (రూ.17 కోట్లు) ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement