
ఎండలు మండే
సాక్షి, విశాఖపట్నం: జిల్లా వాసులు సోమవారం నరకం చూశారు. వడగాడ్పులకు ఐదుగురు మృతి చెందారు. ఉదయం నుంచే వేడి గాలులు వీచాయి.
- నరకం చూసిన జిల్లా వాసులు
- ఎండ, వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి
- సాయంత్రం వరకు ఇదే పరిస్థితి
- వడగాడ్పులకు ఐదుగురు మృతి
సాక్షి, విశాఖపట్నం: జిల్లా వాసులు సోమవారం నరకం చూశారు. వడగాడ్పులకు ఐదుగురు మృతి చెందారు. ఉదయం నుంచే వేడి గాలులు వీచాయి. పిల్లలు, వృద్ధులు రోడ్డుపైకి రావడానికి సాహసించలేకపోయారు. ఆదివారం 33.4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, సోమవారం ఏకంగా 41.4 డిగ్రీలుగా నమోదయింది.
ఒక్క రోజు వ్యవధిలోనే 8 డిగ్రీలు పెరగడంతో ప్రజలు అల్లాడిపోయారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం కూడా 12 డిగ్రీలకుపైనే ఉంది. మరోవైపు వాతావరణంలో తేమ శాతం కూడా 51-70 శాతం మధ్యే ఉండడంతో తీవ్ర ఉక్కపోత నెలకొంది. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించేదాకా ఇవే పరిస్థితులు కొనసాగాయి. జిల్లాలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.
భారీ ఉష్ణోగ్రతల వల్ల క్యూములోనింబస్ మేఘాలేర్పడి సాయంత్రానికి వర్షాలు పడుతాయనుకుంటే.. ఆ పరిస్థితీ కానరాలేదు. దీంతో జనాలు మండుటెండలతో ‘మండే’ గడపాల్సి వచ్చింది. పశ్చిమ, పశ్చిమ వాయువ్య దిశ నుంచి వచ్చే వేడి గాలుల వల్లే సోమవారం ఈ పరిస్థితులేర్పడినట్టు వాతావరణ నిపుణులు వెల్లడించారు. మంగళవారానికి ఈ పరిస్థితులుండే అవకాశాలు తక్కువేనని చెప్తున్నారు.