ఈ సమ్మర్‌ సలసల!

This summer will be huge sunny intensity - Sakshi

గత ఏడాదికంటే పెరగనున్న ఎండల తీవ్రత

విజృంభించనున్న వడగాడ్పులు

ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరే అవకాశం

ఎల్‌నినో పరిస్థితులూ కారణం  

సాక్షి, విశాఖపట్నం:  భానుడు ఈ ఏడాది సెగలు కక్కనున్నాడు. మార్చి ఆఖరు నుంచి మొదలు కావలసిన ఎండలు ఫిబ్రవరి మూడో వారం నుంచే ప్రతాపం చూపడం మున్ముందు వేసవి తాపాన్ని తెలియజేస్తోంది. వాస్తవానికి మార్చి ఆఖరు నుంచి రాష్ట్రంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ అనూహ్యంగా నెల రోజుల ముందే ఆ పరిస్థితి (సాధారణంకంటే 4–5 డిగ్రీలు ఎక్కువగా) మొదలైంది. ఉత్తర భారతదేశంలో ఉష్ణ ప్రభావం మన రాష్ట్రంపై చూపుతుంది. ఈ సీజనులో కోస్తాంధ్రలో సాధారణకంటే సగటున ఒక డిగ్రీ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతుందని ఐఎండీ తాజాగా అంచనా వేసింది. ఇదేమీ తేలిగ్గా తీసుకోవలసిన అంశం కాదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ఐఎండీ అంచనా వేసింది. అటు నుంచి వీచే ఉత్తర గాలుల వల్లే రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణం కానున్నాయి. గత సంవత్సరం నైరుతి రుతుపవనాలు కేరళ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో అంతగా ప్రభావం చూపలేదు. ఈశాన్య రుతుపవనాలు కూడా మరింతగా దెబ్బతీయడంతో అరకొర వానలే కురిశాయి. ఫలితంగా భూమి నుంచి ఆవిరి రూపంలో తాపం పెరగడానికి దోహదపడనుంది. మరోవైపు పసిఫిక్‌ మహా సముద్రంలో ఎల్‌నినోకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ వెరసి ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడతాయని విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం మాజీ అధిపతి ఓఎస్‌ఆర్‌యూ భానుకుమార్‌ ‘సాక్షి’కి చెప్పారు. ఈ సంవత్సరం ఎండలతో పాటు వడగాడ్పుల తీవ్రత కూడా అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ రిటైర్డ్‌ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top