హెచ్చరికో హెచ్చరిక

Summer Heat Warning in West Godavari - Sakshi

రానున్న రెండు రోజుల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు

అత్యవసర ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్‌ మిశ్రా

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ జర జాగ్రత్త

జిల్లాలో 3,309 చలివేంద్రాలు ఏర్పాటు  

ఇప్పటివరకు వడగాడ్పులకు మృతి చెందింది ముగ్గురే

ఓ వైపు ఉదయభానుడి ఉగ్రరూపం క్రమేపీ పెరుగుతోంది...ఇంకో వైపు వడదెబ్బలకు గురై పలువురు చనిపోతూనే ఉన్నారు. అధికారుల ప్రకటనలు పత్రికలకే పరిమితమై క్షేత్రస్థాయిలో ఉపశమన చర్యలేవీ కనిపించకపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. చలివేంద్రాలు ఏర్పాటు చేసి  చల్లని మజ్జిగ దేవుడెరుగు ... కనీసం తాగునీరు కూడా అందివ్వని దుస్థితి నెలకొంది. దీంతో ప్రధాన పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా రహదారులునిర్మానుష్యంగా మారిపోతున్నాయి.

కాకినాడ సిటీ: జిల్లాలో రానున్న రెండు రోజుల్లో వేసవి ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీలు నమోదు కావచ్చని వెలువడిన వాతావరణ హెచ్చరిక దృష్ట్యా ప్రజలు వడదెబ్బ, ఆరోగ్య సమస్యలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా విజ్ఞప్తి చేశారు. ఆయన శుక్రవారం రాత్రి అత్యవసర ప్రకటన జారీ చేస్తూ ఇస్రో, యూరోపియన్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ సంస్థలు తెలిపిన వాతావరణ సూచనల ప్రకారం ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఉభయ గోదావరి జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగా ఎదురయ్యే ఎండ తీవ్రత, వడగాడ్పుల వల్ల ఆరోగ్య సమస్యలు, వడదెబ్బ సోకకుండా జిల్లా ప్రజలందరూ తగు జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ కార్తికేయమిశ్రా కోరారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఆరుబయట ఎండలో సంచరించవద్దని, తప్పని సరైతే ఎండ ముదిరేలోపు పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు, టోపీ, తలపాగా తదితరాలను ఉపయోగించాలని, నలుపు రంగు మందంగా ఉండే దుస్తులకు బదులు లేత రంగుల్లో, తేలికైన నూలు వస్త్రాలను ధరించాలని కోరారు. మద్యం సేవించరాదని, ఆహారంలో మాంసాహారాన్ని తగ్గించి, తేలికగా అరుగుదలకు వచ్చే ఆకుకూరలు తినాలని విజ్ఞప్తి చేశారు. ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలన్నారు. తరచుగా పరిశుభ్రమైన నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ధ్రువ పదార్ధాలను ఎక్కువగా తీసుకోవాలని వివరించారు. ఎవరైనా వడదెబ్బకు గురైతే సత్వరం చల్లని నీడ, గాలి తగిలే ప్రదేశానికి చేర్చి తడిగుడ్డతో శరీరాన్ని తుడవాలని, ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజు ద్రావణం, లేదా ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగించాలని సూచించారు. వడదెబ్బ తగిలి అపస్మారక స్ధితిలో ఉన్న రోగికి నీరు తాగించవద్దని, చికిత్స కోసం వీలైనంత త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలన్నారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాలన్నారు. 

వడదెబ్బకులోను కాకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై కరపత్రాలను జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇప్పటి వరకు 3,309 చలివేంద్రాలను ఏర్పాటు చేసి చల్లని తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ద్వారా 1424, ఎన్‌జీవోల ద్వారా 462, రెవెన్యూ శాఖ ద్వారా 219, డీఆర్‌డీఏ ద్వారా 191, ఆరోగ్యశాఖ ద్వారా 1013 చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అత్యవసర మందులు, సిబ్బందిని సిద్ధంగా ఉంచామని, ఆసుపత్రులు, అంగన్‌వాడీ, ఆశా, కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది ద్వారా ఇప్పటి వరకూ సుమారు 6 లక్షల ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ప్రజలకు పంపిణీ చేసినట్లు వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల వేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు బదులు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకూ కొనసాగించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులు కూడా 11 గంటలలోపే ముగించాలన్నారు. ఆ ప్రదేశాల్లో తాగునీరు, మజ్జిగ పంపిణీ, షెల్టర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.

వడదెబ్బ మరణాలుమూడే నమోదు
జిల్లాలో ప్రస్తుత వేసవిలో ఇప్పటి వరకు వడదెబ్బ కారణంగా మూడు మరణాలు నమోదయ్యాయన్నారు. వడగాడ్పుల కారణంగా మరణించిన వ్యక్తుల కుటుంబాలకు జీవో 75 ప్రకారం తహసీల్దార్, వైద్యాధికారి, సబ్‌ ఇన్‌స్పెక్టర్లతో కూడిన త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రూ.లక్ష మంజూరు చేయనున్నట్టు కలెక్టర్‌ వివరించారు. దీనికి వయోపరిమితి ఏమీ లేదన్నారు. దురదృష్టవశాత్తు ఎవరైనా వడగాడ్పులతో మరణిస్తే ముందు ఆరోగ్యశాఖ మెడికల్‌ అధికారికి తెలియజేయాలన్నారు. శవ పరీక్ష, త్రిసభ్య కమిటీ ధ్రువీకరణ అనంతరం అంత్యక్రియలు నిర్వహించాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top