సబ్ ‘ప్లాన్’ లేదు | sub plan not thier | Sakshi
Sakshi News home page

సబ్ ‘ప్లాన్’ లేదు

Jan 31 2014 2:09 AM | Updated on Sep 2 2017 3:11 AM

జిల్లాలో సబ్ ప్లాన్ పనులకు గ్రహణం పట్టింది. ఎస్సీ సబ్ ప్లాన్ (ఎస్‌సీపీ), ట్రైబల్ సబ్ ప్లాన్(టీఎస్‌పీ) నిధులతో ఎస్సీ,ఎస్టీ ఆవాసాలలో సిమెంట్, లింక్‌రోడ్లు, డ్రైనేజీ పనులకోసం పంచాయతీరాజ్‌శాఖ గత ఏడాది మే నెలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపింది.

సాక్షి,కడప: జిల్లాలో సబ్ ప్లాన్ పనులకు గ్రహణం పట్టింది. ఎస్సీ సబ్ ప్లాన్ (ఎస్‌సీపీ), ట్రైబల్ సబ్ ప్లాన్(టీఎస్‌పీ) నిధులతో ఎస్సీ,ఎస్టీ ఆవాసాలలో సిమెంట్, లింక్‌రోడ్లు, డ్రైనేజీ పనులకోసం పంచాయతీరాజ్‌శాఖ గత ఏడాది మే నెలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపింది. 40 శాతం కంటే ఎక్కువ ఎస్సీ, ఎస్టీ జనాభా కలిగిన కాలనీల ప్రాతిపదికతో అంచనాలను సిద్ధం చేశారు.
 
 ఇందులో భాగంగా ఎస్‌సీపీ కింద 1299 హ్యాబిటేషన్లల్లో రూ. 176.90 కోట్లు ,టీఎస్‌పీ ద్వారా 275 ఆవాసాల్లో రూ. 32 కోట్లతో పనుల జాబితాను రూపొందించి గత ఏడాది మే నెలలో ప్రభుత్వానికి నివేదించారు. ఈ ప్రతిపాదనలు అటకెక్కించి మళ్లీ  అధిక ఎస్సీ,ఎస్టీ జనాభా కలిగిన గ్రామాలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేసి పనుల జాబితాను పంపాలని జూన్‌లో ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు  ఎస్‌సీపీ  నిధుల కింద బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాలను ఎంపిక చేశారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో అధికంగా ఎస్సీలున్నప్పటికి ప్రభుత్వం వివక్ష చూపింది.
 
 అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో దాన్ని పక్కనపెట్టి బద్వేలు నియోజకవర్గాన్ని ఎంపిక చేయడం గమనార్హం. బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాలలోని ఎస్సీ కాలనీల్లో రూ.7.82 కోట్లతో, జిల్లాలో అధిక జనాభా గల ఎస్టీ ఆవాసాల్లో రూ. 1.98 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధంచేసి అప్పట్లోనే ప్రభుత్వానికి పంపారు. అయితే  ఇంత వరకు వీటి గురించి  ప్రభుత్వం  ఏర్పాటు చేసిన నోడల్ ఏజెన్సీ పట్టించుకోలేదు. ఫిబ్రవరి చివరిలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ లోపు వీటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని నిధులు మంజూరు చేయకపోతే సబ్ ప్లాన్ నిధులతో ప్రతిపాదించిన పనులకు గ్రహణం పట్టనుంది.
 
 బద్వేలు నియోజక వర్గానికి ప్రాధాన్యం
 బద్వేలు, మైదుకూరు నియోజక వర్గాలలోని ఆవాసాల్లో అధిక జనాభాను దృష్టిలో ఉంచుకొని మొత్తం 22 పనులను రూ. 7.84 కోట్లతో ప్రతిపాదించారు. ఇందులో అధిక శాతం ఎస్ వెంకటాపురంలో రూ. 1.14 కోట్లు, పెద్దులపల్లె రూ.35 లక్షలు, కవలకుంట్ల రూ. 30 లక్షలు, పుల్లారెడ్డిపల్లె రూ. 35 లక్షలు, కుంభగిరి రూ. 47.76 లక్షలు, వరికుంట్ల రూ.33.60 లక్షలు, రెడ్డిపల్లె రూ.33 లక్షలు, ఎస్ రామాపురం రూ.2.17 కోట్లు .. ఇలా బద్వేలు నియోజకవర్గంలోని అన్ని ముఖ్యమైన ప్రతిపాదనలతో కలిపి రూ. 7.17 కోట్లు ఉన్నాయి. మెదుకూరు నియోజకవర్గంలో రూ. 66.60 లక్షల నిధుల్లో అధికంగా బి.మఠం మడలంలోని గుండాపురంలో రూ. 50 లక్షలతో ప్రతిపాదనలు పంపారు.
 
 టీఎస్‌పీ నిధులకు సంబంధించి..
 రైల్వేకోడూరు నియోజకవర్గంలోని గంగరాజుపోడు ఎస్టీ కాలనీలో రూ. 61.28 లక్షలు, కడప డివిజన్‌లో పెద్దబిడికి రూ. 30 లక్షలు, గాలివీడు మండలంలోని పందికుంట రూ. 12.50 లక్షలు, మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె సుగాలితాండా రూ. 5.75 లక్షలు, ఖాజీపేట మండలంలోని సుగాలితాండ రూ. 7లక్షలు, మైలవరం మండలంలో  కోన- అనంతపురం రోడ్డు నిర్మాణానికి రూ. 50 లక్షలు, బి.మఠం ఎస్టీ హాస్టల్ వద్ద సీసీ రోడ్డు కోసం రూ. 10 లక్షలు, సుండుపల్లె ఎస్టీ హాస్టల్ వద్ద రూ. 7.50 లక్షలు, మినీ గురుకులం మంగంపేట వద్ద రూ. 8.30 లక్షలు, పులివెందుల నగరి గుట్ట వద్ద రూ. 6 లక్షలు, ప్రొద్దుటూరు మండలం గోపవరం ఎస్టీ హాస్టల్ వద్ద రూ. 1.45 లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని ప్రతిపాదించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోపు నిధులు మంజూరు కాకపోతే ఈ పనుల ప్రతిపాదనలు అటకెక్కినట్లే.
 
 ప్రతిపాదనలు పంపాం
 సబ్‌ప్లాన్ నిధులకు సంబంధించి ఇప్పటికే రెండుమార్లు ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ ఏజెన్సీ నిధులు మంజూరు చేయాల్సి ఉంది.
 - జగత్‌కుమార్, పీఆర్ ఎస్‌ఈ, కడప
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement