సంక్షామం

students suffering in Welfare hostels - Sakshi

సంక్షేమ హాస్టళ్లలో సమస్యల దరువు

చలికి వణుకుతున్న విద్యార్థులు

వాకిళ్లకు తలుపులు, కిటికీలకు రెక్కలు కరువు

చలిగాలి రాకుండా అడ్డుగా గోనెసంచులు, దుప్పట్లు

అయినా తప్పని తిప్పలు

తిరగని ఫ్యాన్లు, చిమ్మచీకట్లో పరిసరాలు దోమల స్వైరవిహారం

సంక్షేమ వసతిగృహాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. అపరిశుభ్ర వాతావరణం, ఇరుకు గదులు, సరైన తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలు లేకపోవడం తదితర సమస్యలతో విద్యార్థులు అవస్థ పడుతున్నారు. హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపర్చడంపై ప్రభుత్వం ఏమాత్రమూ శ్రద్ధ చూపడం లేదు. వాటి నిర్వహణను అధికారులు గాలికొదిలేశారు. దీంతో సిబ్బంది ‘ఆడిందే ఆట..పాడిందే పాట’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. ప్రస్తుతం చలితీవ్రతకు విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. వారి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముంది. అయినా ఎవరూ వారి
బాగోగుల గురించి పట్టించుకోవడం లేదు.

జిల్లా కేంద్రంలోని జాయింట్‌ కలెక్టర్‌ నివాసానికి కూతవేటు దూరంలో బీసీ, డీఎన్‌టీ (నిమ్నజాతుల) వసతి గృహాలు ఉన్నాయి. వీటిని స్థానిక బీ క్యాంప్‌లోని ఆర్‌అండ్‌బీ క్వార్టర్లలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. దీంతో విద్యార్థుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వర్షాకాలం, చలి కాలంలో ఇబ్బందులు రెట్టింపవుతున్నాయి. గదులకు తలుపులు ఉంటే కిటికీలు లేవు.. కిటికీలుంటే తలుపులు లేవు. పలు గదుల కిటికీలకు రెక్కలు లేకపోవడంతో చలిగాలి లోపలికి ప్రవేశిస్తోంది. గోనెసంచులు, దుప్పట్లు అడ్డం పెడుతున్నా..ప్రయోజనం ఉండడం లేదు. కార్పెట్లు, బెడ్‌షీట్లు సరఫరా చేసినా.. గదులు సక్రమంగా లేకపోవడంతో నిద్ర కరువవుతోందని విద్యార్థులు వాపోతున్నారు. జిల్లాలోని చాలా హాస్టళ్లలో దాదాపు ఇవే పరిస్థితులు ఉన్నాయి.

కర్నూలు(అర్బన్‌): జిల్లా వ్యాప్తంగా మొత్తం 175 వసతిగృహాలు (కళాశాల హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు కలిపి) ఉన్నాయి. వీటిలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 75, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 78, గిరిజన సంక్షేమ శాఖ కింద 22 నడుస్తున్నాయి. అద్దె భవనాల సంగతి దేవుడెరుగు కానీ.. సొంత భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాల్లోనూ కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఇరుకు గదుల్లో ఉండటానికి విద్యార్థులు అవస్థ పడుతున్నారు. తిరగని ఫ్యాన్లు, తలుపులు లేని వాకిళ్లు, రెక్కలు లేని కిటికీలు దర్శనమిస్తున్నాయి. సరైన విద్యుత్, తాగునీటి సౌకర్యం కూడా లేదు. అనేక హాస్టళ్లలో విద్యార్థులు దోమలతో సావాసం చేస్తూ అనారోగ్యాలకు గురవుతున్నారు. కిటికీలకు మెష్‌ కూడా లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణం కారణంగా దోమలు విపరీతంగా వస్తున్నాయి. వీటి వల్ల అనేక మంది విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. పలుచోట్ల డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేదు. మురికినీరు హాస్టల్‌ ప్రాంగణంలోనే నిల్వ ఉంటోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్లు లేని చోట బహిర్భూమికి వెళ్తున్నారు. కొన్నిచోట్ల టాయిలెట్లు ఉన్నా, నీటి సమస్యతో నిరుపయోగంగా మారాయి.

దోమతెరల ఊసే లేదు  
హాస్టల్‌ విద్యార్థులకు ప్రతియేటా ఒక కార్పెట్, ఒక బెడ్‌షీట్‌ చొప్పున ఇస్తున్నారు. అయితే.. దోమతెరల ప్రతిపాదన ఏదీ లేదు. ఎవరైనా దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి అందించాల్సి ఉంది. కిటికీలకు మెష్‌ల విషయంలోనూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ప్రతిపాదనలకు మోక్షమేదీ?
బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యాన 27 వసతి గృహాల్లో మరమ్మతుల కోసం రూ. 3,41,40,000 అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే 51 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులకు రూ.2,27,35,000 అవసరమని ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రతిపాదనలు పంపించారు. ఇంతవరకు ఎలాంటి నిధులు విడుదల కాలేదు. అలాగే గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆలూరు, ఆళ్లగడ్డ, పాలెంచెరువు ఆశ్రమ, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పలు మరమ్మతులు చేపట్టేందుకు రూ.2.50 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే.. ఆలూరు, ఆళ్లగడ్డలో కొత్తగా రెసిడెన్షియల్‌ పాఠశాలల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6.50 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు సమాచారం.  పాలనా అనుమతులు మాత్రం ఇంతవరకు లభించలేదు. 

మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు
జిల్లాలోని బీసీ వసతిగృహాల్లో పలు మరమ్మతులు చేపట్టేందుకు చర్యలు చేపట్టాం. గత ఏడాది పంపిన ప్రతిపాదనలకు సంబంధించి రూ.69 లక్షలు విడుదల కాగా,  ఈ నిధులతో ఇంగల్‌దహాల్, కోడుమూరు బాలికలు, కళాశాల వసతి గృహాల్లో పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది 27 వసతిగృహాల్లో పలు పనులు చేపట్టేందుకు రూ.3.41 కోట్లతో ప్రతిపాదనలు పంపాం. నిధులు విడుదలైన వెంటనే కిటికీలకు రెక్కలు, మెష్, వాకిళ్లకు తలుపులు ఏర్పాటు చేసేందుకు ప్రాధాన్యత  ఇస్తాం. –బి.సంజీవరాజు, జిల్లా బీసీ సంక్షేమాధికారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top