చలించరా ?

students suffering in Welfare hostels - Sakshi

సమస్యలకు నిలయాలుగా సంక్షేమ హాస్టళ్లు

దుప్పట్లు లేక రాత్రి వేళ చలికి వణికిపోతున్న విద్యార్థులు

పగిలిన తలుపులు, కిటికీలు

విపరీతమైన దోమల బెడదతో అవస్థలు

మరుగుదొడ్లు లేక నిత్యం విద్యార్థినుల అవస్థలు

అమ్మగోరుముద్దలు, నాన్న మురిపాల ముద్దులతో ఆనందంగా కేరింతలు కొట్టాల్సిన విద్యార్థులు చదువుల చట్రంలో, హాస్టళ్ల బందిఖానాలో నలిగిపోతున్నారు. అధికారులను అడిగినా, పాలకులను కదిలించినా ఒకటే సమాధానం.. ప్రభుత్వ హాస్టళ్లలో అన్ని వసతులు కల్పిస్తున్నాం. ఇది నిజమేనా అని జిల్లా వ్యాప్తంగా  సాక్షి గురువారం రాత్రి తొమ్మిది గంటలకు హాస్టళ్లను విజిట్‌ చేసింది. అక్కడ సరైన దుప్పట్లు లేక, చలికి తాళలేక చిన్నారులు మూడంకె వేసి పడుకున్నారు. వసతి గృహాలకు రక్షణ గోడలు లేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సరిపడా మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత, రాత్రి కాపలా ఇలా ఏ ఒక్క వసతీ కన్ను పొడిచినా కనిపించ లేదు. ఈ సమస్యలు రోజూ చూస్తున్న అధికారులు ఇప్పటికైనా ‘చలి’స్తారా ?.

సాక్షి, అమరావతి బ్యూరో/ కొరిటెపాడు: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. అద్దె భవనాలు, ఇరుకు గదుల్లో తలదాచుకుంటున్నారు. తలుపులు, కిటికీలు పగిలిపోవడంతో రాత్రి వేళ చలికి గజగజ వణికిపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన చాలీచాలని దుప్పట్లు చలి నుంచి విద్యార్థులను కాపాడలేకపోతున్నాయి. ఇరుకు గదులు కావడంతో పడుకునేందుకు స్థలం సరిపోక అల్లాడుతున్నారు.. తలుపులు, కిటికీలకు మెస్‌లు లేకపోవడంతో దోమల్లో విలవిలలాడుతున్నారు. కొన్ని హాస్టళ్లలో దోమ తెరలు సరఫరా చేయలేదు. శ్లాబ్‌లకు పెచ్చులూడిపోతున్నాయి. బాలికల హాస్టల్‌లో సైతం సరిపడా  మరుగుదొడ్లు లేవు. కొన్ని చోట్ల తాగేందుకు నీరు సక్రమంగా అందుబాటులో లేదు. కొన్ని హాస్టల్‌లో విద్యార్థులకు కాస్మిటిక్‌ ఛార్జీలు సక్రమంగా అందటలేదు. మెను ప్రకారం భోజనం వడ్డించడం లేదు. దొడ్డు బియ్యం కావడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. మొత్తం మీద విద్యార్థులు అసౌకర్యాల మధ్య ఆవేదన చెందుతున్నారు.

దోమతెరలు లేవు
గుంటూరు వెస్ట్‌ పరిధిలో దుప్పట్లు, దోమల ఖీంకరింపులు, అపరిశుభ్ర వాతావరణం మధ్య విద్యార్థులు విలవిలలాడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడింది. నగరంలోని లాడ్జి సెంటర్‌ కూడలిలో ఎస్సీ, బీసీ, ఏటీ అగ్రహారంలోని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు ఎక్కువయ్యాయి. దోమ తెరలు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు.

ఇరుకు గదుల్లో..
గుంటూరువారితోటలోని ప్రభుత్వ కాలేజీ బాలుర వసతి గృహం ఇరుకైన అద్దె భవనంలో కొనసాగుతుంది. విద్యార్థులు ఇరుకైన గదుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం రూ. లక్షలు వెచ్చించి అద్దె చెల్లిస్తున్నా విద్యార్థులకు సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాజాగారితోటలో ఉన్న ఎస్సీ వసతి గృహంలో 176 మంది విద్యార్థులు ఒక వసతి గృహంలో, మరో వసతి గృహంలో 160 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరూ ఆరుగదుల్లో బస చేయాల్సి రావడంతో సరిపోక వరండాలో పడుకుంటున్నారు. ఇక్కడ ఆర్వో పాంటు మరమ్మతులకు గురికావడంతో నీరు సక్రమంగా అందడం లేదు. ఈ ఏడాది సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు రూ. 367.67 లక్షలు, బీసీ సంక్షేమ హాస్టళ్లకు రూ. 754.01 లక్షలు, ఎస్సీ హాస్టళ్లకు రూ.689 లక్షలు మాత్రమే కేటాయించారు. 

అద్దె భవనాల్లో అగచాట్లు
చిలకలూరిపేట సాంఘిక వసతి గృహం అద్దె భవనంలో కొనసాగుతోంది. పట్టణంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో నాలుగు నెలల క్రితం బోర్‌వెల్‌ మరమ్మతులకు గురైంది. ఇప్పటికీ వాటిని తయారు చేయించకపోవడంతో నాలుగు రోజులకొకసారికి వచ్చే ట్యాంకరు నీటిపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇక్కడ 99 మంది విద్యార్థులుడున్నారు. బీసీ హాస్టల్‌లో ఒకే మరుగుదొడ్డి ఉంది.

దుప్పట్లు లేవు
నరసరావుపేటలో ఓకే గదిలో పది మందికిపైగా విద్యార్థులు నిద్రిస్తున్నారు. దోమల బెడదకు తోడు ఫ్యాన్లు తిరగక, దుప్పట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం గౌడోన్‌కు ఉపయోగించే షెడ్డును హాస్టల్‌గా మార్చారు. నరసరావుపేట రూరల్‌ పరిధిలోని రెడ్డినగర్‌ ఎస్టీ హాస్టల్‌లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. కిటికీలకు, తలుపులకు మెష్‌లు లేకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది.

తలుపులకు మెష్‌లు లేవు
 పొన్నూరు బీసీ వసతి గృహంలో 70 మంది విద్యార్థులున్నారు. రూముల శ్లాబు బాగా దెబ్బతింది. వసతి గృహాల్లో ఉన్న బాత్‌రూము, మరుగుదొడ్లకు తలుపులు లేవు. ఫ్యాన్లు తిరగడం లేదు. కిటికీలు, తలుపులు ఊడడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. చేబ్రోలు కళాశాల బీసీ బాలికల వసతి గృహంలో అద్దె రేకుల షెడ్డులోనే కొనసాగుతోంది. పెదకాకాని బీసీ బాలికల వసతి గృహంలో 110 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ వాటర్‌ పైపులైను లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. రేపల్లెలో పట్టణంలోని బాలికల వసతి గృహాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. 

కాస్మెటిక్స్‌ అందడం లేదు
సత్తెనపల్లిలో కాస్మెటిక్‌ సక్రమంగా అందడం లేదు. చలి నుంచి రక్షణ కవచం లేక వణికిపోతున్నారు. విరిగిన ట్రంక్కు పెట్టేలే వీరికి దిక్కు. ఆహారానికి రేషన్‌ బియ్యం వాడడంతో కొంత మంది కడుపు నొప్పితో అనారోగ్యానికి గురవుతున్నారు. బాలికలకు నాఫ్తీన్‌లను సరఫరా చేయడం లేదు.

మరుగుదొడ్లు అధ్వానం
తుళ్లూరు మండలంలో ఉన్న వసతి గృహాలను నిర్వీర్యం చేసి విద్యార్థులను మంగళగిరి, గుంటూరు ప్రాంతాలకు తరలించారు. తాడికొండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అద్దె భవనంలో నడుస్తుండటంతో విద్యార్థులకు సరైన వసతులు లేవు. ఫిరంగిపురం బీసీ హాస్టల్‌లో మరుగుదొడ్లు, బాత్‌రూములు అధ్వానంగా మారాయి.

వార్లెన్లు ఎక్కడ ?
తెనాలిలో వార్డెన్లు అందుబాటులో ఉండటం లేదు. గదులకు తలుపులు, కిటికీలు లేవు. కొన్ని గదుల్లో ఫ్లోరింగ్‌ లేకపోవడం, గదులపై భాగాన పెచ్చులూడి ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

మంచినీళ్లు లేవు
వినుకొండ వసతి గృహంలో కిటికీలకు, తలుపులకు మరమ్మతులు లేవు. ఈపూరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, బాలుర వసతి గృహాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో ఆరుబయటకు వెళుతున్నారు. వినుకొండ సాంఘిక సంక్షేమ గిరిజన బాలుర వసతి గృహంలో  మంచినీరు లేవు.

సరైన వెలుతురు లేదు
గురజాలలో ఊరి చివర పంట పొలాల్లోని అద్దె భవనాల్లో హాస్టల్స్‌ నడుస్తున్నాయి. ఇక్కడ మరుగుదొడ్డి, బాత్‌రూములు లేవు. పిడుగురాళ్ల బాలుర, బాలికల వసతి గృహాలు అధ్వానంగా మారాయి. మాచవరంలో  చదువుకునేందుకు కనీసం లైటింగ్‌ సౌకర్యం లేదు. దాచేపల్లిలోని బీసీ హాస్టల్‌ గృహంలో తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.

మెనూ పాటించడం లేదు
మాచర్ల రైల్వేస్టేషన్‌ రోడ్డులో ఉన్న బీసీ బాలికల ఉన్నత హాస్టల్, ఎస్సీ బాలికల హాస్టల్, సీసీ రోడ్డులోని ఎస్సీ బాలికల ఉన్నత హాస్టల్‌లో విద్యార్థులు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మెనూ ప్రకారం భోజనం సక్రమంగా వడ్డించకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నారు. వేమూరులోని ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో మరుగుదొడ్లు లేక బాలికలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 70 మంది విద్యార్థినులకు ఒకే మరుగుదొడ్డి ఉంది. కాస్మెటిక్‌ చార్జీలు నాలుగు నెలలకు కూడా ఇవ్వడం లేవు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top