అంగన్ వేడి!
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
	ఉద్రిక్తంగా మారిన ధర్నా
	 తోపులాటలో గాయపడిన కార్యకర్తలు, సీపీఐ నేతలు
	 పోలీసులు,నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం
	  వాహనాలకు అడ్డంగా కూర్చున్న కార్యకర్తలు
	 28మంది నాయకులు, కార్యకర్తల అరెస్ట్
	 విజయనగరం క్రైం:  తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ   కలెక్టరేట్ వద్ద   నిర్వహించిన ధర్నా   ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, కార్యకర్తల మధ్య  తోపులాట జరిగింది. దీంతో  పలువురు కార్యకర్తలు కిందపడిపోయారు.కొంతమందికి గాయాలయ్యాయి, మరికొంతమంది వస్త్రాలుచిరిగిపోయాయి.  దీంతో పరిస్థితి అదుపుతప్పింది.
	 
	 ధర్నా సందర్భంగా 28 మంది కార్యకర్తలు,నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.  తమకు చెల్లించవలసిన ఎనిమిది నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని, జీతాలు పెంచుతామని ప్రకటించి మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకూ జీఓ జారీ చేయలేదని, దానిని వెంటనే విడుదల  చేయాలని, కేంద్రాలు నిర్వహిస్తున్న భవనాలకు అద్దె చెల్లించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్ వద్ద అంగన్‌వాడీలు పెద్ద ఎత్తున ధర్నా చేశారు.  తమ సమస్యలు పరిష్కరించేంతవరకు ధర్నాను విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.
	 
	   ఐసీడీఎస్ పీడీ ఎ.ఇ.రాబర్ట్స్,   కలెక్టర్ ఎం.ఎం.నాయక్ ధర్నా వద్దకు వచ్చి హామీ ఇచ్చేంతవరకు కదిలేదని తేల్చిచెప్పారు. అధికారులు ఎంతకీ రాకపోవడంతో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ, టి.జీవా, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్  జిల్లా గౌరవ అధ్యక్షురాలు ఎం.ఉమామహేశ్వరి, లక్ష్మి, సీపీఎం జిల్లా కార్యదర్శి టి.సూర్యనారాయణ తదితరులు కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లేందుకు  ప్రయత్నించగా,  వారిని పోలీసులు  అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు, సీఐటీయూ, అంగన్‌వాడీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట  జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు  28 మంది సీఐటీయూ, అంగన్‌వాడీ నాయకులు, కార్యకర్తలను   అరెస్ట్ చేశారు. నాయకులను   అరెస్ట్‌చేసే సమయంలో అడ్డుకున్న అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులను  తోసేయడంతో పలువురు   కింద పడిపోయారు.  
	 
	   పోలీసులు దురుసుగా వ్యవహరించడంతో  శ్రామిక మహిళా సంఘ జిల్లా నాయకురాలు బి.సుధారాణికి అరచేతిపై స్వల్పగాయమై   రక్తం కారింది. అరెస్ట్‌చేసిన నాయకులను   వ్యాన్‌లో ఎక్కించుకుని  తీసుకువెళ్లిన సమయంలో రోడ్డుకు అడ్డంగా  అంగన్‌వాడీలు కూర్చొని నిరసన తెలిపారు.  సుమారు అరగంటపాటు  అంగన్‌వాడీలు రోడ్డుకు అడ్డంగా కూర్చొని నినాదాలు చేయడంతో  పోలీసులు వారిని చెదరగొట్టారు.  జామి పోలీసు స్టేషన్‌కు 14మంది, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు 14మందిని తరలించారు. అంగన్‌వాడీ నాయకులు ఎం.ఉమామహేశ్వరి, ఎం.కృష్ణ, లక్ష్మి, బి.సుధారాణిలను  అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని  కలెక్టరేట్ లోపల విడిచిపెట్టారు.  నాయకులను అరెస్ట్‌చేసినప్పటికీ అంగన్‌వాడీలు కలెక్టరేట్ గేటు  వద్ద ధర్నా  కొనసాగించడంతో జేసీ   బి.రామారావు  వచ్చి సమస్యలను పరిష్కరించేందుకు కృషి  చేస్తామని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు.  అరెస్ట్‌చేసిన నాయకులను విడిచిపెడితే ఇక్కడినుంచి కదులుతామని అంగన్‌వాడీలు డిమాండ్ చేయడంతో పోలీసులు అందుకు అంగీకరించడంతో   వారు ధర్నా విరమించారు.  
	 
	 దురుసుగా ప్రవర్తించిన పోలీసులు: కలెక్టరేట్‌లోకి  దూసుకువెళ్తున్న నాయకులను అరెస్ట్‌చేసిన సమయంలోను, మహిళల పట్ల పోలీసులు  దురుసుగా ప్రవర్తించారు. విచక్షణా రహితంగా  నాయకులను   ఈడ్చుకెళ్లారు.  ఈ సమయంలో పలువురికి  స్వల్పగాయాలయ్యాయి.  వస్త్రాలు చిరిగి పోయాయి.
	 వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు : అంగన్‌వాడీల పోరాటానికి  వైఎస్‌ఆర్‌సీపీ  జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మద్దతు ప్రకటించారు.
	 
	 సమస్యలు న్యాయమైనవని,   అండగా ఉంటామన్నారు. కలెక్టరేట్ వద్దకు వెళ్లి.... ధర్నా చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు.   ఆరోగ్యశ్రీ, ఫీజు రియెంబర్స్‌మెంట్‌కు నిధులు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంగన్‌వాడీలతో పాటు కలెక్టరేట్ వద్ద మరో పక్కన ధర్నా చేసిన ఉపాధిహామీ పధకం క్షేత్ర సహాయకుల  కోలగట్ల వీరభద్రస్వామి  సంఘీభావం ప్రకటించారు.   డిసెంబర్ 17నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో సమస్యల గురించి ప్రస్తావించాలని తమ పార్టీ అధ్యక్షులు,  ప్రతిపక్షనేత వైఎస్‌జగన్మోహన్‌రెడ్డిని కోరుతామని చెప్పారు.  వైఎస్‌ఆర్‌పార్టీ నాయకులు జి.సూరపురాజు,జి.వి.రంగారావు, ఆశపు వేణు, నడిపేన శ్రీను, ఎస్.బంగారునాయుడు,అల్లుచాణుక్య, పట్నాన పైడిరాజు బంగార్రాజు,  గణేష్, పండు, నవాబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.  
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
