కంపు.. కంపు | Stench stench .. | Sakshi
Sakshi News home page

కంపు.. కంపు

Oct 13 2014 2:01 AM | Updated on Aug 28 2018 5:25 PM

కంపు.. కంపు - Sakshi

కంపు.. కంపు

అనంతపురం ఎడ్యుకేషన్ : కొత్తగా నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) భవనాలు ‘పైన పటారం లోన లొటారం’ అన్న చందంగా ఉన్నాయి.

అనంతపురం ఎడ్యుకేషన్ : కొత్తగా నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) భవనాలు ‘పైన పటారం లోన లొటారం’ అన్న చందంగా ఉన్నాయి. ఇంజినీరింగ్ విభాగం అధికారుల నిర్వాకంతో మరుగుదొడ్లకు సంబంధించిన ఇంకుడు గుంతల నిర్మాణాలు అస్తవ్యస్తంగా జరిగాయి. ఫలితంగా మరుగుదొడ్ల నుంచి నీరు బయటకు వస్తూ దుర్వాసన వెదజల్లుతోంది.

కనీసం పరిసర ప్రాంతంలో నిలబడాలంటే కూడా సాధ్యం కాని పరిస్థితి. ఈ వాసనతో విద్యార్థినులు కడుపునిండా భోజనం కూడా తినలేకుండా ఉండారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు కనీసం ఆవైపు కన్నెత్తి చూడడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో  విద్యార్థినులకు అనుగుణంగా  మరుగుదొడ్లు, స్నానాల గదుల్లోంచి వచ్చేమురుగు నీరు నిల్వ ఉంచేందుకు సరిపడా ఇంకుడు గుంతలు ప్రణాళిక మేరకు తీయలేదు.

ఫలితంగా రోజూ విద్యార్థినులు ఉపయోగించే మరుగుదొడ్ల నుంచి నీరు ఇంకుడు గుంతల్లో ఇంకిపోకుండా  బయటకు వస్తోంది. నీరు ఇంకేందుకు తగినట్టుగా ఇంకుడు గుంతలను నిర్మించకపోవడమే ఇందుకు కారణం. వీటికి నీటి తొట్టెల్లాగా సిమెంటు గోడలు కట్టేశారు. దీంతో తొట్టెలు నిండిపోయి బయటకు వస్తోంది.
 మురుగునీరంతా చేరుకుని కంపు వాసన వస్తోంది. దుర్వాసన భరించలేక కనీసం అన్నం కూడా తినలేని ఇబ్బందులు పడుతున్నారు.

పోనీ ఇక్కడి నుంచి బయటకు పంపేందుకు ఎలాంటి పైపులైనూ ఏర్పాటు చేయలేదు. వాస్తవానికి అండర్ గ్రౌండ్ డ్రె యినేజీ వ్యవస్థకు అనుగుణంగా వీటిని డిజైన్ చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ లేదు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా నిర్మించాల్సిన ఇంజినీరింగ్ అధికారులు ఏదో నిర్మాణాలు పూర్తి చేయించామనే విధంగా వ్యవహరించడంతోనే ఈ రోజు సమస్య ఉత్పన్నమవుతోంది.  

కొత్త కేజీబీవీలన్నింటిలోనూ ఇదే దుస్థితి
 రాప్తాడు, గార్లదిన్నె, కళ్యాణదుర్గంతో పాటు కొత్తగా నిర్మించిన సుమారు 20 కేజీబీవీల్లో ఇదే దుస్థితి నెలకొంది. వీటన్నింటిలోనూ మరుగుదొడ్లు ఒకేరకంగా నిర్మించడంతో సమస్య ఉత్పన్నమవుతోంది.
 ముఖ్యంగా రాప్తాడు కేజీబీవీలో పరిస్థితి మరింత దారుణం. మరుగుదొడ్ల నుంచి బయటకు వస్తున్న నీరంతా తాగునీటి బోరు వద్దకు చేరుతోంది. ఈ బోరు నీటినే విద్యార్థినులు తాగాల్సి వస్తోంది.

మండల అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించినా ఇప్పటిదాకా కనీస ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. పట్టించుకోవాల్సిన ఎస్‌ఎస్‌ఏ అధికారులు మిన్నకుండిపోయారు. వాసనతో అక్కడ రెండు నిముషాలు కూడా నిలబడం లేము. అలాంటిది వందలాది మంది ఆడ పిల్లలు ఈ వాసన భరిస్తూ అక్కడే జీవిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి దుర్వాసన నుంచి తమ పిల్లలను రక్షించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement