ఈసీ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితా ఇవ్వండి

State government Petition in the High Court on Intelligence DG Transfer - Sakshi

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు  ఆదేశం

ఇంటెలిజెన్స్‌ డీజీ బదిలీపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌

విచారణ నేటికి వాయిదా

సాక్షి, అమరావతి: ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. విధి నిర్వహణను పక్కన పెట్టేసి అధికార పార్టీ సేవలో తరిస్తున్న ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ చేయడంపై చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ధర్మాసనం బుధవారం విచారించింది. ఎన్నికల సంఘం ఉత్తర్వులను ఏకపక్షంగా ప్రకటించిందని, తదుపరి చర్యలన్నింటినీ నిలిపేయాలని కోరుతూ జీఏడీ కార్యదర్శి శ్రీకాంత్‌ బుధవారం అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో హైకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించేందుకు సిద్ధం కాగానే, మరో న్యాయవాది ఎస్‌. వివేక్‌ చంద్రశేఖర్‌ జోక్యం చేసుకుంటూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ బదిలీలు చేసిందని, అందువల్ల ఈ వ్యాజ్యంలో తమ వాదనలు కూడా వినాలని కోరారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున సీనియర్‌ న్యాయవాది సి.వి.మోహన్‌రెడ్డి హాజరవుతారని, అందువల్ల విచారణను గురువారానికి వాయిదా వేయాలని కోరారు. ఇందుకు ఏజీ శ్రీనివాస్‌ అభ్యంతరం తెలిపారు.

వారి ఫిర్యాదుతో చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో లేదు
ఎన్నికల సంఘం ఉత్తర్వుల్లో ఎక్కడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నామని పేర్కొనలేదని ఏజీ తెలిపారు. ఇంటెలిజెన్స్‌ డీజీతో పాటు ఇద్దరు జిల్లా ఎస్పీలను బదిలీ చేసిందని కోర్టుకు నివేదించారు. ఎస్పీలు ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారని, అందువల్ల వారి బదిలీకి ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. ఇంటెలిజెన్స్‌ డీజీకి ఎన్నికల సంఘం విధులతో ఏమాత్రం సంబంధం ఉండదని, అందువల్ల ఆయన బదిలీ పైనే తమ అభ్యంతరమని తెలిపారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్‌ 28(4) ప్రకారం రిటర్నింగ్‌ అధికారి, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, ప్రిసైడింగ్‌ అధికారి, పోలింగ్‌ అధికారి, ఈ సెక్షన్‌ కింద నియమితులైన అధికారులు, ఎన్నికల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన పోలీసు అధికారులంతా ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిన తేదీ నుంచి ఫలితాలు వెలువడే వరకు ఎన్నికల కమిషన్‌ డిప్యుటేషన్‌లో ఉంటారని వివరించారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాను ఇవ్వాలని కోరింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top