రేషన్‌కు ప్రభుత్వం కోత పెట్టింది. బోగస్‌ను బూచిగా చూపించి కోటాను భారీగా తగ్గించేసింది.
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: రేషన్‌కు ప్రభుత్వం కోత పెట్టింది. బోగస్‌ను బూచిగా చూపించి కోటాను భారీగా తగ్గించేసింది. ముందస్తు సమాచారం లేకుండా చౌకధరల దుకాణాలకు అందించే సరుకులకు కత్తెర వేసింది. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు ఈనెల వచ్చిన కోటాను చూసి డీలర్లు డీలా పడ్డారు. ఇప్పటి వరకు అందిస్తున్న సరుకులకు 15 శాతం ప్రభుత్వం కోత పెట్టి 85 శాతం సరుకులను మాత్రమే విడుదల చేసింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ సర్క్యులర్ జారీ చేసింది. దాంతో నిర్ణీత తేదీల్లో చౌకధరల దుకాణాలకు ఎవరు ముందుగా వస్తే వారికి సరుకులు ఇవ్వనున్నారు.
85 శాతం దాటిన తరువాత వచ్చిన వారికి మొండిచెయ్యే మిగులుతుంది. వీరికి ఏం సమాధానం చెప్పాలంటూ అనేక మంది డీలర్లు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 2102 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి పరిధిలో 8 లక్షల 53 వేల 874 కార్డులున్నాయి. ప్రతినెలా బియ్యంతోపాటు అమ్మహస్తం పథకం కింద తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు వాటి ద్వారా కార్డుదారులకు అందిస్తుంటారు. రేషన్‌లో కోత విధించకముందు జిల్లాకు ప్రతినెలా 10304.384 క్వింటాళ్ల బియ్యం వచ్చేవి. అక్టోబర్ వరకు ఇదేవిధంగా పంపిణీ చేశారు. నవంబర్ కోటా వచ్చేసరికి 15 శాతం కోత పడింది. కిలోరూపాయి బియ్యంతోపాటు అమ్మహస్తం సరుకులు కూడా తగ్గిపోయాయి. తక్కువగా వచ్చిన సరుకులను చూసుకున్న డీలర్లు అసలు విషయం తెలుసుకుని డీలా పడిపోయారు. 85 శాతం సరుకులు పంపిణీ చేసిన తరువాత మిగిలిన 15 శాతం కార్డుదారులు వస్తే వారికి ఏం సమాధానం చెప్పాలని డీలర్లు తర్జన భర్జన పడుతున్నారు.
భిన్నవాదనలు
చౌకధరల దుకాణాల నుంచి సరఫరా చేసే నిత్యావసర సరుకులకు ఒక్కసారిగా 15 శాతం కోత విధించడంపై అటు డీలర్లు, ఇటు పౌరసరఫరాలశాఖలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందన్న విషయాన్ని చర్చించుకుంటున్నారు. బోగస్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో వాటికి చెక్ పెట్టేందుకు రేషన్ తగ్గించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి కార్డుదారులంతా చౌకధరల దుకాణాలకు రావడం లేదని, దీంతో పక్కదారి పడుతున్న సరుకులను నియంత్రించేందుకే ఈ చర్యకు దిగిందంటున్నారు. ఇదిలా ఉండగా డీలర్ల వాదన మరో విధంగా ఉంది. బోగస్ కార్డుల పేరుతో కోటాను తగ్గించడం భావ్యం కాదంటున్నారు. ఇంటింటికీ తిరిగి రేషన్ కార్డులపై విచారణ జరిపి వాస్తవ లబ్ధిదారులా కాదా అన్న విషయాన్ని విచారించి అక్కడికక్కడే కార్డు రద్దు చేస్తే సమస్యలు ఉండవని చెబుతున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో తాము కార్డుదారుల ఎదుట దోషులుగా నిలబడాల్సి వస్తుందని తల్లడిల్లుతున్నారు. సరుకుల కోసం వచ్చినవారి మధ్య పోటీ నెలకొని ఘర్షణలకు దారితీసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషిస్తున్నారు. బోగస్ ఏరివేతే ధ్యేయంగా పెట్టుకుంటే డొంక తిరుగుడుగా వెళ్లకుండా బహిరంగంగా విచారించవచ్చని డీలర్లు అంటున్నారు.
రచ్చబండకు క్లియరెన్సా?
ప్రభుత్వం రచ్చబండతో మరోమారు ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అదే సమయంలో గతంలో ఇచ్చిన కూపన్ల స్థానంలో రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాలశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గతంలో రచ్చబండలో వచ్చిన కూపన్లు రేషన్ కార్డులుగా మారబోతున్నాయి. ఈ నేపథ్యంలో వారికి నిత్యావసర సరుకులు సరఫరా చేయకుంటే ప్రభుత్వానికి మరింత చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో రేషన్ కోటాను తగ్గించారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.