గిరిపుత్రికకు గ్రూప్‌–1 కిరీటం

State First Rank In ST Quota - Sakshi

ఎస్టీ కోటాలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్‌

ఆర్‌టీఓ ఉద్యోగం సాధించిన శాంతకుమారి

అనంతపురం టౌన్‌:నాన్న కష్టం.. అమ్మ ఆరాటం.. చదువుతోనే పిల్లల భవిష్యత్‌ బాగుంటుందన్న తల్లిదండ్రుల ఆకాంక్ష.. ఎంత కష్టమైన కూతుర్ని ప్రభుత్వ అధికారిగా చూడాలనే వారిక కోరిక.. భర్త అందించిన ప్రోత్సహాంతో ఆమె ఉన్నత చదువులు చదివింది. పోటీ పరీక్షల్లో రాణించింది. గ్రూప్‌–1 పోటీ పరీక్షలో ఎస్టీ కేటగిరిలో ఏకంగా రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్‌ సాధించింది. అనంతపురం మండలం నరసనేయునికుంట గ్రామానికి చెందిన బొజ్జేనాయక్, బాలమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. తాము పడ్డ కష్టం తమ పిల్లలకు రాకుడదనే సంకల్పంతో పిల్లలను ఉన్నత చదువులు చదివించాలన్నారు. బొజ్జేనాయక్‌ తనకున్న 5 ఎకరాల పొలంతోపాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడు. వచ్చిన ప్రతి పైసాను పిల్లల చదువుల కోసమే ఖర్చు చేశాడు. పెద్ద కుమార్తెకు చదువు అబ్బలేదు. రెండో కుమార్తె రమాదేవిని బీఈడీ చదివించారు. కానీ ఆమెకు ప్రభుత్వ కొలువు మాత్రం రాలేదు. పెద్ద కొడుకు చంద్రానాయక్‌ను ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చదివించాడు. అతనికీ ప్రభుత్వ ఉద్యోగం వరించలేదు. చిన్న కుమార్తె శాంతకుమారిని ఏలాగైన ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలనే ఆశ బొజ్జేనాయక్‌లో బలంగా నాటుకుపోయింది.

శాంతకుమారి చదువులు మొత్తం ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగించింది. నరసనేయునికుంట మండల పరిషత్‌ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివింది. కురుగుంట గురుకుల పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పూర్తి చేసింది.  10వ తరగతిలో 74శాతం, ఇంటర్మీడియట్‌లో 78శాతం  మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఎంసెట్‌లోనూ మంచి ర్యాంక్‌ సాధించి ఇంటెల్‌ కళాశాలలో  65శాతం మార్కులతో బీటెక్‌ పూర్తి చేసింది. అనంతరం పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. రెండేళ్లపాటు హైదరాబాద్‌లో శిక్షణ పొందింది. 2011లో గ్రూప్‌–1 పరీక్ష రాసింది. అయితే  ప్రభుత్వం ఫలితాలను  వెల్లడించలేదు. దీంతో తల్లిదండ్రులు కళ్యాణదుర్గం మండలం కాపర్లపల్లి గ్రామానికి చెందిన రామూర్తి నాయక్‌తో శాంతకమారికి వివాహం జరిపించారు. గ్రూప్‌–1 ఫలితాలు వెల్లడికాలేదని నిరాశ చెందొద్దంటూ భర్త రామూర్తినాయక్‌ ప్రోత్సహం అందించాడు. బీటెక్‌ అర్హతతో విజయనగరంలోని పరిశ్రమల శాఖలో ఇండ్రస్టియల్‌ ప్రమోషనల్‌ ఆఫీసర్, మరో  బ్యాంక్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. ఆ రెండు కొలువులూ ఆమెను వరించాయి. దీంతో పరిశ్రమల శాఖలో ప్రమోషనల్‌ అధికారి ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తోంది. తాజాగా ప్రభుత్వం 2016 గ్రూప్‌–1 ఫలితాలతోపాటు పెండింగ్‌లో ఉన్న 2011 గ్రూప్‌–1 ఫలితాలనూ విడుదల చేసింది. 2011 గ్రూప్‌–1 ఫలితాల్లో ఎస్టీ కోటాలో సుగాలి శాంతకుమారి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంక్, జనరల్‌ కోటాలో 83వ ర్యాంకు సాధించి ఆర్‌టీఓ ఉద్యోగం కైవసం చేసుకుంది.

ప్రణాళికాబద్ధంగా చదవడంతోనే..
ప్రణాళికాబద్ధంగా చదవడంతోనే విజయం సాధ్యమైంది. గ్రూప్‌–1 పరీక్షకు  మొదటి సారే ప్రయత్నించినా విజయం సాధించగలిగాను. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయంలో ఏలాగైనా కొలువు సాధించాలనే తపనతో అభ్యర్థులు చదవాలి. అప్పుడే విజయం సాధించగలం. మంచి అధికారిగా ప్రజలకు సేవలు అందించేందుకు కృషి చేస్తా.              – శాంతకుమారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top