గ్రూప్‌1 అర్హుల గుండె చెదిరింది! | TGPSC plans to appeal Group 1 court verdict | Sakshi
Sakshi News home page

గ్రూప్‌1 అర్హుల గుండె చెదిరింది!

Sep 10 2025 5:00 AM | Updated on Sep 10 2025 5:00 AM

TGPSC plans to appeal Group 1 court verdict

నియామక పత్రాలు అందుకోవాల్సిన దశలో హైకోర్టు షాక్‌  

రీవాల్యుయేషన్‌లో ఏమవుతుందోనని ఎంపికైన అభ్యర్థుల్లో ఆందోళన

ఇప్పటివరకు టీజీపీఎస్సీ చేసిన ప్రక్రియ కూడా వృథా ప్రయాసే 

రీవాల్యుయేషన్‌ జరిగితే మళ్లీ ధ్రువపత్రాల పరిశీలన,తుది జాబితా 

మెయిన్స్‌ పరీక్షలు మళ్లీ నిర్వహిస్తారా? అనే దానిపైనా చర్చలు 

కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లే యోచనలో టీజీపీఎస్సీ?

సాక్షి, హైదరాబాద్‌/చిక్కడపల్లి: రాష్ట్ర ప్రభుత్వశాఖ ల్లో గ్రూప్‌–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఆనందం ఆవిరైంది. తుది జాబితాలో అర్హత సాధించి ధ్రువపత్రాల పరిశీలన సైతం పూర్తి చేసుకుని నియామక పత్రాలు తీసుకోవల్సిన సమయంలో.. అర్హుల జాబితాను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు వారికి శరాఘాతంలా తగిలింది. మెయిన్స్‌ పరీక్షలకు సంబంధించి జవాబు పత్రాల మూల్యాంకనం తిరిగి నిర్వహించాలని టీజీపీఎస్సీని ఆదేశించడంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళంలో పడ్డారు. 

రీవాల్యుయేషన్‌ తర్వాత తమ పరిస్థితి ఏమవుతుందోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. రీవాల్యూయేషన్‌కు హైకోర్టు 8 నెలల గడువు ఇవ్వడంతో కింకర్తవ్యం ఏమిటనే దానిపై టీజీపీఎస్సీ ఆలోచనలో పడింది. ఇలావుండగా..పరీక్షలు బాగా రాసినప్పటికీ ఆశించినవిధంగా ఫలితాలు రాలేదని భావిస్తున్న కొంతమంది అభ్యర్థులు మాత్రం హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు. 

ఎన్నెన్నో అడ్డంకులు.. 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా 2022 ఏప్రిల్‌ 26న 503 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. భర్తీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం గ్రూప్‌–1 నియామకాల ప్రక్రియలో ఉన్న ఇంటర్వ్యూలను రద్దు చేసింది. 

3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొందరు ఆశావహులు అప్పటివరకు తాము చేస్తున్న చిన్నపాటి ఉద్యోగాలకు రాజీనామా చేసి పరీక్షలకు సిద్ధమయ్యారు. మరికొందరు దీర్ఘకాలిక సెలవులు పెట్టారు. 2022 అక్టోబర్‌ 16న ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. అదే ఏడాది చివర్లో 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. 

» 2023 ఆగస్టులో మెయిన్‌ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. అభ్యర్థులు కఠోర దీక్షతో సన్నద్ధతకు ఉపక్రమించారు. ఇంతలో టీజీపీఎస్సీలో పలు అర్హత పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసింది. ఇందులో భాగంగా గ్రూప్‌–1 ప్రశ్నపత్రాలు సైతం బయటకు వెళ్లాయని విచారణలో తేలడంతో గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్షను కమిషన్‌ రద్దు చేసింది. 

» 2023 జూన్‌ 11న టీజీపీఎస్సీ మరోమారు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. అయితే ఈ పరీక్షల నిర్వహణ తీరుపై క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. పరీక్ష నిర్వహణలో లోపాలు జరిగాయని నిర్ధారిస్తూ పరీక్షను రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది.  

» టీజీపీఎస్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడం, కొ త్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, టీజీపీఎస్సీ ప్రక్షాళన, కొత్త కమిషన్‌ ఏర్పాటు, కొత్తగా మ రో 60 గ్రూప్‌–1 ఉద్యోగ ఖాళీలను గుర్తింపు చ కచకా జరిగిపోయాయి. 2022 ఏప్రిల్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసిన టీజీపీఎస్సీ.. 2024 ఫిబ్రవరిలో 563 ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 4,03,645 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.  

» 2024 జూన్‌ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌ ఆధారిత పద్ధతిలో నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను జూలై 7న టీజీపీఎస్సీ విడుదల చేసింది. 31,383 మంది మెయిన్స్‌ పరీక్షలకు అర్హత సాధించారు. వీరితో పాటు మరో 20 మందిని కోర్టు ఉత్తర్వుల ద్వారా అనుమతించారు. 

»  అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 31,403 మంది అభ్యర్థుల్లో 21093 మంది మాత్రమే అన్ని పరీక్షలూ రాశారు. 2025 మార్చి 10వ తేదీన అభ్యర్థుల ప్రొవిజినల్‌ మార్కుల జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మార్చి 30వ తేదీన జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదల చేసింది. 

»  ఏప్రిల్‌ 10వ తేదీన 563 గ్రూప్‌–1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది. ఏప్రిల్‌ 16 నుంచి 22 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా చేపట్టింది. అయితే గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షల ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ వివిధ కేటగిరీలకు చెందిన పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నియామకాలకు బ్రేక్‌ పడింది.  

రీవాల్యుయేషనా? మళ్లీ పరీక్షలా? 
తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంపికైన అభ్యర్థులతో పాటు నిరుద్యోగ వర్గాల్లో చర్చోపచర్చలకు తెర లేపింది. మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం మళ్లీ జరుపుతారా? లేక తిరిగి పరీక్షలు నిర్వహిస్తారా? అనే చర్చ జరుగుతోంది. అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నియామక పత్రాలు అందుకోవాల్సి ఉండగా.. రీవాల్యుయేషన్‌ లేదా మళ్లీ పరీక్షలంటూ తీర్పు రావడంతో మూడున్నరేళ్లు పడిన శ్రమను తలచుకుంటూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 

కాగా హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నెలల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివిన అభ్యర్ధులు హైకోర్టు తీర్పుతో ఆందోళనకు గురవుతుంటే.. మెయిన్స్‌లో విఫలమైన కొంతమంది న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నారు. మంగళవారం అశోక్‌నగర్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, పలు శిక్షణా కేంద్రాల్లో హైకోర్టు తీర్పు చర్చనీయాంశం అయ్యింది.  

ఆర్థికంగా పెను భారం 
కోచింగ్‌లు, మెటీరియల్, తదితర ఖర్చులు ఇప్పటికే తడిసి మోపెడయ్యాయి.మరోసారి పరీక్షలు రాయవలసి వస్తే మాత్రం ప్రతి పేద అభ్యర్థిపై పెను భారం పడుతుంది.  – వై.క్రాంతికుమార్, గ్రూప్‌–1 అభ్యర్థి 

మళ్లీ పరీక్షలు నిర్వహించాల్సిందే 
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ప్రభు త్వం మళ్లీ ఎగ్జామ్స్‌ నిర్వహించాలి. తెలుగు మీడియం అభ్యర్థులకు గతంలో ఎంతో నష్టం జరిగింది. మరోసారి పరీక్షలు నిర్వహించడం వల్ల వీరికి న్యాయం జరిగే అవకాశం ఉంది.  – సలీమ్, గ్రూప్‌–1 అభ్యర్థి

కోచింగ్‌ కేంద్రాల దోపిడీకి మళ్లీ అవకాశం 
కోచింగ్‌ సెంటర్లు మరోసారి దోపిడీకి పాల్పడే అవకాశం ఉంది. ఇప్పటికే అశోక్‌నగర్‌ కోచింగ్‌ కేంద్రాల మాఫియాకు అడ్డాగా మారింది. హాస్టళ్లు, మెస్‌లు, స్టడీ హాళ్లు, కోచింగ్‌ కేంద్రాలు అభ్యర్థులను పెద్ద ఎత్తున దోచుకుంటున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి.  – బి.చంద్రకాంత్, రాష్ట్ర సహ కనీ్వనర్, లా స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement