
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న గ్రూప్ 1 మెయిన్స్ ర్యాంకర్ల తల్లిదండ్రులు
రాజకీయాల్లోకి వాళ్లను లాగొద్దు
రూ.3 కోట్ల ఆరోపణలు రుజువు చేయాలి
అప్పులు చేసి పిల్లల్ని చదివించాం
మూడు దఫాలు రద్దు చేశారు.. ఇది నాలుగో దఫా.. ఇలాగైతే ప్రభుత్వ ఉద్యోగాలపై నమ్మకం పోతుంది
గ్రూప్ 1 ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదన
సాక్షి, హైదరాబాద్: ‘యువత జీవితాలతో రాజకీయాలు చేయొద్దు. రూ.3 కోట్లు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకున్నా రంటున్నారు. అమ్ముకున్న వారెవరు? కొనుక్కున్నవారెవరు ? ఇలా మాట్లాడే వారి దగ్గర ఏమైనా ఆధారాలుంటే చూపించాలి. మీరు రాజకీయాలు చేసుకోండి. లేనిపోని మాటలు మాట్లాడి పిల్లల బతుకులు ఆగం చేయొద్దు. ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. పిల్లలకు ఇబ్బందులు లే కుండా నియామక పత్రాలు ఇస్తారని ఆశి స్తున్నాం. ఏది ఏమైనా విచారణకు మేము కూడా సహకరిస్తాం. రూ.3 కోట్లకు ఎన్ని సున్నాలుంటాయో కూడా మాకు తెలీదు.
అంత సొమ్ముంటే ఏ వ్యాపారమో చేసుకు నే వాళ్లం. రూ.3 కోట్లు కాదు.. బ్యాంకులో రూ.3 లక్షలుంటే చూ పండి. మావి పేద కుటుంబాలు, కాయ కష్టం చేసి పిల్లల్ని చది వించాం. పిల్లలు కూడా రాత్రి పగలు తేడా లేకుండా, పండుగలు, ఇతర శుభ కార్యాలకు దూరమై, ఒక దీక్ష చేసినట్లు చదువుకుని, ర్యాంకులు సాధిస్తే అసత్య ఆరోపణలతో వారిని అవమానిస్తున్నారు. ర్యాంకర్లు ఎవరైనా, ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారు? పిల్లలకు న్యాయం చేయాలి. ఇప్పటికే మూడు దఫాలు రద్దు చేశారు. ఇలాగే కొనసాగితే ప్రభుత్వ ఉద్యోగాలపై భవిష్యత్తరాలకు నమ్మకం పోతుంది..’ అంటూ నియామక పత్రాల కోసం ఎదురుచూస్తున్న పలువురు గ్ర–1 ర్యాంకర్ల తల్లిదండ్రులు వాపోయారు. మంగళవారం సోమాజీ గూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది
గ్రూప్–1 ఉద్యోగాలు అమ్ముకున్నారంటున్నారు. రూ.3 కోట్లు అని ప్రారంభించి రూ.1,700 కోట్ల స్కాం అంటున్నారు. అభియోగం మోపితే సరిపోదు. దాన్ని నిరూపించగలగాలి. ఇక్కడున్న తల్లిదండ్రులకు రూ.3 కోట్లు ఇవ్వగలిగే స్థోమత ఉందా.? లక్షల్లో అప్పులు చేసి పిల్లల్ని చదివించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచాలి.– దాదా సలాం, గోదావరిఖని, 46వ ర్యాంకర్ తండ్రి
ఎప్పటికీ అశోక్‌నగర్‌లోనే ఉండాలా?
రాజకీయ నాయకులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దు. ఆరోపణలు విని మేము చాలా బాధపడుతున్నాం. 563 మంది రూ.3 కోట్లు చొప్పున ఇస్తే సుమారు రూ.1,700 కోట్లు అవుతుంది. అంత సొమ్ముఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి చేరిందనేది నిరూపించాలి. రూ.లక్షలు ఫీజులు కడుతూ ఎప్పటికీ అశోక్ నగర్‌లోనే ఉండాలా? – పావని, ర్యాంకర్ తల్లి
రాజకీయం పార్టీలు చూసుకోవాలి
వారం రోజులుగా జరుగుతున్న వ్యవహారం మొత్తం చూస్తు న్నాం. రూ.3 కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు. అందరూ సహకరించాలి. రాజకీయం ఉంటే ఆయా పార్టీలు చూసుకోవాలి. – జంగారెడ్డి, 159వ ర్యాంకర్ తండ్రి
నిందలు భరించలేకపోతున్నాం..
నా కొడుకు మూడు దసరాల నుంచి ఇప్పటివరకు ఒక్క దఫా కూడా మాతో లేడు. గతంలో ప్రిలిమ్స్‌లో అవకతవకలు జరిగాయన్నారు. ఈసారి మెయిన్స్ రాసి ర్యాంకు వచ్చినప్పుడు ఏమీ అనలేదు. తీరా జాబ్‌లో చేరే సమయంలో రాజకీయ నాయకుల స్వార్థాల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. ఇదెంతవరకు సమంజసం? ఏమైనా సరే నిందలు వేయకండి. భరించలేకపోతున్నాం. – లలిత, 67వ ర్యాంకర్ ఉదయ్‌కిరణ్ తల్లి