పోలీసుల ‘వీక్లీ ఆఫ్‌’కు కదలిక

Started Exercise to Police Weekly Off - Sakshi

సీఎం జగన్‌ హామీ అమలుకు మొదలైన కసరత్తు

22 మందితో కమిటీ వేసిన డీజీపీ గౌతం సవాంగ్‌

నివేదికకు వారం రోజులు గడువు

సాక్షి, అమరావతి: శాంతిభద్రతల పరిరక్షణలో వీక్లీఆఫ్‌ అనేది లేకుండా దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వీక్లీఆఫ్‌ ఇస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీకి కదలిక వచ్చింది. ఇందుకు సంబంధించి డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ ఓ కమిటీ ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఆ దిశగా చర్యలు చేపట్టడంతో పోలీసుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఆయన దానిని గాలికొదిలేశారు. అప్పటి డీజీపీగా నండూరి సాంబశివరావు ప్రయత్నాలు చేసినప్పటికీ ఒకటి రెండు జిల్లాల్లో అరకొరగానే అమలై ఆ తరువాత మరుగున పడింది.

ఈ నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సమయంలో పలువురు పోలీసులు, హోంగార్డులు ఆయన్ను కలిసి తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. వారి సమస్యలు తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. అధికారంలోకి వచ్చాక పోలీసులకు వీక్లీఆఫ్, హోంగార్డులకు మెరుగైన వేతనాలు, పోలీసు కుటుంబాల సంక్షేమానికి పాటుపడతానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎం కావడం.. తన హామీని అమలుచేసే దిశగా వైఎస్‌ జగన్‌ అడుగులు వేయడంతో పోలీసులు ఇప్పుడు హర్హం వ్యక్తంచేస్తున్నారు.

22మందితో కమిటీ
కాగా, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమలుకు డీజీపీ సవాంగ్‌ 22 మంది పోలీసు ప్రతినిధులతో కమిటీ ఏర్పాటుచేశారు. ఈ కమిటీకి శాంతిభద్రతల ఏడీజీ చైర్మన్‌గా ఉంటారు. పర్సనల్‌ డిపార్టుమెంట్, గుంటూరు ఐజీలు, ఏలూరు రేంజ్‌ డీఐజీ, గుంటూరు రూరల్, కృష్ణా జిల్లా ఎస్పీలు, విజయవాడ శాంతిభద్రతల డీసీపీ, ఎస్‌ఐబీ ఎస్పీ, ఏపీఎస్‌పీ బెటాలియన్స్‌ డీఐజీ, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ ఓఎస్‌డీ, ఏపీఎస్‌పీ 6వ బెటాలియన్‌ కమాండెంట్, అసిస్టెంట్‌ కమాండెంట్, కృష్ణాజిల్లా సీసీఎస్‌ డీఎస్పీ, కమాండ్‌ కంట్రోల్‌ డీఎస్పీ, గుంటూరు అర్బన్‌ ఏఆర్‌ డీఎస్పీ, గుంటూరు అర్బన్, విజయవాడ సిటీ సీఐలు, గుంటూరు రూరల్, గుంటూరు అర్బన్‌ ఎస్సైలు, శ్రీకాకుళం, ప్రకాశం, ఏపీఎస్‌పీ బెటాలియన్‌ ఐటీ కోర్‌ టీమ్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

ఈ కమిటీ పోలీసు శాఖలోని అన్ని విభాగాలను పరిశీలిస్తుంది. ఏ విభాగంలో ఏ రోజు వీక్లీ ఆఫ్‌ అమలుచేయాలి? రాష్ట్రవ్యాప్తంగా వీక్లీ ఆఫ్‌ అమలులో ఇబ్బందులేంటి? వాటిని అధిగమించాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? సిబ్బంది కొరత, వీక్లీ ఆఫ్‌ తీసుకుంటే వారి బాధ్యతలు ఎవరు చేపట్టాలి వంటి అన్ని కోణాల్లోను కమిటీ పరిశీలిస్తుంది. వారం రోజుల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని, దాని ఆధారంగా పోలీసులకు వీక్లీఆఫ్‌ను ప్రభుత్వం అమలుచేస్తుందని డీజీపీ తన సర్క్యులర్‌లో వివరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top