‘పథకం’ నీటిపాలు! | staff closed the hole with the orders of officials | Sakshi
Sakshi News home page

‘పథకం’ నీటిపాలు!

Jan 5 2014 2:43 AM | Updated on Aug 21 2018 12:23 PM

భారీ మంచినీటి పథకానికి నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన తూరను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బంది మూసివేశారు.

కోటనందూరు, న్యూస్‌లైన్ : భారీ మంచినీటి పథకానికి నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన తూరను గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఉన్నతాధికారుల ఆదేశాలతో సిబ్బంది మూసివేశారు. తుని నియోజక వర్గంలోని 82 గ్రామాలకు తాగునీరు అందించేందుకు తలపెట్టిన మంచినీటి పథకానికి నీటిని తీసుకునేందుకు అనుమతులు ఉన్నాయంటూ జిల్లా ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు ఇటీవల మండలంలోని అల్లిపూడిలో నిర్మిస్తున్న మంచినీటి శుద్ధి ప్లాంట్‌కు సమీపంలోని విశాఖ జిల్లా నాతవరం మండలంలోని చినగొలుగొండపేట సమీపంలో విశాఖపట్నానికి నీటిని సరఫరా చేసే ఏలేరు ఏడమ కాలువకు తూరను ఏర్పాటు చేశారు.

మంగళవారం జీవీఎంసీ, విస్కో బృందం కాలువ తనిఖీ చేస్తుండగా, మంచినీటి పథకానికి వేసిన తూర కంట పడింది. దీంతో ఆగ్రహించిన అధికారుల బృందం తక్షణమే తూర మూసివేయాలంటూ ఆదేశించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా అధికారులు నీటిని తీసుకునేందుకు తమకు ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు. జీవీఎంసీ అధికారులకు ఆ ఉత్తర్వులు అందకపోవడంతో శనివారం కాలువకు నీటి విడుదలను దృష్టిలో ఉంచుకుని తూరను మూసివేసినట్టు జీవీఎంసీ వర్‌‌క ఇన్‌స్పెక్టర్ వేణు తెలిపారు. ఉత్తర్వులు అందించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు మరో ఐదు రోజుల గడువు కోరినట్టు చెప్పారు.

 ‘మూసుకుపోయిన’ ఆశలు
 భారీ మంచినీటి పథకానికి నీటిని సర ఫరా చేసేందుకు ఏలేరు కాలువకు ఏర్పాటు చేసిన తూరను జీవీఎంసీ అధికారులు మూసివేయడంతో నీటి సేకరణ ఆశలు మరోమారు మూసుకుపోయాయి. ఈ మంచినీటి పథకానికి మొదట తాండవ జలాశయం నుంచి నీటిని తీసుకోవాలని అనుమతులు పొందినా, ఆయక ట్టు రైతులు ఉద్యమం చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్థాయిలో ఉన్నతాధికారులు సంప్రదింపులు జరిపి, ఏలేరు రిజర్వాయర్ నీటిని అందించేందుకు అధికారులు అనుమతులు పొందారు.

అయినా ఈ కాలువపై పూర్తి అధికారం తమకే ఉందని, ఎవరికీ అనుమతి ఇవ్వలేదని విశాఖపట్నం ఇండస్ట్రియల్ వాటర్ సప్లయి కంపెనీ తేల్చిచెప్పింది. ఇందులో భాగంగానే మంచినీటి పథకానికి వేసిన తూరను తొలగించాలని జీవీఎంసీ అధికారులు నిర్ణయించారు. ఏలేరుతో సమస్య పరిష్కారం అవుతుందని భావించిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు నీటి సేకరణ సమస్య మొదటికి రావడంతో తలపట్టుకోవాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement