పదో తరగతి పరీక్షలు ప్రారంభం

SSC Exams Begin Under Tight security In Two Telugu States - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగు  రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఏపీలో పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈనెల 29 వరకు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థుల హాల్‌టికెట్లను ఇప్పటికే ఆయా పాఠశాలలకు పంపించడంతో పాటు వాటిని వెబ్‌సైట్లో (www.bseap.org) కూడా పొందుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా 11,356 పాఠశాలలకు చెందిన 6,17,484 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,834 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఇక తెలంగాణలోనూ పదోతరగతి పరీక్షలకు మొదలయ్యాయి. గురువారం నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు (కొన్ని సబ్జెక్టులు 12:45 గంటల వరకు) జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8:45 గంటల కల్లా పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం 9:30 గంటల తర్వాత ఐదు నిమిషాల వరకే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,542 కేంద్రాల్లో 5,38,867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులందరికీ ఇప్పటికే హాల్‌టికెట్లు జారీ చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. హాల్‌టికెట్లు అందని వారు  www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది.  

పరీక్ష హాల్లోకి సెల్‌ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించబోరు. హాల్‌టిక్కెట్లు తప్ప ఇతర పేపర్లను తీసుకుపోరాదు. హాల్‌టిక్కెట్ల రోల్‌ నెంబర్లను, మెయిన్‌ ఆన్షర్‌ షీట్లు, అడిషనల్, బిట్, మ్యాప్, గ్రాఫ్‌ షీట్లతో సహ ఎక్కడా రాయరాదు. ఊరు, పేరు, సంతకం వంటి ఇతర చిహ్నాలు పెట్టరాదని అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులను తొలి రెండు రోజులు మాత్రమే పరీక్ష ప్రారంభమైన అరగంటవరకు అనుమతిస్తామని, తరువాత నుంచి అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top