స్పాట్ రగడ


సాక్షి, విశాఖపట్నం : తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్) పరిధిలోని ఐదు జిల్లాల్లో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరుగుతున్నాయి. కారణమేమిటని ఆరా తీసిన కొత్త సీఎండీ ఆర్.ముత్యాలరాజుకు స్పాట్ బిల్లింగ్ ఆలస్యమే కారణమని తెలిసింది. దీంతో నిర్ణీత సమయంలో విద్యుత్ బిల్లులు తీసేలా చూడమని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే గడువులోపు స్పాట్ బిల్లింగ్ పూర్తయ్యే పనికాదని కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు.

 

 ఈ నేపథ్యంలో కాంట్రాక్టు నిబంధనల ప్రకారం నడుచుకోని స్పాట్ బిల్లింగ్ ఏజెన్సీలపై సీఎండీ ఏ నిర్ణయం తీసుకోనున్నారనే ఉత్కంఠ నెలకొంది. మరో వైపు సీఎండీ ఆదేశాలతో స్పాట్ బిల్లింగ్ ఏజెన్సీలు ‘టేబుల్ రీడింగ్’ తీస్తూ మరో తప్పు చేస్తున్నాయి. ఉభయగోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 52.73 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు ‘ఈపీడీసీఎల్’ విద్యుత్ సరఫరా చేస్తోంది.

 

  వారి వద్ద నుంచి ప్రతి నెలా రూ.511 కోట్ల బిల్లులు వసూలు చేస్తోంది. దీనిలో హెచ్‌టీ మినహా మిగతా అన్ని సర్వీసుల మీటర్ రీడింగ్ తీసి, బిల్లులు ఇచ్చే పనిని ఆయా జిల్లాల్లో ప్రైవేట్ స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీరికి ఒక్కో బిల్లుకు రూ.3.10 నుంచి రూ.3.30 పైసలు చొప్పున కమీషన్ ఇస్తున్నారు. ప్రతి నెలా 4 నుంచి 11వ తేదీ వరకూ ఓ స్లాట్‌లో, 14 నుంచి 21 వరకూ మరో స్లాట్‌లో మీటర్ రీడింగ్ తీయాలి. కానీ కాంట్రాక్టర్లు గడువులోపు బిల్లులు ఇవ్వలేకపోతున్నారు. రీడింగ్ ఆలస్యమవడంతో స్లాబ్ మారిపోయి బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి.

 

 దీనిపై జిల్లాల్లో ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర స్థాయిలో విద్యుత్ అధికారులకు ఒత్తిళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పాట్ బిల్లింగ్‌పై సమీక్ష జరిపిన సీఎండీ ఇక మీదట గడువు దాటకుండా రీడింగ్ తీయాల్సిందేనని స్పష్టం చేశారు. సీఎండీ ఆదేశాలతో కాంట్రాక్టర్లు కలవరపడుతున్నారు. ఈఆర్‌ఓ కార్యాలయం నుంచి బిల్లులకు సంబంధించిన సమాచారం 3 నుంచి 6వ తేదీ వరకూ వస్తూనే ఉంటున్నందున 4వ తేదీ నుంచి రీడింగ్ ప్రారంభించడం కుదరడం లేదనేది వారి వాదన. అయితే ఒప్పందం చేసుకున్నప్పుడు నిర్ణీత సమయాలకే రీడింగ్ అప్పగిస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు సాకులు వెదకవద్దనేది అధికారుల మాట. నిజానికి పలువురు కాంట్రాక్టర్లు తక్కువ మంది సిబ్బందితో కాలం వెళ్లదీస్తూ బిల్లులు ఆలస్యం చేస్తున్నారు. సీఎండీ ఆదేశాల వల్ల సిబ్బందిని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కానీ అలా చేయకుండా, ఇంటింటికీ వెళ్లి రీడింగ్ తీసే సమయం లేదని టేబుల్ రీడింగ్‌తో (ఒక చోట కూర్చొని అంచనాతో బిల్లు వేయడం) బిల్లులు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా బిల్లుల్లో తప్పులు దొర్లి వినియోగదారులపై భారం పడుతోంది. ఈ విషయంపైనా ‘ఈపీడీసీఎల్’ దృష్టి సారించాల్సి ఉంది. అయితే ఎలాగోలా బిల్లులు ఇచ్చేయమని అధికారులు ఒత్తిడి చేయడం వల్లనే అలా చేయాల్సి వస్తోందని కొందరు కాంట్రాక్టర్లు ఆరోపిస్తుండటం విశేషం.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top