బిల్లుపోటు | Spot billing problem | Sakshi
Sakshi News home page

బిల్లుపోటు

Jun 12 2015 12:00 AM | Updated on Sep 5 2018 2:06 PM

తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్)కు బిల్లుపోటు ఎదురైంది.

‘ఈపీడీసీఎల్’కు స్పాట్‌బిల్లింగ్ సమస్య
అలకబూనిన కాంట్రాక్టర్లు
లేటుతో వినియోగదారులకు వాత
సవరణ తెచ్చిన సీఎండీ
ససేమిరాఅంటున్న కాంట్రాక్టర్లు

 
విశాఖపట్నం: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఈపీడీసీఎల్)కు బిల్లుపోటు ఎదురైంది. ఇది చార్జీల పోటుకాదు. స్పాట్ బిల్లింగ్ తలనొప్పి. స్పాట్ బిల్లింగ్ ఏజెన్సీలు, యాజమాన్యానికి మధ్య వివాదం చినికి చినికి గాలి వానలా మారుతోంది. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలో కాంట్రాక్టర్లు స్పాట్ బిల్లింగ్ తీయమంటూ నిలిపివేశారు. సీఎండీ మాత్రం నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతున్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో 52లక్షల 73వేల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వారి నుంచి ప్రతినెలా రూ.511కోట్ల రూపాయల బిల్లులను సంస్థ వసూలు  చేస్తోంది. సర్వీసుల మీటర్ రీడింగ్ , బిల్లుల పనిని ప్రతి జిల్లాలో సుమారు 200 మంది ప్రైవేట్ స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీరు ప్రతినెలా 4వ తేదీ నుండి 11వ తేదీ వరకూ ఓ స్లాట్‌లో, 14 నుంచి 21వరకూ మరోస్లాట్‌లో మీటర్ రీడింగ్ తీయాలి. గత కొన్నేళ్లుగా ఇదే నడుస్తోంది.

కాంట్రాక్టర్లు గడువులోపు బిల్లులు ఇవ్వలేకపోతున్నారని, రీడింగ్ ఆలస్యమవడంతో స్లాబ్ మారిపోయి బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని సీఎండీ ఆర్ ముత్యాలరాజుకు వినియోగదారుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. పలువురు కాంట్రాక్టర్లు తక్కువ మంది సిబ్బందితో కాలం వెళ్లదీస్తూ బిల్లులు ఆలస్యం చేస్తున్నారని గుర్తించిన సీఎండీ గడువులోపు రీడింగ్‌తీయాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో కాంట్రాక్టర్లు టేబుల్ రీడింగ్‌తో (ఒక చోట కూర్చొని అంచనా) బిల్లులు ఇచ్చేయడం ప్రారంభించారు. ఫలితంగా బిల్లుల్లో మరలా తప్పులు దొర్లి వినియోగదారులపై భారం పడుతోంది. దీనిని గమనించిన సీఎండీ స్పాట్ బిల్లింగ్‌లో సమూల మార్పులు అవసరమని భావించి దాని ప్రకారం రేట్లు నిర్ణయించారు. సర్వీసుకి రూ.1.85 నుంచి రూ.2.31పైసలు కమిషన్‌గా నిర్ధారించారు. రేట్లు తక్కువగా ఉన్నాయని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. సీఎండీ తన నిర్ణయాన్ని సవరించేది లేదని తేల్చి చెప్పడంతో వివాదం ముదిరింది. మార్చి 31తో ఏజెన్సీల కాంట్రాక్టు గడువు ముగిసింది. కొత్త కాంట్రాక్టు కుదిరేవరకూ పాత కొనసాగవచ్చని సీఎండీ చెప్పడంతో వీరు బిల్లింగ్ చేస్తున్నారు. కొద్ది రోజులుగా పశ్చిమగోదావరి జిల్లాలో కాంట్రాక్టర్లు బిల్ రీడింగ్ నిలిపివేశారు. దీంతో ఈపీడీసీఎల్ తాత్కాలిక సిబ్బంది, శాశ్వత సిబ్బందితో రీడింగ్ తీయిస్తోంది.  శ్రీకాకుళం జిల్లాలో వచ్చే నెల నుంచి బిల్లింగ్ చేయమంటున్నారు. అగ్రిమెంట్ కాలాన్ని రెండేళ్లు చేయాలని, స్పాట్ బిల్లింగ్ రేట్లను 33 శాతానికి పెంచి కొత్త రేట్లు నిర్ణయించాలని,సబ్ డివిజన్ వారీగా పిలిచిన టెండర్లను మార్చి సెక్షన్ వారీగా పిలవాలని డిమాండ్లతో స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు బిల్లు తీయకుండా, టెండరులో పాల్గొనకుండా నిరసన తెలుపుతున్నారు.
 
 రేట్లు తక్కువేం కాదు:
 ‘‘స్పాట్ బిల్లింగ్ రేట్లు ఓవరల్‌గా చూస్తే గతం కంటే ఎక్కువగానే ఉన్నాయి. మీటర్ రీడర్లకు ఈఎస్‌ఐ, పీఎఫ్ కట్టాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు సెక్షన్ వారీ టెండర్లకు పట్టుబడుతున్నారు. సెక్షన్‌కు ఐదుగురికి మించి ఉండరు కనుక ఆ నిబంధనలు వర్తించవని వారి ఆలోచన. కానీ అలా చేయడం వల్ల మీటర్ రీడర్లు నష్టపోతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కనీసం డివిజన్ వారీగా టెంటర్లు వేయమన్నాం. అదీ కుదరదంటే మేం చేయగలిగింది ఏమీ లేదు. ప్రత్యామ్నాయాలు చూస్తాం.’’
 - ఆర్.ముత్యాలరాజు, సీఎండీ, ఈపీడీసీఎల్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement