టీడీపీ జిల్లా మినీమహానాడులో ప్రజా సమస్యలపై చర్చించి,ఈ నెలాఖరు లో జరిగే రాష్ట్ర మహానాడుకు పంపేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.
- 12 అంశాలతో టీడీపీ జిల్లా మినీ మహానాడులో అజెండా
- 5 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం
- ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం
సాక్షి, విజయవాడ : టీడీపీ జిల్లా మినీమహానాడులో ప్రజా సమస్యలపై చర్చించి,ఈ నెలాఖరు లో జరిగే రాష్ట్ర మహానాడుకు పంపేందుకు పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. కంచికచర్ల మండలం దొనబండలోని ఉమా హాలిడే ఇన్ ప్రాంగణంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అధ్యక్షతన గురువారం ఉదయం మినీమహానాడు జరగనుంది. అన్ని జిల్లాల్లోనూ గురువారం జిల్లాల మినీ మహానాడులు జరుగుతున్నందున పార్టీ అధినేత చంద్రబాబు 12 అంశాలతో కూడిన అజెండా పంపారు. ఆ అంశాలతోపాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై జిల్లా మినీమహానాడులో నాయకులు చర్చించనున్నారు.
రాజధాని, రైతు, డ్వాక్వా రుణాల మాఫీపై చర్చ
నూతన రాజధాని ఏర్పాటులో ఎదురవుతున్న ఇబ్బందులు, రైతు, డ్వాక్రా మహిళల రుణమాఫీ తీరు తెన్నులపై జిల్లా మినీమహానాడులో కీల కంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాజధాని నిర్మాణం, రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం, కొత్తపరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తే అందించాల్సిన సహాయ సహకారాలపై చర్చిస్తారు. జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై చర్చించి పార్టీ, ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారు. యువశక్తిని సద్వినియోగం చేసుకోవడం, వారికి ఉద్యోగాలు కల్పించడానికి సలహాలు సూచనలు, మానవ వనరుల అభివృద్ధిపై కులంకుషంగా చర్చించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నెల కొన్న ప్రజాసమస్యలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు ప్రతిపాదిస్తారు. 16 నియోజకవర్గాల్లోని ఉమ్మడి సమస్యలపై జిల్లా మినీమహానాడులో చర్చించి, మహానాడుకు పంపుతారు.
4 వేల మందికి ఆహ్వానాలు
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి సర్పం చులు, ఇన్‌చార్జిల వరకూ సుమారు 4వేల మందికి జిల్లా మినీ మహానాడుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానాలు అందాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ జిల్లా మినీ మహానాడుకు సుమారు 5వేల మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా.