సరదాగా చదరంగంలోకి వచ్చా..!

Special Article On Occasion Of National Women's Day - Sakshi

మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ ప్రత్యూష

ఒక్కో మెట్టూ ఎక్కుతూ అంతర్జాతీయ స్థాయికి

సాక్షి, తుని: సరదాగా నేర్చుకున్న చదరంగం క్రీడ సమాజంలో గుర్తింపు ఇస్తుందని ఊహించలేదు.. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఒక్కో మెట్టూ ఎక్కుతూ చివరకు మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ కావడం వెనక ఎన్నో ఏళ్ల శ్రమ ఉందని బొడ్డా ప్రత్యూష అన్నారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ఉన్నత శిఖరానికి చేరడం వెనక తల్లిదండ్రుల ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనిదని ఆమె వివరించారు. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనమిది.

ప్రత్యూష తండ్రి ప్రసాద్‌ వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. విధులు ముగించుకుని ఇంటికొచ్చాక తన తండ్రి చదరంగం ఆడుతుండడం ప్రత్యూష ఆసక్తిగా గమనించేవారు. ఇలా ఏడేళ్ల వయసులో ఆమె సరదాగా చదరంగం అలవాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ క్రీడలో రాణిస్తూ వచ్చారు. ఇలా 16 ఏళ్ల పాటు జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొని మేటి చెస్‌ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. ఇంగ్లాండ్‌లో జరిగిన చెస్‌ టోర్నీలో విజయం సాధించి మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. 

మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ ప్రత్యూష 
ప్రపంచ చాంపియన్‌ లక్ష్యం  
ప్రస్తుతం విశాఖ జిల్లా పాయకరావుపేటలో ప్రత్యూష కుటుంబం ఉంటుంది. చిన్నతనంలో ప్రత్యూష తండ్రి ప్రసాద్, తాతయ్య వెంకటరమణలు ఈ క్రీడలో ప్రోత్సహించారు. అప్పట్లో శ్రీప్రకాష్‌ విద్యా సంస్థలో చదువుతూనే చెస్‌ టోర్నీల్లో పాల్గొని రాణించారు. ఇప్పటి వరకు 45 దేశాల్లో జరిగిన పోటీల్లో 25 అంతర్జాతీయ, 8 జాతీయ స్థాయి పతకాలను సాధించారు. 2016లో రెండు నార్మ్‌లు సాధించినా మూడో నార్మ్‌కు మూడేళ్ల సమయం పట్టింది. ప్రస్తుతం 2,230 రేటింగ్‌లో ఉన్న ప్రత్యూష 2,500 రేటింగ్‌కు చేరుకుంటే మూడు గ్రాండ్‌ మాస్టర్స్‌ నార్మ్‌లు సాధించి గ్రాండ్‌ మాస్టర్‌ కావాలని ఆశిస్తున్నారు. అదే సాధిస్తే ఆమె పురుషులతో కూడా ఆడొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ఉన్నారు. మూడో మహిళా గ్రాండ్‌ మాస్టర్‌గా ప్రత్యూష ఘనత సాధించారు. ప్రపంచ చాంపియన్‌ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు. 

ముఖ్యమంత్రి అభినందన  
మహిళా గ్రాండ్‌ మాస్టర్‌ సాధించిన ప్రత్యూష భవిష్యత్‌లో గ్రాండ్‌ మాస్టర్‌ కావాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించారు. ఇటీవల అమరావతిలో ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా సారథ్యంలో ముఖ్యమంత్రిని ప్రత్యూష కలిశారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహమిస్తామని హామీ ఇచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top