శౌర్యానికి ప్రతిరూపం

Sowrya chachra award for the soldier - Sakshi

ఆత్మాహుతి దళం ఆటకట్టు

ముగ్గురు ముష్కరులు హతం

350 మంది సైనికులు క్షేమం

వీర జవాన్‌ ఆబోతుల వెంకటరావు సాహసం

శౌర్యచక్ర ప్రదానం చేసిన భారత రాష్ట్రపతి 

నీడని సైతం అనుమానించాలి. నిఘా నేత్రం ప్రసరించాలి. నేత్ర వీక్షణం సునిశితంగా సాగాలి. అప్పుడే సైనికుడు శత్రువు అంతు చూడగలడు. అవన్నీ ప్రదర్శించబట్టే ఆబోతుల వెంకటరావు ఆత్మాహుతి ముష్కర మూకల్ని మట్టుబెట్టగలిగాడు.

వందలాది భారత వీరుల ఊపిరి నిలబెట్టగలిగాడు. భారత ప్రభుత్వ ‘శౌర్యచక్ర’ పురస్కారం అందుకోగలిగాడు. ఆయన సాహసం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. రక్తం తాగే పిశాచాలని కుమ్మేసిన ఆబోతుల వెంకటరావు సాహసగాథ ఆయన మాటల్లో చదవండి.      – విజయనగరం టౌన్‌ 

ఆరోజు 2016 అక్టోబర్‌ 6వ తేదీ. జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ నియంత్రణ రేఖలో విధులు నిర్వరిస్తున్నాను. నేనున్న 8 మద్రాస్‌ జనరల్‌ రెజిమెంట్‌ ముందు అలజడి.. ఏదో జరుగుతోంది.. అనుమానం నిజమైంది. శత్రువులు చొరబడ్డారు. ఆత్మాహుతి దళానికి చెందిన ముగ్గురు మిలిటెంట్లు తచ్చాడుతున్నారు.

ఆర్మీ రెజిమెంట్‌పై దాడికి ప్రయత్నిస్తున్నారు.. సమయం లేదు.. అప్రమత్తం కావాలని సైన్యాన్ని సూచనలు ఇచ్చాను. ఇది గమనించిన తీవ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. క్యాంప్‌లోకి చొరబడి ఆత్మాహుతి చేసుకోవాలన్నది వారి పన్నాగం.

అదే జరిగితే.. పది నిమిషాల్లో మొత్తం బూడిదయ్యేది. సుమారు 350 మంది సైనికులు బలయ్యేవారు. గతంలో కమాండ్‌ కంట్రోల్‌ కోర్సులో పొందిన శిక్షణ నాకెంతగానో ఉపయోగపడింది. ఏకే 47తో పాయింట్‌ వ్యూలో ఒకే షాట్‌లో ఇద్దరు మిలిటెంట్లను హతమార్చాను. ఆ వెంటనే.. మూడో తీవ్రవాదిని కూడా మట్టుబెట్టాను. డ్యూటీ పోస్టులో ఉన్న ఏ ఒక్కరికీ చిన్న గాయం కూడా కాకుండా కాపాడాను. 

చిన్నప్పటినుంచి సైన్యమంటే ఆసక్తి

మాది విజయనగరం వద్ద జమ్మునారాయణపురం గ్రామం. ఇంటర్‌ మీడియట్‌ వరకూ చదివాను. చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలన్న ఆసక్తి వల్ల సాధన చేసేవాడిని. ఇంటర్‌మీడియట్‌ పూర్తయిన సమయంలో తొలిసారిగా ఏలూరులో నిర్వహించిన ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో డాక్యుమెంటేషన్‌లో నెగ్గలేకపోయాను.

ఆ తర్వాత 2009లో విజయనగరం విజ్జీ స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ఎంపికయ్యాను. ప్రస్తుతం ప్రత్యేక విధుల్లో భాగంగా యూఎన్‌ఓలో సభ్యత్వం పొందిన ఆఫ్రికాలోని సౌత్‌ సూడాన్‌కి పంపించారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతల పరిరక్షణ విధులు నిర్వరిస్తున్నాను. 2013లో శ్యామలని వివాహం చేసుకున్నాను.  మూడున్నరేళ్ల హరిణి, నాలుగునెలల ఈషా నా సంతానం 

శౌర్యచక్ర ఓ అద్భుతం

నా సాహసం గుర్తించిన మా టీమ్, ఆర్మీ రెజిమెంట్‌ శౌర్యచక్రకు నామినేట్‌ చేయడం.. రాష్ట్రపతి కోవింద్‌ నుంచి పురస్కారం అందుకోవడం ఓ అద్భుతమైతే.. 60 ఏళ్లలో మా రెజిమెంట్‌కు వచ్చిన తొలి శౌర్య అవార్డు కావడం ఆనందంగా ఉంది. జిల్లాలో కూడా తొలి శౌర్యచక్ర అందుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందడం ఎంతో సంతృప్తినిచ్చింది. 

ఎంతో ఆనందంగా ఉంది

భారతదేశం గర్వించదగ్గ పురస్కారాన్ని శౌర్యచక్ర మా బిడ్డ అందుకోవడం ఆనందంగా ఉంది. మారుమూల గ్రామం నుంచి వెళ్లి సరిహద్దుల్లో ప్రాణాలను లెక్క చేయకుండా శత్రుమూకల్ని చీల్చి చెండాడిన వెంకటరావు సేవల్ని గుర్తించడం మరువలేం.   –రాము, చిట్టమ్మ 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top