త్వరలో జరగబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోలీసు సిబ్బంది నిజాయితీగా, నిబంధనలకు అనుగుణంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ పిలుపునిచ్చారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : త్వరలో జరగబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోలీసు సిబ్బంది నిజాయితీగా, నిబంధనలకు అనుగుణంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ పిలుపునిచ్చారు.
రాజకీయ నేతల ఒత్తిళ్లకు, ఇతర ప్రయోజనాల కోసం పక్షపాతంగా పనిచేస్తే ఎవరిమీదైనా వేటు వేస్తామని హెచ్చరించారు. శుక్రవారం తనను కలిసిన సాక్షి ప్రతినిధితో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి అయిందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కోసం ఈ పోలింగ్ కేంద్రాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
జిల్లాలోని సబ్ డివిజనల్ పోలీసు అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, స్టేషన్‌హౌస్ ఆఫీసర్లతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మరో ఒకటి, రెండు రోజుల్లో బదిలీల ప్రక్రియ కూడా పూర్తవుంతుదని చెప్పారు. త్వరలోనే సబ్‌డివిజన్ల వారీగా పర్యటించి అక్కడి పోలీసు అధికారులతో సమావేశాలు నిర్వహించి స్థానిక పరిస్థితులను అంచనా వేస్తామన్నారు. దీంతో పాటే పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల్లో ఎలా పనిచేయాలనే దాని గురించి కచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తానన్నారు.
ఎన్నికలు నిష్పక్షికంగా, ప్రశాంతంగా నిర్వహించడమే తన ముందున్న టార్గెట్‌గా ఎస్పీ వివరించారు. ప్రజల విజ్ఞప్తులు, వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి సోమవారం విజ్ఞప్తుల దినం నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత కూడా ఏదైనా అత్యవసరమనిపిస్తే ప్రజలు నేరుగా తనతో సంప్రదించవ్చన్నారు.
కార్యాలయంలో అందుబాటులో లేకపోతే ఫోన్‌లో నైనా తనతో మాట్లాడవచ్చని ఎస్పీ వివరించారు. ప్రజలకు దగ్గరగా, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకు వచ్చే విధంగా తన పనితీరు ఉంటుందని గ్రేవాల్ తెలిపారు.