breaking news
sub divisional police
-
రైలు పట్టాలపై మృత్యు ఘోష
ప్రమాదవశాత్తు పట్టాలు దాటే క్రమంలో కొందరు..ఆర్థిక పరిస్థితులు, కుటుంబ కలహాలతో మరికొందరు..రైల్లో నుంచి జారిపడి ఇంకొందరు ప్రాణాలు విడుస్తున్నారు. ఇలా నిత్యం ఏదోక రూపంలో రైలు పట్టాలపై మృత్యు ఘోష వినిపిస్తోంది. రైలు ప్రమాదాల్లో గుర్తించిన మృతదేహాలు బంధువులకు చేరుతున్నా..గుర్తింపులేనివి కుటుంబ సభ్యుల కడచూపునకు నోచుకోకపోవడం విషాదకరం. నెల్లూరు(క్రైమ్): నెల్లూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలోని ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో 444 కిలోమీటర్ల మేర రైలు మార్గం విస్తరించి ఉంది. నిత్యం సుమారు 120 రైళ్ల వరకు రాకపోకలు సాగిస్తుంటాయి. రైల్వే ప్రయాణికులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం..ప్రమాదాల నివారణ చర్యల్లో రైల్వే అధికారుల ఉదాసీనత వెరసి నిత్యం ఏదోక చోట నిండు ప్రాణాలు రైలు చక్రాల కింద నలుగుతున్నాయి. రైలు ప్రమాదాల్లో ఎలాగోలా గుర్తించిన మృతదేహాలు బంధువులకు చేరుతున్నా...గుర్తింపులేనివి అనాథ శవాలుగా మిగిలిపోతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మాసాంతం వరకు నెల్లూరు రైల్వే సబ్‌డివిజన్ పరిధిలో రైలు పట్టాలపై జారిపడి, బలవన్మరణం, సహజ రూపాల్లో 229 మంది మృతి చెందారు. దీనిని బట్టి చూస్తే నెలకు సగటున 28 మందికిపైగా రైలు పట్టాలపై మృత్యువాత పడుతున్నారు. నెల్లూరు రైల్వే సబ్‌డివిజన్ పరిధిలోని చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు పరిధిలో చిన్న, పెద్ద రైల్వేస్టేషన్లు కలిపి 55 ఉన్నాయి. వీటి పరిధిలో ప్రతిరోజూ ఏదోక ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రైలు పట్టాలు దాటుతూ, రైల్లో నుంచి జారిపçడి, రైలు కిందపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమేపి పెరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు మాసాంతం వరకు రైల్లో నుంచి ప్రమాదవశాత్తు జారిపడి 107మంది మృతి చెందారు. ప్రేమ విఫలమై, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో 110 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 12 మంది అనారోగ్యం, ఇతర కారణాలతో మృతి చెందారు. మొత్తంగా వివిధ కారణాలతో 229 మంది మృతి చెందారు. అందులో 122 మంది వివరాలు లభ్యం కాగా వారి మృతదేహాలను రైల్వే పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన 107 మంది వివరాలు లభ్యం కాకపోవడంతో అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించారు. గుర్తింపు కష్టతరం.. నెలకు సగటన 28 మంది రైలు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు. వారి మృతదేహాలు ఛిద్రమై గుర్తుపట్టలేని విధంగా మారుతుంటాయి. అనేక సందర్భాల్లో మృతదేహాలు రైలుపట్టాల పక్కనున్న ముళ్ల పొదలు, పిచ్చిమొక్కల మధ్యన పడితే కొన్నిరోజుల వరకు ఎవరూ గుర్తించలేరు. అలాంటి పరిస్థితుల్లో మృతదేహాల గుర్తింపు, తరలింపు మరింత దారుణంగా ఉంటుంది. అయిన వారు సైతం మృతదేహాలను గుర్తుపట్టడం కష్టతరమే. నిబంధనల ప్రకారం గుర్తుతెలియని మృతదేహాలను 72గంటల పాటు మార్చురీలో భద్రపరచాల్సి ఉంటుంది. అప్పటికీ మృతుడి సంబం«దీకులు ఎవ్వరూ రాకపోతే రైల్వే పోలీసులే దగ్గరుండి ఖననం చేయిస్తారు. సంబంధీకుల కడసారి చూపునకు కూడా నోచుకోక ఎంతోమంది అనాథలుగా కాలగర్భంలో కలిసిపోతున్నారు. అధికశాతం ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణంగా నిలుస్తోంది. కదిలే రైలు నుంచి ఎక్కడం, దిగడం, ఫుట్‌బోర్డు ప్రయాణం, అటు, ఇటు గమనించకుండా అజాగ్రత్తగా రైలుపట్టాలు దాటడం, తదితరాలు కారణాలుగా నిలుస్తున్నాయి. కొనఊపిరితో ఉన్న కాపాడలేని పరిస్థితి సాధారణంగా రహదారిపై జరుగుతున్న ప్రమాదాలు అందరికి కనిపిస్తుంటాయి. రోడ్డు ప్రమాదం జరిగితే ఆయ్యో అంటూ ప్రజలు పరుగులు తీసి అవసరమైన సాయం అందిస్తారు. కానీ రైలు పట్టాలపై జరిగే ఘటనలు చాలా వరకు ఎవ్వరికి కనిపించవు. ప్రమాదవశాత్తు కొందరు.జీవితంపై విరక్తి చెంది మరికొందరు ఇలా ఎందరో రైలు చక్రాల కింద నలిగి తనువు చాలిస్తున్నారు. రైలు పట్టాలపై జరిగే ప్రమాదాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. లోకో పైలెట్, కీమెన్లు, ట్రాక్మెన్లు స్టేషన్‌మాస్టర్ దృష్టికి తీసుకొస్తే ఆయన రైల్వే పోలీసులకు సమాచారం అందిస్తారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేస్తారు. లోకోపైలెట్, కీమెన్లు, ట్రాక్మెన్లు గుర్తించకపోతే అంతే సంగతులు. జనసంచారం కలిగిన ప్రాంతాల్లో రైలు ప్రమాదంలో తీవ్రగాయాలైన వారికి సకాలంలో వైద్యసేవలు అందించే అవకాశం ఉంది. జన సంచారం లేని ప్రాంతాల్లో తీవ్రగాయాల పాలైన వారిని కాపాడుకోలేని పరిస్థితి. కొన ఊపిరితో ఉన్నా ఎవరూ చూడక, వైద్య అందక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. -
ఒత్తిళ్లకు లొంగితే వేటే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : త్వరలో జరగబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోలీసు సిబ్బంది నిజాయితీగా, నిబంధనలకు అనుగుణంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవాల్ పిలుపునిచ్చారు. రాజకీయ నేతల ఒత్తిళ్లకు, ఇతర ప్రయోజనాల కోసం పక్షపాతంగా పనిచేస్తే ఎవరిమీదైనా వేటు వేస్తామని హెచ్చరించారు. శుక్రవారం తనను కలిసిన సాక్షి ప్రతినిధితో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి అయిందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కోసం ఈ పోలింగ్ కేంద్రాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. జిల్లాలోని సబ్ డివిజనల్ పోలీసు అధికారులు, ఇన్స్పెక్టర్లు, స్టేషన్‌హౌస్ ఆఫీసర్లతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేశామన్నారు. మరో ఒకటి, రెండు రోజుల్లో బదిలీల ప్రక్రియ కూడా పూర్తవుంతుదని చెప్పారు. త్వరలోనే సబ్డివిజన్ల వారీగా పర్యటించి అక్కడి పోలీసు అధికారులతో సమావేశాలు నిర్వహించి స్థానిక పరిస్థితులను అంచనా వేస్తామన్నారు. దీంతో పాటే పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల్లో ఎలా పనిచేయాలనే దాని గురించి కచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తానన్నారు. ఎన్నికలు నిష్పక్షికంగా, ప్రశాంతంగా నిర్వహించడమే తన ముందున్న టార్గెట్‌గా ఎస్పీ వివరించారు. ప్రజల విజ్ఞప్తులు, వారి సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి సోమవారం విజ్ఞప్తుల దినం నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత కూడా ఏదైనా అత్యవసరమనిపిస్తే ప్రజలు నేరుగా తనతో సంప్రదించవ్చన్నారు. కార్యాలయంలో అందుబాటులో లేకపోతే ఫోన్లో నైనా తనతో మాట్లాడవచ్చని ఎస్పీ వివరించారు. ప్రజలకు దగ్గరగా, నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకు వచ్చే విధంగా తన పనితీరు ఉంటుందని గ్రేవాల్ తెలిపారు.